'సర్వేంద్రియానాం నయనం ప్రధానం' అన్న విషయం తెలిసిందే. అందుకు తగినట్లుగా డా: నాగ మాధురి ఏరికోరి నేత్ర వైద్యురాలుగా తనను తాను తీర్చిదిద్దుకున్నారు. డాక్టర్‌గా సేవలు అందిస్తూనే ఆమెలో మరో టాలెంట్ కూడా దాగి ఉంది. అందరినీ మెచ్చేలా పాటలు పాడగలదు. ఒకపైపు వేలాదిమందికి కంటి చూపు ప్రసాదిస్తూ... సరి చేస్తూనే... సంగీతంలోనూ నిష్ణాతురాలిగా రాణిస్తున్నారు. బహుముఖ ప్రతిభాశాలిగా డాక్టర్ నాగ మాధురి మెప్పిస్తున్నారు.
ఉన్నత విద్యా సంపన్న కుటుంబంలో జన్మించిన నాగ మాధురి చిన్నప్పటి నుంచి సంగీతం పట్ల మక్కువ చూపేవారు. చదువులో చాలా చురుగ్గా ఉంటూనే.. చిత్ర కళ, గానంలో విశేష ప్రతిభ కనబరిచేవారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో డాక్టర్ వైజర్సు సుబ్రహ్మణ్యం దగ్గర సంగీతంలో శిష్యరికం చేశారు. కర్నాటిక్ క్లాసిక్ మ్యూజిక్‌లో డిప్లొమా చేయడంతోపాటు అందులో డిష్టింక్షన్ సాధించడం నాగ మాధురి ప్రతిభను చెప్పకనే చెబుతుంది. ఆప్తమాలజీ (కంటి వైద్యం) స్పెషలిస్ట్‌గా ఒంగోలులోని స్మార్ట్ విజన్ హాస్పిటల్‌కి మేనేజింగ్ పార్టనర్ కమ్ ఛీఫ్ కన్సల్టెంట్‌గా సేవలందిస్తూనే.. సంగీతంలోనూ సాధన చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు.
ఈ శివరాత్రికి కానుకగా ఆ మహా శివుడిపై ప్రేమతో అద్భుతమైన పాటను ఆమె పాడారు. దక్షిణ భారత సినీ సంగీత రంగంలో పేరుగాంచిన స్ట్రింగ్ ప్లేయర్ మాండలిన్ ఎస్.ఎమ్. సుభాని సారధ్యంలో "శంభో మహాదేవ... శంకర గిరిజా రమణ" త్యాగరాజ కృతిని ఆలపించి.. 'గాన మాధురి' అనే తన పేరును సార్ధకం చేసుకున్నారు నాగ మాధురి. 15 సంగీత వాయిద్యాలలో నిష్ణాతులు అయిన సుభాని గారు కీరవాణి, థమన్, రెహమాన్, అనిరుద్ వంటి దిగ్గజ దర్శకులకు తన వాద్య సహకారం అందిస్తుంటారు.
ఇకపోతే... "శంభో మహాదేవ" ఆడియో అండ్ వీడియో ఆల్బమ్‌ను మ్యూజిక్ మాంత్రికుడు మణిశర్మ ఆవిష్కరించి, అభినందించడం విశేషం. "శంభో మహదేవ" ఆల్బమ్ అనే తన కల సాకారం దాల్చడంలో మాండలిన్ సుభాని గారి స్ఫూర్తి, విశ్వనాధ్ అరిగెల సహకారం, మరీ ముఖ్యంగా తన ఫ్యామిలి సపోర్ట్ ఎంతైనా ఉందని డాక్టర్ నాగ మాధురి అన్నారు. మణిశర్మ గారి మంచితనాన్ని, ఆయన అభినందనను ఎప్పటికీ మర్చిపోలేనని ఆమె తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment