సంప్రదాయ వస్త్రధారణ అమలు చేయండి
డయల్ యవర్ ఈవోలో భక్తుడి విజ్ఞపి
తిరుమల : తిరుమలలో విధిగా తిరునామ ధారణ, సంప్రదాయ వస్త్రధారణ అమలు చేయాలని వైఎస్సార్ జిల్లాకు చెందిన వెంకటేశ్వరరెడ్డి శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన టీటీడీ ఈవో సాంబశివరావు మాట్లాడుతూ సంప్రదాయ వస్త్రధారణ అమలు చేస్తున్నామని, తిరునామం అమలుపై కూడా నిర్ణయం తీసుకుంటామన్నారు. భక్తులు అడిగిన మరికొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
విజయ్‌భాస్కర్(అనంతపురం), కుమార్ (కడప): కల్యాణకట్ట, గదుల రీఫండ్ కౌంటర్ల వద్ద నగదు డి మాండ్ చేస్తున్నారు.
ఈవో: ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.
వేంకటేశ్వరరావు(ఏలూరు): వృద్ధులు, వికలాంగుల ప్రత్యేక దర్శనాన్ని అప్పుడప్పుడు రద్దు చేస్తుండడంతో ఇబ్బందిగా ఉంది.
ఈవో: రద్దీ సమయాల్లోనే ముందస్తు సమాచారంతో వృద్ధులు, వికలాంగుల ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నాం.
రామారావు(గుంటూరు), కేశవన్ (చంద్రగిరి): రూ.50 టికెట్లు సాయంత్రం స్లాట్ రావడం లేదు. కోటాను పెంచండి.
ఈవో: టికెట్ల పెంపుపై పరిశీలిస్తాం.
ఎం.ప్రసాద్(విశాఖపట్నం): టీటీడీ కల్యాణ మండపాలు, ఈ-దర్శన్ కౌంటర్లలో ఆధ్యాత్మిక పుస్తకాలను విక్రయించండి.
ఈవో: పరిశీలిస్తాం.
శేషుబాబు(పాలకొల్లు): అదనపు లడ్డూ కౌంటర్‌లో దురుసుగా ప్రవర్తిస్తున్నారు. సీసీ కెమెరాలు పెట్టండి.
ఈవో: అక్కడి సిబ్బంది తగిన సూచనలు ఇస్తాం.
పార్ధసారథి(గుంటూరు): తిరుమలలో పోటు కార్మికుల పేరు మార్చండి.
ఈవో: పేరు మార్పును పరిశీలిస్తాం.
సురేష్ (కాకినాడ): బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ రోజు గ్యాలరీల్లో మరుగుదొడ్ల వసతి కల్పించండి.
ఈవో: అవసరమైనన్ని మొైబైల్, తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తాం.
రామదాస్(తమిళనాడు): తమిళనాడు నుంచి పాదయాత్రగా తిరుమలకు వచ్చే భక్తులకు పుత్తూరులోని టీటీడీ కల్యాణమండపంలో విశ్రాంతి తీసుకునే అవకాశం కల్పించండి.
ఈవో: ఎలాంటి కార్యక్రమాలు లేని సందర్భాల్లో పాదయాత్ర భక్తులకు కేటాయిస్తాం.
నాగేశ్వరరావు(రేణిగుంట): తిరుపతిలోని గోవిందరాజస్వామి, తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయాల వద్ద భిక్షగాళ్లను అరికట్టండి.
ఈవో: కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం.
వెంకయ్య(హైదరాబాద్): క్యూ కాంప్లెక్స్‌లో భక్తులకు అందించే అన్నప్రసాదాలు వృథా అవుతున్నాయి.
ఈవో: తగిన చర్యలు తీసుకుంటాం.
గోపి(తిరుపతి): తిరుచానూరు తోళప్ప గార్డెన్స్ కల్యాణమండపాల్లో కరెంటు పోతే జనరేటర్ లేదు.
ఈవో: పరిశీలిస్తాం.
హరనాథ్‌రెడ్డి (హైదరాబాద్): పర్వదినాల్లో దాతలకు శ్రీవారి దర్శనం కల్పించండి. ఆనందనిలయం అనంత స్వర్ణమయం గురించి తెలపండి.
ఈవో: ప్రత్యేక దినాల్లో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నాం. అనంతస్వర్ణమయం పథకాన్ని రద్దు చేశాం. దాతల అంగీకారం మేరకు విరాళాలను మరో పథకానికి మళ్లిస్తాం. దాతలు కోరుకుంటే తిరిగి చెల్లిస్తాం.