జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తున్న ఈవో సాంబశివరావు తదితరులు
త్యాగధనుల ఫలాలు అందరికీ అందాలి
Published Mon, Aug 15 2016 11:08 PM | Last Updated on Mon, Jul 29 2019 6:07 PM
– ఇతర ధార్మిక సంస్థలకు టీటీడీ ఆదర్శంగా నిలవాలి
– స్వాతంత్య్ర వేడుకల్లో టీటీడీ ఈవో
తిరుపతి అర్బన్: దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలనే త్యాగం చేసిన త్యాగధనుల ఫలాలు అందరికీ అందాలని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు కాంక్షించారు. 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని సోమవారం టీటీడీ పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఈవో టీటీడీ భద్రతా దళాల కవాతును తిలకించి, గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సెల్యూట్ చేశారు. ఆయన మాట్లాడుతూ ఎందరో వీరుల త్యాగఫలంగా వచ్చిన స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సామాన్య భక్తులు కూడా శ్రీవారి ఆర్జిత సేవల్లో పాల్గొనడమే గాక పారదర్శకత పెంచేందుకు వీలుగా ప్రతినెలా మొదటి శుక్రవారం వేలాది సేవా టికెట్లను ఇంటర్నెట్‌లో విడుదల చేస్తున్నామని తెలిపారు. రూ.300 ప్రత్యేక దర్శనం భక్తుల కోసం ప్రత్యేక కాంప్లెక్స్ నిర్మాణం పూర్తయిందన్నారు. రెండో దశలో దివ్యదర్శనం(కాలి నడకన వచ్చే) భక్తులకు మెరుగైన వసతులతో కూడిన కాంప్లెక్స్ నిర్మాణానికి చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని లడ్డూ కౌంటర్ల వద్ద 2 గ్రాముల శ్రీవారి బంగారు, వెండి, రాగి డాలర్లను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. కాషన్ డిపాజిట్లు లేకుండా లాకర్ల వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు.
శ్రీవారి ఆలయాల నిర్మాణానికి చేయూత
ఎస్సీ, ఎస్టీ, మత్స్యకారుల ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి టీటీడీ ద్వారా ఆర్థిక చేయూత అందిస్తున్నామన్నారు. టీటీడీ విద్యా సంస్థల్లోని విద్యార్థులకు చదువుతో పాటు నైతిక విలువలు, ఆధ్యాత్మిక చింతన పెంచేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. భజన మండళ్ల సంఖ్యను పెంచడం ద్వారా నాటక రంగానికి చేయూతనిస్తున్నట్లు తెలిపారు. స్విమ్స్, బర్డ్ ఆస్పత్రుల్లో మరింత మెరుగైన సేవలు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సాంస్కృతిక ప్రదర్శనలు, కళా బృందాల నృత్యాలు, టీటీడీ సెక్యూరిటీ గార్డు తిరుపాల్ ప్రదర్శించిన మ్యాజిక్ షో ఆకట్టుకున్నాయి. 202 మందికి ఉత్తమ సేవల ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జేఈవో పోలా భాస్కర్, టీటీడీ డీఈవో విజయకుమార్, ఎఫ్‌ఏ అండ్ సీఏవో బాలాజీ, లా ఆఫీసర్ వెంకటరమణ, డిప్యూటీ ఈవోలు చెంచులక్ష్మి, చిన్నంగారి రమణ, విజయసారథి, ట్రాన్స్‌పోర్టు జీఎం శేషారెడ్డి, భద్రతాధికారి శివకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement