సీఎం స్థాయి వ్యక్తి అలా వ్యాఖ్యానించడం సరికాదు
ఒక సంస్థకే కొమ్ము కాయడం సమంజసం కాదు
గతంలో అనుమానాలు వచ్చినప్పుడే ఎందుకు స్పందించలేదు?
ఇప్పుడే ఎందుకు రచ్చ చేస్తున్నారు?
ఇది రాజకీయ కుట్రలో భాగమే
తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు వ్యాఖ్యలపై భక్తుల ఫైర్
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానానికి రాజకీయ రంగు పులమడం.. శ్రీవారి ప్రసాదాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చాలా దారుణమని భక్తులు మండిపడుతున్నారు. ఏదో ఒక సంస్థ సరఫరా చేసే నెయ్యి బాగుందని చెప్పి మిగిలిన సంస్థలపై దుష్ప్రచారం చేయడం సమంజసం కాదన్నారు.
శ్రీవారి లడ్డూపై సీఎం చంద్రబాబు దారుణమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులను శుక్రవారం సాక్షి పలకరించగా వారు ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. – తిరుమల
చంద్రబాబు వ్యాఖ్యలు బాధాకరం
సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం శోచనీయం. ఏదైనా లోపాలుంటే వాటిని పరిగణనలోకి తీసుకుని చర్యలు చేపట్టాలి. ఇలా బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం తగదు. ఇది ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉంది.– శ్రీను, శ్రీవారి భక్తుడు, ఒంగోలు
సమగ్ర విచారణ చేయాలి..
ఆరోపణలు చేయడం కాదు సమగ్ర విచారణ జరపాలి. నందిని నెయ్యి బాగుందని చెప్పడం.. ఇతర కంపెనీల నెయ్యిపై ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సమంజసం కాదు. దీనిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నాం. భక్తులకు ప్రసాదంపై నమ్మకం పోతుందనే విషయం పాలకులు గమనించాలి. – రోహిత్, శ్రీవారి భక్తుడు, విశాఖపట్నం
ప్రసాదంపై నమ్మకం సన్నగిల్లేలా వ్యాఖ్యలు
దవారి ప్రసాదం అంటే మాకు వరంతో సమానం. తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లే విధంగా, సాక్షాత్తు శ్రీవారి ప్రసాదంపై నిందలు వేసే విధంగా సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడటం బాధాకరం. అసలు గతంలో అనుమానం వచ్చినప్పుడే దీనిపై ఎందుకు మాట్లడలేదు? ఇప్పుడు రచ్చ చేయడంపై అనుమానం వస్తోంది. ఇది రాజకీయ కుట్రలో భాగమేననిపిస్తోంది. స్వామివారిని రాజకీయ రొచ్చులోకి లాగడం దారుణం. – తంగవేలు, శ్రీవారి భక్తుడు, రాయవెల్లూరు జిల్లా, తమిళనాడు
ఇటువంటి వ్యాఖ్యలు తగదు
వారి భక్తుల మనోభావాలను దెబ్బతినేలా వ్యాఖ్యలు చేయడం రాజకీయ నాయకులకు తగదు. ఇలాంటి మాటలతో భక్తుల్లో అయోమయం నెలకొంది. లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి నాణ్యతలో లోపాలుంటే నిపుణుల కమిటీని ఏర్పాటుచేసి పరిశీలించాలి. ఉద్యోగులను సైతం కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం తగదు. – సుబ్రమణ్యం, టీటీడీ కాంట్రాక్టు ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు
మనోభావాలతో ఆటలా?
పవిత్రమైన తిరుమల ప్రసాదంపై విచ్చలవిడిగా మాట్లాడటం సమంజసం కాదు. భక్తులు సైతం ఇలాంటి ఆరోపణలను సహించరు. వారి మనోభావాలతో రాజకీయ నేతలు ఆడుకోవడం సబబు కాదు. ఉద్యోగులు సైతం ఇలాంటి మాటలపై అసహనం వ్యక్తంచేస్తున్నారు. కమిటీ వేసి నిజానిజాలను వెలికితీసి భక్తులకు తెలియజేయాల్సిన ప్రభుత్వం బహిరంగంగా ఆరోపణలు చేయడం సరికాదు.– జయచంద్ర, సీఐటీయూ నాయకులు, తిరుపతి
Comments
Please login to add a commentAdd a comment