గుంతకల్లు, న్యూస్‌లైన్: కసాపురంలోని ఆంజనేయస్వామి దేవాలయ ఎగ్జిక్యూటివ్ అధికారి(ఈఓ) సురేష్ బాబు వ్యవహార శైలిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ.. సంవత్సరానికి రూ.6 కోట్ల ఆదాయం ఆర్జించే దేవాలయాన్ని పర్యవేక్షించాల్సిన అధికారి వారంలో రెండు రోజులు మాత్రమే విధి నిర్వహణలో ఉంటారని, మిగిలిన ఐదు రోజులు ‘టూర్’ పేరుతో ఎగనామం పెడతారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారికంగా రాయాల్సిన ‘టూర్ డైరీ’ని నమోదు చేయకపోవడంతో ఆరోపణలకు బలం చేకూరుతోంది. ప్రతి శనివారం ఉదయం డ్యూటీకి వచ్చే ఆయన మరుసటి రోజు ఆదివారం రాత్రి వెళ్లిపోతున్నా ప్రశ్నించే అధికారి లేకపోవడంతో ‘ఆడిందే ఆట.. పాడిండే పాట’ చందంగా తయారైంది. ఈయన తీరుపై జిల్లా కలెక్టరుకు సమాచారం అందకుండా దేవాదాయ శాఖలోని కొందరు సిబ్బంది అడ్డుపడుతున్నారని బాహాటంగా చెప్పుకుంటున్నారు.
గాడి తప్పిన పాలన..
మూడు సంవత్సరాల క్రితం ఈఓగా సురేష్‌బాబు బాధ్యతలు చేపట్టారు. విజయవాడకు చెందిన ఈయనకు స్థానిక ప్రజాప్రతినిధి అండదండలు ఉన్నాయి. ఎక్కువ రోజులు ఆఫీసులో ఉండకపోవడంతో ఆలయ అధికారులు, సిబ్బందిలో నిర్లక్ష్యం, అవినీతి పెచ్చుమీరిపోయాయి. పరిపాలన పూర్తిగా గాడి తప్పింది. ఆలయ సిబ్బంది గ్రూపులుగా విడిపోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో సౌకర్యాలు అందక భక్తులు ఇబ్బంది పడుతున్నారు. దేవస్థానం పరిధిలో రూ.5.5 కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో అవినీతి పెరిగింది. పనుల్లో నాణ్యత లేదని ఓ గ్రూపు సిబ్బంది, గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టర్ల నుంచి భారీగా ‘మామూళ్లు’ డిమాండ్ చేసిన అనధికార ఈఓకు ఆశించిన మేరకు సొమ్ము ముట్టకపోవడంతో పరోక్షంగా వర్గాన్ని ప్రోత్సహిస్తూ.. ఫిర్యాదులకు తెరతీశారని చర్చించుకుంటున్నారు. ఆలయ వ్యవహారాలపై ఆందోళన చెందిన ఆలయ ధర్మకర్త సుగుణమ్మ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
అనధికార ఈఓ తీరుతో గ్రూపులుగా సిబ్బంది కసాపురం దేవస్థానంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఓ అధికారి ఏకంగా అనధికార ఈఓగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆలయ పరిపాలనలో ఆశ్రీత పక్షపాతం పెరిగిపోయింది. స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో కాంట్రాక్టు పనులను బంధువుల పేర్ల మీద పనులు చేయిస్తూ అర్హత ఉన్న కాంట్రాక్టర్లను వేధిస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన వారికి.. ఈఓకు ఫిర్యాదు చేసుకోండంటూ నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ అవమానిస్తున్నాడని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.