
పర్వదినాలకు టీటీడీ సిద్ధం
- రేపు కొత్త సంవత్సరం,8న ముక్కోటి ఏకాదశి, 9న ద్వాదశి
- పకడ్బందీ ఏర్పాట్లు..
సాక్షి, తిరుమల: నూతన ఆంగ్ల సంవత్సరం, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలకు టీటీడీ సిద్ధమైంది. ఈ మూడు పర్వదినాల్లోనూ శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు నారాయణగిరి ఉద్యానవనంలో 16 తాత్కాలిక షెడ్లు నిర్మించారు. క్యూలోని భక్తులపై ఎండ, వాన, మంచు పడకుండా రేకులు అమర్చారు. ఈదురు గాలుల నుంచి రక్షించుకునేందుకు వీలుగా పక్క భాగాల్లోనూ రేకులు అమర్చారు. ఈ పర్వదినాల్లో తొలుత మొదటి, రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లలోని 54 కంపార్ట్‌మెంట్లలోకి భక్తులను అనుమతిస్తారు. అవి నిండిన తర్వాత తాత్కాలిక షెడ్లలోకి అనుమతిస్తారు. ఈ క్యూల వద్దే మరుగుదొడ్లు, తాగునీరు, అన్నప్రసాదాల కేంద్రాలు, షెడ్లు అమర్చారు.
ఆరు మందికే వీఐపీ దర్శనం
కొత్త సంవత్సరం, 8న వైకుంఠ ఏకాదశి, 9న ద్వాదశిలో స్వామి దర్శనం కోసం వచ్చే వీఐపీల్లో ఒకరికి 6 టికెట్లు మాత్రమే ఇవ్వనున్నారు. వేకువజామున 1 నుంచి 3 గంటల్లోపే ప్రముఖులకు దర్శనం పూర్తి చేయాలని టీటీడీ నిర్ణయించింది. కేటాయించిన టికెట్లను బట్టి అరగంట అటుఇటుగా క్యూలైను అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా టీటీడీ అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీలు నియమించారు.
4 గంటల్లోపే సామాన్యులకు దర్శనం
పర్వదినాల్లో వేకువజాము 4 గంటల్లోపే సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. ఏకాదశిలో మాత్రం ఇతర దర్శనాలు లేకుండానే నిర్విరామంగా సర్వదర్శనం మాత్రమే అమలు చేయనున్నారు. గతేడాది అనుసరించిన విధానాన్నే ఈసారి కూడా అమలుచేయాలని ఈవో, జేఈవో నిర్ణయిం చారు. పండుగ వేళల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ రిసెప్షన్ అధికారులు వేల సంఖ్యలో గదులు ముందస్తుగానే రిజర్వు చేశారు. అయితే, సామాన్య భక్తుల రద్దీని బట్టి సామాన్యులకే ఎక్కువ సంఖ్యలో గదులు ఇవ్వాలని ఈవో సాంబశివరావు అధికారులను ఆదేశించారు.