ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
వైభవంగా ధ్వజారోహణ
ఒంటిమిట్ట రామాలయం (రాజంపేట): వైఎస్సార్ జిల్లాలోని ఒంటిమిట్ట (ఏకశిలానగరం)లో శ్రీకోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం ధ్వజారోహణతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి వేదపండితులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను మాడవీధుల్లో ఊరేగించారు.
ముత్యాల తలంబ్రాల ఊరేగింపు
శ్రీసీతారాముల కల్యాణానికి టీటీడీ తీసుకొ చ్చిన ముత్యాల తలంబ్రాలను ఊరేగించారు. టీటీడీ చైర్మన్ చదల వాడ కృష్ణమూర్తి, ప్రభు త్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి ముత్యాల తలంబ్రా లను ఆలయంలోని మూలవర్ల వద్ద ఉంచి పూజలు నిర్వహించారు.
10న కల్యాణోత్సవం
ఒంటిమిట్ట రామాలయంతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ అమలు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి చెప్పారు. ఆలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు టీటీడీ విçస్తృతంగా ఏర్పాట్లు చేసిందన్నారు. ఈనెల 10న సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. కల్యాణానికి గవర్నర్, ముఖ్యమంత్రి హాజరవుతారని చెప్పారు.