వైకుంఠ ఏకదశి రోజున ఆందోళనకు దిగిన శ్రీవారి భక్తులపై టీటీడీ అధికారులు కేసులు నమోదు చేయడంపై బీజేపీ మండిపడింది. శ్రీవారి భక్తులపై టీటీడీ అధికారులు వ్యవహరించిన తీరుపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు బీజేపీ నేతలు సమాయత్తమైయ్యారు. అందులో భాగంగా టీటీడీ ఛైర్మన్, ఈవో, జేఈవోలపై ప్రైవేట్ కేసును దాఖలు చేయనున్నట్లు బీజేపీ నాయకులు వెల్లడించారు. వైకుంఠ ఏకదశి పర్వదినం పురస్కరించుకుని శనివారం తిరుమల భక్తులతో పోటెత్తిన విషయం తెలిసిందే.
మరోవైపు శ్రీవారిని దర్శించుకునేందుకు మంత్రులు, ప్రముఖులు తదితర వీవీఐపీలకు టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. దాంతో శ్రీవారి దర్శనం ఆలస్యం అవుతుందంటూ సామాన్య భక్తులు ఆందోళనకు దిగారు. ఆ క్రమంలో టీటీడీ ఛైర్మన్ కార్యాలయం వద్ద భక్తులు ఆందోళన చేపట్టారు. అయితే తిరుమలలో ఆందోళనలు నిషేధం కావటంతో ధర్నా చేసిన భక్తుల (గుర్తుతెలియని వ్యక్తుల)పై ఏవీఎస్‌వో గోవిందరెడ్డి స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
రోడ్డుపై బైఠాయించి సిబ్బంది విధులకు ఆటంకం కలిగించటం, ఇతర వాహనదారులకు అసౌకర్యం కలిగించటం వంటి అభియోగాలతో తిరుమలలోని టూ టౌన్ పోలీసులు సెక్షన్-341 ప్రకారం కేసు నమోదు చేశారు. అందుకోసం ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఫుటేజీలో ఉన్న వ్యక్తులు, టీటీడీ విజిలెన్స్ తీసిన వీడియో, ఫొటోల ఆధారంగా ఆందోళన చేసిన భక్తులను గుర్తించనున్నారు. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా, హైదరాబాద్‌కు చెందిన పలువురిని గుర్తించినట్టు సమాచారం.