రెండు దశల్లో 33 రోజుల పాటు సర్వే
430-460 ఇళ్లతో ఎన్యుమరేటర్ బ్లాక్
{పతి బ్లాకుకు ఓ ఎన్యుమరేషన్ టీమ్
స్పాట్‌లోనే టాబ్లెట్స్‌లో ఆన్‌లైన్ డేటా ఎంట్రీ
త్వరలో బ్లాకుల వారీగా సర్వే షెడ్యూల్ ఖరారు
విశాఖపట్నం : తెలంగాణాలో మాదిరిగా ఏపీలో కూడా ఇంటింట సమగ్ర ఆర్థిక సామాజిక సర్వే (స్మార్ట్స్ పల్స్ సర్వే) చేయాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడలా ఒక్క రోజులోనే కాకుండా 33 రోజుల పాటు ఈ సర్వే చేపట్టేలా షెడ్యూల్ తయారు చేస్తున్నారు. జూన్ 20 నుంచి 30 వరకు, జూలై 6 నుంచి 31 వరకు రెండు దశల్లో ఈ సర్వే చేపట్టాలని నిర్ణయించారు. 430-460 ఇళ్లను ఓ ఎన్యుమరేటర్ బ్లాకుగా విభజించారు. ప్రతీ బ్లాకుకు ఓ ఎన్యుమరేషన్ టీమ్‌ను ఏర్పాటు చేశారు.
స్పాట్ లోనే ఆన్‌లైన్ డేటా ఎంట్రీ చేయనున్నారు. ఇందుకోసం సిబ్బందికి ప్రత్యేకంగా టాబ్లెట్ పీసీలు ఇవ్వనున్నారు. ప్రతీ ఒక్కరి బయోమెట్రిక్, ఐరిష్‌లను కూడా సేకరించేందుకు యంత్రాలను సమకూర్చనున్నారు. ఇందుకోసం జిల్లా మండల కేంద్రాల్లో గణన కోసం ఎంపిక చేసిన బృందాలకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. బ్లాకులు, తేదీల వారీగా త్వరలో సర్వే షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, సెర్ఫ్ క్లస్టర్ కో ఆర్డినేటర్, వీఏఓ, ఫీల్డ్ అసిస్టెంట్, ఎంఆర్‌ఐ తదితరులతోనూ, పట్టణ ప్రాంతాల్లో మెప్మా బిల్ కలెక్టరు, వివిధ శాఖల సిబ్బంది, అధికారులతో ఈ టీమ్‌లను ఏర్పాటు చేయనున్నారు. జీవీఎంసీ, వుడా, వివిధ ప్రభుత్వశాఖల అధికారులు, సిబ్బంది సేవలను ఇందుకోసం వినియోగించనున్నారు. బ్లాకుల్లో ఇంటింటి సర్వే ప్రణాళికా బద్ధంగా చేసేందుకు వీలుగా ఎన్యుమరేషన్ బ్లాకులు తేదీల వారీగా షెడ్యూల్ తయారు చేసి ప్రజలందరికి తెలియజేసేలా ప్రచారం చేయాలని నిర్ణయించారు.
డ్వాక్రా సెర్ప్ సిబ్బందితో పాటు వివిధ శాఖల సిబ్బంది వద్ద ఉన్న టాబ్లెట్స్, ఐరిష్, బయోమెట్రిక్ యంత్రాలను సమీకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. సర్వే పూర్తిగా పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని గురువారం సాయంత్రం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ తహశీల్దార్లను ఆదేశించారు. ఎన్యుమరేటర్లకు జిల్లా, మండల స్థాయిల్లో తక్షణమే శిక్షణా కార్యక్రమాలు చేపట్టేలా ఏర్పాట్లు చేయాలన్నారు. జేసీ నివాస్, జేసీ-2 డివి రెడ్డి, డీఆర్‌ఒ చంద్రశేఖరరెడ్డి, వుడా కార్యదర్శి ఎ.శ్రీనివాస్, జీవీఎంసీ రెవెన్యూ అధికారి వి.రవీంధ్ర, ఆర్డీఓ వెంకటేశ్వరు, సీపీఒ రామశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.