rama theertham
-
బోడికొండపై 'దండు'యాత్ర..
సాక్షి ప్రతినిధి, విజయనగరం, నెల్లిమర్ల/నెల్లిమర్ల రూరల్: రెండో భద్రాద్రిగా భాసిల్లుతున్న విజయనగరం జిల్లా రామతీర్థం బోడికొండపై కోదండరామ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు టీడీపీ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు అడ్డు తగిలి వీరంగం సృష్టించారు. ఉదయం శంకుస్థాపన సమయానికి ముందుగానే కొందరు టీడీపీ కార్యకర్తలను వెంటబెట్టుకుని ఆయన బోడికొండ పైకి చేరుకున్నారు. రామతీర్థం దేవస్థానం తన పూర్వీకులదని, అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఎలా శంకుస్థాపన చేస్తుందంటూ దేవదాయ శాఖ అధికారులపై చిందులేశారు. శంకుస్థాపన కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని కిందకి తోసేశారు. అనువంశిక ధర్మకర్తనైన తనకు తెలియకుండా ముహూర్తం ఎలా నిర్ణయిస్తారంటూ కేకలు వేశారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న మంత్రులతో వాగ్వాదానికి దిగారు. స్వయంగా ఆహ్వానించినా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.4 కోట్ల వ్యయంతో రామతీర్థం ఆలయ అభివృద్ధికి సంకల్పించినట్లు మంత్రులు వెలంపల్లి, బొత్స సత్యనారాయణ మీడియాకు తెలిపారు. దేవదాయ శాఖ నిధులతో సంబంధం లేకుండా ప్రభుత్వ ఖర్చుతోనే రూ.3 కోట్లతో బోడికొండపై కోదండరామస్వామి ఆలయ పునర్నిర్మాణంతో పాటు రూ.కోటి వ్యయంతో దిగువనున్న రామస్వామి ఆలయ అభివృద్ధి పనులను చేపట్టినట్లు వివరించారు. శంకుస్థాపన కార్యక్రమాన్ని అశోక్ గజపతిరాజు అడ్డుకోవడం సరికాదన్నారు. ప్రోటోకాల్ ప్రకారం శిలాఫలకంపై ఆయన పేరు ఉన్నప్పటికీ కూలదోసేందుకు ప్రయత్నించారన్నారు. ఆలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులపైనా అనుచిత ప్రవర్తన తగదని సూచించారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని దేవదాయశాఖ అధికారులు స్వయంగా ఆయన్ను కలిసి ఆహ్వానించారని గుర్తు చేశారు. ఆ సమయంలోనూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇదేనా విజ్ఞత? దేవదాయ శాఖను సర్కస్ కంపెనీ అని హేళన చేయడమేనా ఆయన విజ్ఞత? అని మంత్రులు విస్మయం వ్యక్తం చేశారు. ధర్మకర్తగా ఉన్న ఆయన టీడీపీ హయాంలో ఒక్క రూపాయైనా ఆలయ అభివృద్ధికి వెచ్చించారా? అని ప్రశ్నించారు. విగ్రహాల తయారీకి విరాళం ఇవ్వడానికి ముందుకొచ్చినా ఆ బాధ్యతను టీటీడీ తీసుకున్నందున తిరస్కరించామని తెలిపారు. ఆలయ అభివృద్ధి పట్ల ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పునర్నిర్మాణ పనులకు విరాళం ఇవ్వవచ్చని సూచించారు. మాన్సాస్ ట్రస్ట్ భూములను దోపిడీ చేసిన అశోక్ గజపతిరాజు ఆ డబ్బుతో ఆలయ అభివృద్ధికి ముందుకు రావాలన్నారు. ఆయనది నీచమైన, క్రిమినల్ మనస్తత్వమని విమర్శించారు. మనమంతా ప్రజాస్వామ్యంలో ఉన్నామని, రాచరికపు ఆలోచనల నుంచి బయటకు రావాలని హితవు పలికారు. గతేడాది కోదండ రామ ఆలయంలో చోటుచేసుకున్న విగ్రహ ధ్వంసం ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, అది పూర్తయ్యాక దోషులెవరో తేలుతుందని చెప్పారు. అంగరంగ వైభవంగా.. రామతీర్థం బోడికొండపై కోదండ రామస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వైఖాసన ఆగమ శాస్త్రం ప్రకారం అర్చక స్వాములు శంకుస్థాపన ఘట్టాన్ని నిర్వహించారు. వేకువజాము నుంచి ప్రత్యేక పూజలు చేశారు. విశ్వక్షేన, పుణ్యాహవచనం, పంచగవ్య ఆరాధన, అష్టకలశ స్నపనం తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా చేపట్టి శంకుస్థాపన మహోత్సవానికి శ్రీకారం చుట్టారు. నూతన రాతి శిలలకు పూజలు, అభిషేకాలు చేశారు. చతుర్వేదాల ఆవాహన అనంతరం ముహూర్తం ప్రకారం ఉదయం 10.08 గంటలకు డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి, దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. నూతన శిలా ఖండాలకు మంత్రులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు... బోడికొండ దిగువన ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి ప్రాతఃకాలార్చన, బాల భోగం అనంతరం యాగశాలలో ప్రత్యేక హోమాలు జరిపారు. స్వామి వెండి మండపం వద్ద నిత్యకల్యాణం, పట్టాభిషేక మహోత్సవం జరిగాయి. హాజరైన ప్రజా ప్రతినిధులు, అధికారులు కార్యక్రమంలో విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు బడ్డుకొండ అప్పలనాయుడు, పీడిక రాజన్నదొర, శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, అలజంగి జోగారావు, ఎమ్మెల్సీలు డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, ఇందుకూరి రఘురాజు, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీపీ అంబళ్ల సుధారాణి, దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్, దుర్గగుడి ఈవో భ్రమరాంబ, రామాలయ ఈవో ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
శేషవాహనంపై శ్రీరాముడు
ఒంటిమిట్ట/నెల్లిమర్ల రూరల్/సింహాచలం(పెందుర్తి): ఆంధ్ర రాష్ట్రంలో రెండవ భద్రాద్రిగా విరాజిల్లుతున్న వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో వెలసిన శ్రీ కోదండరామయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి సతీసమేతంగా స్వామి వారికి పట్టువ్రస్తాలు సమరి్పంచారు. ఉత్సవ నిర్వాహకులు రాజేష్ సంప్రదాయబద్ధంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. వేదపండితులు గరుడ పతాక ప్రదర్శన చేపట్టారు. ధ్వజస్తంభానికి నవకలశ పంచామృతాభిషేకం చేసి సకల దేవతలు, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహా్వనించారు. విష్వక్సేన పూజ, ధ్వజస్తంభ రక్షాబంధనం, ఆరాధన జరిపారు. బుధవారం రాత్రి జగదభిరాముడు శేషవాహనంపై విహరించారు. రామతీర్థంలో వైభవంగా కల్యాణ వేడుక విజయనగరం జిల్లా రామతీర్థం శ్రీ సీతారామస్వామి సన్నిధిలో బుధవారం స్వామివారి కల్యాణం కోవిడ్ నేపథ్యంలో ఏకాంతంగానే జరిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సింహాచలం దేవస్థానం పట్టువ్రస్తాలు, ముత్యాల తలంబ్రాలను ఆరేళ్లుగా అందజేస్తున్న నేపథ్యంలో వాటిని ఏఈవో రాఘవకుమార్, ఇన్చార్జి ప్రధానార్చకులు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు రామతీర్థం ఆలయానికి సమర్పించారు. వాటిని ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు రాములవారికి అందజేశారు. కల్యాణ క్రమంలో ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాల నడుమ ఆశీర్వచన మండపం వద్దకు అర్చకులు తీసుకువచ్చారు. అక్కడ వెండి మండపం మధ్యభాగంలోని అమ్మవారిని, స్వామివారిని వేంచేపు చేశారు. వేదమంత్రోచ్ఛారణ నడుమ మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని సీతారామస్వామి వార్ల శిరస్సుపై ఉంచారు. శా్రస్తోక్తంగా మాంగల్యధారణ గావించారు. కార్యక్రమంలో ఎంపీ బెల్లాన, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, విజయవాడ దుర్గ గుడి ఈవో భ్రమరాంబ పాల్గొన్నారు. -
ధర్మ దీక్ష భగ్నం
నెల్లిమర్ల (విజయనగరం): ‘ధర్మ దీక్ష’ పేరుతో బీజేపీ, జనసేన మంగళవారం తలపెట్టిన ఛలో రామతీర్థం కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. సెక్షన్–30 అమల్లో ఉండటం, శాంతిభద్రతల పరిరక్షణకు ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతివ్వలేదు. అయినా కార్యక్రమం నిర్వహించేందుకు ఆ రెండు పార్టీలు ప్రయత్నించడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సహా నేతలు, కార్యకర్తలను నెల్లిమర్లలో పోలీసులు అడ్డుకున్నారు. వారిని దాటివెళ్లేందుకు ప్రయత్నించిన వీర్రాజును, ఇతర నేతలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో గంటసేపు హైడ్రామా నడిచింది. బీజేపీ, జనసేన నేతలను రామతీర్థం వెళ్లనివ్వకుండా నిలువరించేందుకు మంగళవారం వేకువజాము నుంచే పోలీసులు భారీఎత్తున నెల్లిమర్లలో మోహరించారు. అయినప్పటికీ సోము వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ్, జనసేన రాజకీయ వ్యవహారాల ఇన్చార్జి యశస్వినితో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు రామతీర్థం వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి నిరసనగా సోము వీర్రాజు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమను రామతీర్థం వెళ్లకుండా అడ్డుకున్న ప్రభుత్వానిది పిరికిపంద చర్య అని ధ్వజమెత్తారు. బోడికొండపై గల రాముడిని దర్శించుకునేందుకు ప్రభుత్వం ముందుగా తమకు అనుమతిచ్చిందన్నారు. అయితే, మంగళవారం ఉదయం అకస్మాత్తుగా అనుమతి రద్దు చేసిందని ఆరోపించారు. సెక్షన్–30 అమల్లో ఉన్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు, వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డికి అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. రాముడు తమ ఆరాధ్య దైవమని, విగ్రహాన్ని కూల్చిన పాపం ప్రభుత్వానికి తప్పకుండా తగులుతుందని అన్నారు. ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నా అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని వీర్రాజు ఆరోపించారు. దోషులను శిక్షించే వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. జీవీఎల్ ఖండన సాక్షి, న్యూఢిల్లీ:రామతీర్థం పర్యటనకు వెళ్లిన ఏపీ బీజేపీ నాయకులను అరెస్ట్ చేయడాన్ని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఖండించారు. రామతీర్థంలో రాముడి విగ్రహం తలను తొలగించడం కచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆయన వ్యాఖ్యానించారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ తరహా దాడులు మరో మతంపై జరిగితే పరిణామాలు మరోలా ఉండేవన్నారు. గతంలో ముస్లిం రాజుల పాలనలో జరిగిన తీరులో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం రామతీర్థం ఘటనలో తప్ప గతంలో ఆలయాలపై దాడి జరిగినప్పుడు ఎప్పుడూ స్పందించలేదని పేర్కొన్నారు. ఒక్క చర్చిపై రాళ్లు వేస్తే 40 మందిని వెంటనే అరెస్ట్ చేసిన ప్రభుత్వం, మందిరాలపై జరిగే దాడుల విషయంలో ఎందుకు అలా వ్యవహరించడం లేదని జీవీఎల్ ప్రశ్నించారు. టీడీపీ శ్రేణులే ఈ పని చేశాయని వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్నారే తప్ప ఎలాంటి చర్యలు లేవని విమర్శించారు. చర్చిలు మాత్రమే ప్రార్ధనా స్థలాలని ప్రభుత్వం భావిస్తోందా అనే విషయాన్ని వెంటనే స్పష్టం చేయాలన్నారు. -
చంద్రబాబువి దగుల్బాజీ రాజకీయాలు
సాక్షి, అమరావతి: రామతీర్థం ఘటనపై విచారణలో అసలు రంగు బయటపడుతుందని, ఈ ఘటనలకు కారకుడైన చంద్రబాబు ఈ రాష్ట్రంలో ఉండాల్సిన వ్యక్తి కానేకాదని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఉన్న మీడియాతో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. రామతీర్థం ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిందన్నారు. అంత ఘటన జరిగితే ఆలయ చైర్మన్ అశోక్‌గజపతిరాజు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. చంద్రబాబు పవిత్రమైన హిందువైతే విజయవాడలో ఆలయాలను ఎందుకు కూల్చారని నిలదీశారు. ఆలయాలను కూల్చినప్పుడు చంద్రబాబుకు హిందువులు గుర్తు రాలేదా అని ప్రశి్నంచారు. మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు నీచ, దగుల్బాజీ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. విజయవాడలో గుళ్లను కూల్చేసింది చంద్రబాబే అన్న విషయం జగమెరిగిన సత్యమన్నారు. రామతీర్థం సహా రాష్ట్రంలో మరికొన్ని ఘటనలపై సీఐడీ విచారిస్తుందన్నారు. విగ్రహాల ధ్వంసాలకు కారకులు ఎవరో, ఏ పారీ్టవారు ఈ కార్యక్రమాలు చేస్తున్నారో తేలుతుందని చెప్పారు. రేపు తిరుపతి ఎన్నిక జరిగితే బైబిల్ కావాలో, భగవద్గీత కావాలో తెలుస్తుందన్నారు. చంద్రబాబు తిరుపతిలో ఇవే మాటలు చెబితే అప్పుడు ప్రజలు సమాధానం చెబుతారన్నారు. అమరావతి చంద్రబాబు దోపిడీ నగరం అని ఎద్దేవా చేశారు. అసలు అమరావతి అక్కడికి 40 కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు. చంద్రబాబు అమరేశ్వరుని భూములూ దోచుకున్నారని చెప్పారు. -
మత విద్వేషాల చిచ్చు పెట్టేందుకు బాబు యత్నం
సాక్షి, అమరావతి: సంక్షేమ పథకాల అమలుతో జగన్ ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందన్న కుళ్లుతో ప్రశాంతంగా ఉండే రాష్ట్రంలో మత విద్వేషాల చిచ్చు పెట్టేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. తానే కుట్ర చేసి ప్రభుత్వంపై బురదజల్లాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడన్నారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రామతీర్థం ఘటన తొలిసారి టీడీపీ సోషల్ మీడియాలోనే ప్రచారం జరగడం అనుమానాలకు తావిస్తోందన్నారు. అలాగే రామతీర్థంలో చంద్రబాబు ప్రెస్‌మీట్ తరువాత దీనివెనుక ఆయన పూర్తి హస్తముందనే అనుమానాలకు బలం చేకూరుతోందన్నారు. తన పాత్ర లేకపోతే రామతీర్థం వెళ్లిన చంద్రబాబు తన కుమారుడు లోకేశ్ డిమాండ్ చేసినట్లుగా ఎందుకు ప్రమాణం చేయలేదని ప్రశ్నించారు. అలాగైతే ఈసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టలేవు.. ‘‘ఎల్లకాలం అధికారం తనకే ఉండాలని విజయవాడ దుర్గగుడిలో క్షుద్రపూజలు చేయించినందుకు చంద్రబాబుకు మొన్నటి ఎన్నికల్లో అంత తక్కువ సంఖ్యలో సీట్లు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ అధికారం కోసమని దేవుడి పేరుతో రాజకీయాలు చేయాలని చూస్తే ఈసారి అసలు ఆయన అసెంబ్లీలోకే అడుగు పెట్టే పరిస్థితి ఉండదు’’ అని వెలంపల్లి హెచ్చరించారు. బూట్లు వేసుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొనే చంద్రబాబు హిందువా? అని ప్రశ్నించారు. అలాంటి ఆయన దేవుడిపై భక్తిని ఒలకబోస్తూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. రామతీర్థం వెళ్లి చంద్రబాబు రాజధాని అమరావతి గురించే మాట్లాడి తన నైజం నిరూపించుకున్నారన్నారు. ఓటుకు కోట్లు కేసు ఉచ్చు బిగిస్తుండేసరికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో లాలూచీ చేసుకోవడానికి జై శ్రీరామ్ అంటూ బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఖబడ్దార్ అంటూ సీఎం జగన్‌కు వార్నింగ్ ఇవ్వడానికి చంద్రబాబెంత, ఆయన బతుకెంత.. అని మండిపడ్డారు. రామతీర్థం టెంపుల్‌కు ఇప్పటిదాకా చైర్మన్‌గా కొనసాగింది చంద్రబాబు పక్కన కూర్చున్న అశోకగజపతిరాజేనని, ఘటన జరిగాక ఆయనెందుకు స్పందించలేదని ప్రశ్నించారు. హిందూ దేవాలయాల్ని, భూముల్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వానిదన్నారు. -
అంతా శివమయం
రామతీర్థం(నెల్లిమర్ల), : రాష్ట్రంలో రెండో భద్రాద్రిగా పేరుగాంచిన రామతీర్థానికి శివరాత్రి మరుసటి రోజైన శుక్రవారం కూడా భక్తులు పోటెత్తారు. శివరాత్రి పర్వదినంకంటే మరుసటి రోజునే లక్షలాదిమంది భక్తులు వచ్చి ఇక్కడి సీతారాములు, శివుడ్ని దర్శించుకున్నారు. గురువారం రాత్రంతా భక్తులు దేవస్థానానికి వస్తూనే ఉన్నారు. శుక్రవారం సాయంత్రం వరకు రద్దీ కొనసాగింది. రెండురోజుల్లో మొత్తం నాలుగు లక్షలమంది భక్తులు హాజరైనట్లు దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి గత ఏడాదితో పోల్చిచూస్తే ఈ ఏడాది భక్తుల సంఖ్య తక్కువగానే ఉన్నట్లు గుర్తించారు. అయితే శుక్రవారం మా టత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా అధికసంఖ్యలో భక్తులు వచ్చారు. వేకువజామున రద్దీ మరింత ఎక్కువైంది. ఇటు గొర్లిపేట నుం చి రామతీర్థం దాకా రోడ్డంతా భక్తులతో నిండిపోయింది. వాహనాలను సీతారామునిపేట జంక్షన్‌లోనే నిలిపివేసినప్పటికీ నెల్లిమర్ల రహదారి భక్తులతో కిక్కిరిసింది. ఒకదశలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. పోలీసులు ఎక్కడికక్కడ బందోబస్తు నిర్వహించి, వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. అలా గే అటువైపు దేవుని నెలివాడ నుంచి ఆలయందాకా రోడ్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా దేవస్థానం ముందున్న తిరువీధి ఇసుక వేస్తే రాలనంతా భక్తులతో నిండిపోయింది. మధ్యాహ్నం మూడుగంటలదాకా స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. ఈసారి రెండువైపులా ద్వారాలు తెరిచి దర్శనాలకు అనుమతించడంతో భక్తులు గతంలో మాదిరి ఇబ్బంది పడలేదు. క్షేత్రపాలకుడు శ్రీఉమా సదాశివస్వామి ఆలయానికి ఈ సారి భ క్తులు పోటెత్తారు. లోపలికి వెళ్లేందుకు చాంతాడంత క్యూ ఉండడంతో ఆలయం వెలుపలే కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించడం కనిపించింది. జాగారం చేసిన భక్తులు శుక్రవారం అధిక సంఖ్యలో బోడికొండ ఎక్కి, అక్క డి కోదండరామ స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవ ప్రత్యేకాధికారి ఎన్వీఎస్ఎ న్ మూర్తి, ఈఓ బాబూరావు భక్తులకు అసౌకర్యం కలగకుండా పర్యవేక్షించారు. రామతీర్ధంలో రెండు రోజుల పాటు భక్తులకు పలు స్వచ్ఛంద సంస్థలు సేవలందించాయి.