ప్రక్షాళన జరిగేనా..!
దుర్గగుడికి ‘కొత్త’కళ
* ఏడాది తర్వాత పూర్తిస్థాయి ఈవో నియామకం
* త్వరలోనే పాలక మండలి ఏర్పాటు
* ఇంద్రకీలాద్రిపై అవినీతి అంతం చేయాలి..
* కాంట్రాక్టర్ల హవాను అడ్డుకోవాలని భక్తుల వినతి
సాక్షి, విజయవాడ : ప్రతిష్టాత్మక దుర్గగుడికి కొత్తనీరు రానుంది. ఏడాది తర్వాత పూర్తిస్థాయి కార్యనిర్వహణ అధికారిని నియమించారు. చాలాకాలం అనంతరం దేవస్థానానికి పాలకమండలిని ఏర్పాటుచేయనున్నారు. ఈ క్రమంలో కొత్త పాలకమండలి, ఈవో సమన్వయంతో పనిచేస్తూ దుర్గగుడిలో నెలకొన్న అవి నీతిని ప్రక్షాళన చేయాల్సి ఉంది. కాంట్రాక్టర్ల హవాకు అడ్డుకట్ట వేయాలి. సిబ్బంది నిర్లక్ష్యం పైనా దృష్టి సారించి భక్తులకు మెరుగైన సేవలు అందేలా చూడాలి.
పాలకమండలి చైర్మన్‌గా రంగప్రసాద్!
బీజేపీ రాష్ట్ర నాయకుడు రంగప్రసాద్ చైర్మన్‌గా నియమితులయ్యే అవకాశం ఉంది. తొమ్మిది మంది సభ్యుల్లో ఒకరు బీజేపీ నుంచి, మిగిలినవారు టీడీపీ నాయకులు ప్రాతినిథ్యం వహించనున్నట్లు తెలిసింది. కొత్త సంవత్సరంలో నూతన పాలకమండలి కొలువుదీరుతుందని టీడీపీ, బీజేపీ నాయకులు చెబుతున్నారు. మరోవైపు ఇటీవల జరిగిన బదిలీల్లో ఇన్‌చార్జి ఈవో త్రినాథరావును ద్వారకా తిరుమల ఈవోగా నియమించారు. రెవెన్యూ శాఖకు చెందిన నర్సింగరావును దుర్గగుడి ఈవోగా నియమించారు. ఆయన ఈ నెల 27న బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈవో, పాలకమండలి సమన్వయంతో పనిచేసి దేవాలయ ప్రతిష్టను ఇనుమడింపజేయాలని భక్తులు కోరుతున్నారు.
సిబ్బంది నుంచే మొదలు కావాలి...
దుర్గగుడిలో ఏఈవోల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు దీర్ఘకాలంగా ఇక్కడే పనిచేస్తున్నారు. బదిలీలపై ఇతర దేవస్థానాలకు వెళ్లినా రెండు, మూడేళ్లు పూర్తవగానే తిరిగి ఇక్కడికే వస్తున్నారు. దీంతో అధికారులు, ఉద్యోగులే పలు కాంట్రాక్టులను బినామీ పేర్లతో నిర్వహిస్తున్నారు. దుర్గాఘాట్‌లో షాపులు, చీరల కాంట్రాక్టు, దేవస్థానానికి సరుకుల సరఫరా, ప్రసాదాల తయారీ తదితర విషయాల్లో వీరిపాత్ర ఉందనేది బహిరంగ రహస్యం. అర్చకులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సీనియర్లు డ్యూటీలు చేయకుండా అసిస్టెంట్లతోనే అన్ని పనులు ముగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
కాంట్రాక్టర్లదే హవా!
దేవస్థానంలో కాంట్రాక్టర్ల హవా సాగుతోంది. ఐదుగురు కాంట్రాక్టర్లు కొండపై తిష్టవేసి అధికారులను సైతం శాసిస్తున్నారు. ఈ ఐదుగురే దుర్గగుడి సిబ్బంది సహాయంతో కీలక కాంట్రాక్టులు దక్కించుకుంటున్నారు. వీరికి కాంట్రాక్టులు రాకపోతే కోర్టులకు వెళ్లి పనులు సాగకుండా అడ్డుకుంటున్నారు.
దుకాణాల తొలగింపుపై దృష్టి పెట్టాలి
ఇంద్రకీలాద్రి కొండపైన గడువు ముగిసినప్పటికీ దుకాణాలకు టెండర్లు పిలవలేదు. రాజకీయ నాయకుల చేతుల్లో దుకాణాలు ఉండటంతో దేవాదాయ శాఖ అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. కొత్తగా వచ్చే పాలకమండలి అయినా ఈ విషయంపై దృష్టి సారించాలి.
భక్తులకు సౌకర్యాలు మెరుగుపరచాలి..
భక్తులకు సౌకర్యాలు కూడా మెరుగపరాల్చిన అవసరం ఉంది. ముఖ్యంగా కాటేజీలు, మల్లికార్జున మహామండపం, రాజగోపురం పనులు పూర్తిచేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలి. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు జిల్లాలో పర్యాటక ప్రదేశాల సమాచారం అందించాలి.