తిరుమల: జీఎస్టీ అమలుతో తిరుమల తిరుపతి దేవస్థానంపై రూ.50 కోట్లకుపైగా అదనపు భారం పడుతున్నదని ఈవో సింఘాల్ తెలిపారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ...బంగారు డాలర్ల విక్రయంపై 3 శాతం, రూ.1000,రూ.2500 మధ్య అద్దె ఉన్న గదులకు 12 శాతం పన్ను, రూ.2500 అద్దెపైబడిన గదులకు 15 శాతం పన్నును భక్తుల నుంచి వసూలు చేయాల్సి వస్తున్నదన్నారు.
భక్తులపై భారం పడుతున్న దృష్ట్యా టీటీడీకి జీఎస్టీ నుంచి మినహాయింపు కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని ఆయన తెలిపారు. నెలలో రెండు రోజులు వృద్దులు, దివ్యాంగులకు గతంలో 1500 టోకెట్లు ఇచ్చేవారని, ఇప్పుడు నాలుగు వేలకు పెంచామని, దీన్ని 18, 25 తేదీల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని పేర్కొన్నారు.
అలాగే స్వామివారి దర్శనానికి ఒక సంవత్సరం నుండి 5 సంవత్సరాల పిల్లల వరకు అనుమతిస్తామని, వీరికి 19, 26 తేదీలలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని అన్నారు. అయితే దర్శన టికెట్లపై జీఎస్టీ ప్రభావం లేదన్నారు. కాగా, జూన్ నెలలో శ్రీవారిని 25,77,165 మంది భక్తులను దర్శించుకున్నారని, కోటి 74వేల 161మంది భక్తులకు లడ్డూలు అందించామని, ఆ నెలలో హుండీ ఆదాయం రూ.66 కోట్ల 56 లక్షలు వచ్చిందని సింఘాల్ తెలిపారు. టీటీడీ వద్ద పాతనోట్లు రూ.25 కోట్లు ఉన్నట్లు చెప్పారు.
►ఇక అక్టోబర్ నెలకు సంబంధించి 56,295 ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల
►లక్కీడిప్ విధానానికి 12,495 ఆర్జిత సేవా టిక్కెట్లు కేటాయింపు
►సుప్రభాతం 7,780, అర్చన 120, తోమాల సేవ 120 టిక్కెట్లు
►అష్టదల పాదపద్మారాధన 300, నిజపాద దర్వనం 2300 టిక్కెట్లు
►లక్కీడిప్ కింద విశేషపూజ 1875 టిక్కెట్లు ఆన్‌లైన్‌లో ఉంచిన టీటీడీ
►లక్కీడిప్ కింద సేవా టిక్కెట్ల నమోదుకు వారం రోజుల వరకూ అవకాశం
►ఈ నెల 14న మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్ టిక్కెట్ల కేటాయింపు
►టిక్కెట్ల కేటాయించిన భక్తులకు ఎస్‌ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా సమాచారం