మంత్రి ప్రత్తిపాటి పీఎస్‌గా వేంకటేశ్వర్లు
అన్నవరం : అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానం ఈఓ పి.వేంకటేశ్వర్లును ఆయన మాతృసంస్థ రెవెన్యూ శాఖకి సరెండర్ చేస్తూ రాష్ట్రప్రభుత్వం గురువారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. దాంతో బాటు ఆయనను వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యక్తిగత కార్యదర్శిగా నియమించింది. ఈ విషయాన్ని ఈఓ వేంకటేశ్వర్లు గురువారం రాత్రి ‘సాక్షి’కి ధృవీకరించారు. ఈఓగా వేంకటేశ్వర్లు సుమారు రెండేళ్లు పనిచేశారు. సుమారు 150 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనం రూ.తొమ్మిదివేలకు, పల్లకీబోయీలకు వేతనాన్ని రూ.ఎనిమిదివేలకు పెంచిన వేంకటేశ్వర్లు వారి శ్రమను గుర్తించిన ఈఓగా పేరొందారు.
అయితే ఇటీవల వివాహాల సీజన్‌లో దేవస్థానం అధికారుల తప్పుడు సలహాలతో పెళ్లిబృందాలకు గదులు ఇచ్చే విషయంలో విఫలమయ్యారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. మొత్తం మీద దేవస్థానంలో నిజాయితీపరుడైన అధికారిగా పేరు పొందారు. శుక్రవారం హైదరాబాద్‌లోని కమిషనర్ కార్యాలయంలో దేవస్థానం మాస్టర్‌ప్లాన్‌పై ఏర్పాటైన సమావేశంలో పాల్గొంటానని, శనివారం అన్నవరం వస్తానని వేంకటేశ్వర్లు ‘సాక్షి’కి తెలిపారు. కాగా ఆయన స్థానంలో దేవస్థానం ఈఓగా ఇంకా ఎవరినీ నియమించలేదు. ఇక్కడ ఏసీగా పనిచేస్తున్న ఈరంకి జగన్నాథరావును లేదా కాకినాడ ఆర్‌జేసీ, డీసీలలో ఒకరిని కొద్దికాలం ఇన్‌ఛార్జి ఈఓగా నియమించే అవకాశం ఉందని సమాచారం. ఈఓ వేంకటేశ్వర్లు సోమవారం రిలీవ్ అయ్యే అవకాశం ఉంది.
ఈఓగా రావాలని పలువురి ఆరాటం
ఈఓ వేంకటేశ్వర్లు బదిలీ విషయం తెలియడంతో పలువురు దేవాదాయశాఖ అధికారులు ఆ స్థానంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇక్కడ గతంలో ఈఓగా పనిచేసిన ఎం.రఘునాథ్, సింహాచలం దేవస్థానం ఈఓ కె.రామచంద్రమోహన్, గుంటూరు ఆర్‌జేసీ, విజయవాడ దుర్గగుడి ఈఓ పి.త్రినాథ్‌ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో రఘునాథ్‌కే అధికార పార్టీ ప్రముఖుల మద్దతు ఎక్కువగా ఉందని సమాచారం.