శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానంలో తాజాగా ఏసీబీ తనిఖీలు ప్రారంభమయ్యాయి. దేవస్థానం పరిపాలన భవనంలో మంగళవారం రాత్రి నుంచి ఏసీబీ అధికారులు వివిధ రికార్డులను పరిశీలిస్తున్నారు.
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానంలో తాజాగా ఏసీబీ తనిఖీలు ప్రారంభమయ్యాయి. దేవస్థానం పరిపాలన భవనంలో మంగళవారం రాత్రి నుంచి ఏసీబీ అధికారులు వివిధ రికార్డులను పరిశీలిస్తున్నారు. దేవస్థానంలో 2010 నుంచి 2013 వరకు జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ చేస్తున్నారు. అవినీతి నిరోధకశాఖ(తిరుపతి) సీఐ చంద్రశేఖర్ నేతృత్వంలో బుధవారం పలు కీలకమైన రికార్డులను పరిశీలించారు.
శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానంలో రెండేళ్లుగా తనిఖీలు...విచారణలు జరుగుతూనే ఉన్నాయి. 2010 నుంచి 2013 వరకు జరిగి అక్రమాలపై మొదట్లో విజిలెన్స్ అధికారులు విచారణ ప్రారంభించారు. ఏడాది పాటు పలు సార్లు రికార్డులను తనిఖీలు చేశారు. పలు రికార్డులను హైదరాబాద్‌కు సైతం తరలించి నిశితంగా పరిశీలించారు. తాజాగా ఏసీబీ నేతృత్వంలో విచారణ సాగుతుంది.
ప్రధానంగా అప్పట్లో వెండి కొనుగోలులో అక్రమాలు, మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు అవసరానికి మించి ఖర్చులు చేసినట్లు రికార్డులు చూపడం, ఉద్యోగాల నియామకాలు, హరితాభివృద్ధిలో ఉద్యోగాలు, హరితాభివృద్ధి నుంచి పలువురిని ఆలయంలోకి డెప్యూటేషన్‌పై బదిలీ చేయడం తదితర అంశాలపై విచారణ చేస్తున్నారు. అప్పటి ఈవో శ్రీరామచంద్రమూర్తి పాలన కాలంలోనే అవినీతి అధికంగా జరిగినట్లు భావిస్తూ పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు. దీంతో అవినీతి అక్రమాలకు పాల్పడినవారి గుండెల్లో గుబులు పుడుతోంది.