మూగవానికి మాట..
ఏడుకొండలవాడి మహిమేనంటున్న ఎన్నారై కుటుంబం
సాక్షి, తిరుమల: ఆపద మొక్కులవాడా.. అనాథ రక్షకా.. గోవిందా.. గోవిందా.. అంటూ భక్తితో కొలిచే భక్తులను శ్రీవేంకటేశ్వరుడు కంటికి రెప్పలా కాపాడతాడని పురాణ గాథల్లో చదివాం.. ఇప్పుడు ప్రత్యక్షంగా రుజువైంది. శ్రీవారినే నమ్ముకున్న ఓ బధిరుడికి మాటలు వచ్చాయి. పుట్టుకతో మూగవాడైన తన కుమారుడు దీపక్ (18) శ్రీనివాసుని దర్శనం తర్వాతే బాగా మాట్లాడగలుగుతున్నాడని ఇంగ్లండ్‌లో స్థిరపడిన ప్రవాస భారతీయురాలు ప్రతిమ మీడియాకు వెల్లడించారు. ఆమె తెలిపిన వివరాల మేరకు.. ఢిల్లీకి చెందిన ప్రతిమ, సుభాష్ దంపతులు వృత్తిరీత్యా ఇంగ్లండ్‌లోని హ్యారో నగరంలో స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. దీపక్ (18) పుట్టు మూగ . చిన్నపాటి శారీరక సమస్యలు కూడా ఉన్నాయి. కుమారుడికి మాటలు రావాలని, ఆరోగ్యం కుదుటపడాలని దీపక్‌కు నాలుగేళ్ల వయసులో తల్లి ప్రతిమ తిరుమల శ్రీవారికి మొక్కుకున్నారు.
అనేక రకాల థెరపీలు చేయించగా 14 ఏళ్లు వయసులో చిన్నచిన్న మాటలు చెప్పటం ప్రారంభించాడు. శ్రీవారికి మొక్కులు చెల్లిస్తే ఫలితం ఉంటుందని భావించిన వారు శనివారం స్వామివారిని దర్శించుకున్నారు. తన కుమారుడికి మాటలు రప్పించాలని తల్లి ప్రతిమ స్వామికి మొరపెట్టుకున్నారు. అంతే... ఆలయంలో ఉండగానే అద్భుతం జరిగిందని, అంతవరకు పొడిపొడిగా మాట్లాడే దీపక్ బాగా మాడ్లాడటం ప్రారంభించాడని ప్రతిమ చెమ్మగిల్లిన కళ్లతో చెప్పారు. అనంతరం దీపక్ స్వామి వారికి తలనీలాలు సమర్పించి, మొక్కులు పరిపూర్ణం చేశారు. తర్వాత టీటీడీ ఈవో జి.గోపాల్‌ను కలసి ఈ విషయాన్ని వారితో పంచుకున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామి లీలలు ఇన్నాళ్లు విన్నామని, శనివారం ప్రత్యక్షంగా చూశామని టీటీడీ అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు దేవదేవుని సన్నిధిలో నిత్యం జరుగుతుంటాయని, అయితే కొన్నే వెలుగులోకి వస్తాయని ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చెప్పారు.