వైభవంగా రథోత్సవం.. రేపు శ్రీవారికి చక్రస్నానం
తిరుపతి: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలో 8వ రోజు సోమవారం ఉదయం 7 గంటలకు రథోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ రోజు ఉదయం శ్రీవారు మల్లయప్పస్వామిగా అలంకృతుడై బ్రహ్మారధం పై మాడ వీధుల్లో ఊరేగారు. స్వామిని కనులారా తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తమిళనాడు నుంచి వచ్చిన కళాకారులు తమ ఆటపాటలతో అందరినీ అలరింపజేశారు. రథాన్ని లాగే క్రమంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారు.
రథం తిరుగుతున్న సమయంలో ఇంజనీరింగ్ సిబ్బంది అందుబాటులో ఉండి నిరంతరం పర్యవేక్షించారు. రేపు (మంగళవారం) ఉదయం 6 గంటలకు చక్రస్నానం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి భక్తులు సంయమనం పాటించి సహకరించాలని టీటీడీ ఈవో సాంబశివరావు కోరారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పుష్కరిణి వద్ద ఈతగాళ్లను, బోటను అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఈవో ఆదేశించారు.