నెల్లిమర్లలో రోడ్డుపై బైఠాయించిన వీర్రాజు
నెల్లిమర్ల (విజయనగరం): ‘ధర్మ దీక్ష’ పేరుతో బీజేపీ, జనసేన మంగళవారం తలపెట్టిన ఛలో రామతీర్థం కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. సెక్షన్–30 అమల్లో ఉండటం, శాంతిభద్రతల పరిరక్షణకు ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతివ్వలేదు. అయినా కార్యక్రమం నిర్వహించేందుకు ఆ రెండు పార్టీలు ప్రయత్నించడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సహా నేతలు, కార్యకర్తలను నెల్లిమర్లలో పోలీసులు అడ్డుకున్నారు. వారిని దాటివెళ్లేందుకు ప్రయత్నించిన వీర్రాజును, ఇతర నేతలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో గంటసేపు హైడ్రామా నడిచింది. బీజేపీ, జనసేన నేతలను రామతీర్థం వెళ్లనివ్వకుండా నిలువరించేందుకు మంగళవారం వేకువజాము నుంచే పోలీసులు భారీఎత్తున నెల్లిమర్లలో మోహరించారు. అయినప్పటికీ సోము వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ్, జనసేన రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జి యశస్వినితో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు రామతీర్థం వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి నిరసనగా సోము వీర్రాజు రోడ్డుపై బైఠాయించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమను రామతీర్థం వెళ్లకుండా అడ్డుకున్న ప్రభుత్వానిది పిరికిపంద చర్య అని ధ్వజమెత్తారు. బోడికొండపై గల రాముడిని దర్శించుకునేందుకు ప్రభుత్వం ముందుగా తమకు అనుమతిచ్చిందన్నారు. అయితే, మంగళవారం ఉదయం అకస్మాత్తుగా అనుమతి రద్దు చేసిందని ఆరోపించారు. సెక్షన్–30 అమల్లో ఉన్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు, వైఎస్సార్‌సీపీ నేత విజయసాయిరెడ్డికి అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. రాముడు తమ ఆరాధ్య దైవమని, విగ్రహాన్ని కూల్చిన పాపం ప్రభుత్వానికి తప్పకుండా తగులుతుందని అన్నారు. ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నా అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని వీర్రాజు ఆరోపించారు. దోషులను శిక్షించే వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు.
జీవీఎల్ ఖండన
సాక్షి, న్యూఢిల్లీ:రామతీర్థం పర్యటనకు వెళ్లిన ఏపీ బీజేపీ నాయకులను అరెస్ట్ చేయడాన్ని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఖండించారు. రామతీర్థంలో రాముడి విగ్రహం తలను తొలగించడం కచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆయన వ్యాఖ్యానించారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ తరహా దాడులు మరో మతంపై జరిగితే పరిణామాలు మరోలా ఉండేవన్నారు. గతంలో ముస్లిం రాజుల పాలనలో జరిగిన తీరులో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం రామతీర్థం ఘటనలో తప్ప గతంలో ఆలయాలపై దాడి జరిగినప్పుడు ఎప్పుడూ స్పందించలేదని పేర్కొన్నారు. ఒక్క చర్చిపై రాళ్లు వేస్తే 40 మందిని వెంటనే అరెస్ట్ చేసిన ప్రభుత్వం, మందిరాలపై జరిగే దాడుల విషయంలో ఎందుకు అలా వ్యవహరించడం లేదని జీవీఎల్ ప్రశ్నించారు. టీడీపీ శ్రేణులే ఈ పని చేశాయని వైఎస్సార్‌సీపీ నేతలు చెబుతున్నారే తప్ప ఎలాంటి చర్యలు లేవని విమర్శించారు. చర్చిలు మాత్రమే ప్రార్ధనా స్థలాలని ప్రభుత్వం భావిస్తోందా అనే విషయాన్ని వెంటనే స్పష్టం చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment