
ఒంగోలు: పొత్తుపై జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌నే ప్రశ్నించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. గురువారం ఆయన ఒంగోలులో మీడియాతో మాట్లాడారు. ‘బీజేపీతోనే ఉన్నానని పవన్ చెప్పారు. మేమూ అదే చెబుతున్నాం. టీడీపీతో జనసేన పొత్తు గురించి నన్ను అడగడం సరికాదు. అదేదో పవన్‌నే అడగండి’ అని సోము వీర్రాజు అన్నారు.
తమ పొత్తు జనసేనతోనే కొనసాగుతోందన్నారు. చంద్రబాబు అటూ ఇటూ తిరగడం వల్ల ఆరేడు ప్రాణాలు పోవడం తప్ప ఏమీ ఉపయోగముండదన్నారు. బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, విష్ణువర్థన్‌రెడ్డి వంటి వారు మాట్లాడే అంశాలపై తాను స్పందించనని చెప్పారు. సమావేశంలో బీజేపీ నాయకులు సూర్యనారాయణరాజు, పీవీ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.