అంతా శివమయం
రామతీర్థం(నెల్లిమర్ల), : రాష్ట్రంలో రెండో భద్రాద్రిగా పేరుగాంచిన రామతీర్థానికి శివరాత్రి మరుసటి రోజైన శుక్రవారం కూడా భక్తులు పోటెత్తారు. శివరాత్రి పర్వదినంకంటే మరుసటి రోజునే లక్షలాదిమంది భక్తులు వచ్చి ఇక్కడి సీతారాములు, శివుడ్ని దర్శించుకున్నారు.
గురువారం రాత్రంతా భక్తులు దేవస్థానానికి వస్తూనే ఉన్నారు. శుక్రవారం సాయంత్రం వరకు రద్దీ కొనసాగింది. రెండురోజుల్లో మొత్తం నాలుగు లక్షలమంది భక్తులు హాజరైనట్లు దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి గత ఏడాదితో పోల్చిచూస్తే ఈ ఏడాది భక్తుల సంఖ్య తక్కువగానే ఉన్నట్లు గుర్తించారు. అయితే శుక్రవారం మా టత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా అధికసంఖ్యలో భక్తులు వచ్చారు. వేకువజామున రద్దీ మరింత ఎక్కువైంది.
ఇటు గొర్లిపేట నుం చి రామతీర్థం దాకా రోడ్డంతా భక్తులతో నిండిపోయింది. వాహనాలను సీతారామునిపేట జంక్షన్లోనే నిలిపివేసినప్పటికీ నెల్లిమర్ల రహదారి భక్తులతో కిక్కిరిసింది. ఒకదశలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. పోలీసులు ఎక్కడికక్కడ బందోబస్తు నిర్వహించి, వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు.
అలా గే అటువైపు దేవుని నెలివాడ నుంచి ఆలయందాకా రోడ్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా దేవస్థానం ముందున్న తిరువీధి ఇసుక వేస్తే రాలనంతా భక్తులతో నిండిపోయింది. మధ్యాహ్నం మూడుగంటలదాకా స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. ఈసారి రెండువైపులా ద్వారాలు తెరిచి దర్శనాలకు అనుమతించడంతో భక్తులు గతంలో మాదిరి ఇబ్బంది పడలేదు. క్షేత్రపాలకుడు శ్రీఉమా సదాశివస్వామి ఆలయానికి ఈ సారి భ క్తులు పోటెత్తారు. లోపలికి వెళ్లేందుకు చాంతాడంత క్యూ ఉండడంతో ఆలయం వెలుపలే కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించడం కనిపించింది.
జాగారం చేసిన భక్తులు శుక్రవారం అధిక సంఖ్యలో బోడికొండ ఎక్కి, అక్క డి కోదండరామ స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవ ప్రత్యేకాధికారి ఎన్‌వీఎస్‌ఎ న్ మూర్తి, ఈఓ బాబూరావు భక్తులకు అసౌకర్యం కలగకుండా పర్యవేక్షించారు. రామతీర్ధంలో రెండు రోజుల పాటు భక్తులకు పలు స్వచ్ఛంద సంస్థలు సేవలందించాయి.