సాక్షి, అమరావతి/రాజమహేంద్రవరం రూరల్: రాష్ట్రంలో బీజేపీని జిల్లా, మండల, గ్రామ, బూత్ స్థాయి వరకు సంస్థాగతంగా బలోపేతం చేస్తానని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన సోము వీర్రాజు అన్నారు. మంగళవారం ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ప్రతి ఒక్కరినీ కలుపుకొంటూ రాష్ట్రంలో పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి నూరు శాతం కృషి చేస్తానని పేర్కొన్నారు. ‘పార్టీ పెద్దలు నాపై పెట్టిన బాధ్యతను మనసా, వాచా, కర్మణ నిబద్ధతతో నిర్వహిస్తాను. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ ఆర్గనైజింగ్ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో పాటు కేంద్ర నాయకత్వంలో ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
పోలవరం నిర్మాణానికి తోడ్పాటు
► గ్రామ గ్రామానికి గోదావరి జలాలు అందించాలన్నది బీజేపీ లక్ష్యమని, దీనికోసం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో తోడ్పాటును అందిస్తుందని రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో వీర్రాజు మాట్లాడుతూ చెప్పారు.
► రాష్ట్రంలో జనసేన–బీజేపీ కూటమిని బలమైన శక్తిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు.
► ఇచ్చిన మాట మేరకు.. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకారంతో నిధులు తెస్తామన్నారు.
► అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలతో పాటు విద్యా వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థలపై కార్యకర్తలకు అవగాహన కల్పించనున్నట్టు చెప్పారు.
రాష్ట్రంలో మరింత బలోపేతం: సునీల్ దియోధర్
వీర్రాజు నాయకత్వం బీజేపీని రాష్ట్రంలో మరింత బలోపేతం చేస్తుందని బీజేపీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహరాల సహ ఇన్‌చార్జి సునీల్ దియోధర్ పేర్కొన్నారు. పార్టీ జాతీయ ఆర్గనైజింగ్ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, ఎమ్మెల్సీ మాధవ్, నేతలు పురందేశ్వరి, సీఎం రమేశ్, హిమాచల్‌ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సురేష్ కశ్యప్‌లు వీర్రాజుకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
కలిసి ముందుకు సాగుతాం: పవన్
రాజకీయంగా ఎంతో అనుభవం, పుష్కలమైన నాయకత్వపు లక్షణాలు, సేవాతత్పరత కలిగిన వీర్రాజు నాయకత్వంలో ఏపీలో బీజేపీ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయనతో కలసి ముందుకు సాగుతామని మనస్ఫూర్తిగా తెలియచేస్తున్నానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ధన్యవాదాలు తెలిపిన కన్నా...
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో తనకు సహకరించిన నాయకులకు, పార్టీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్టు కన్నా లక్ష్మీనారాయణ ట్వీట్ చేశారు. పార్టీ అధ్యక్షుడిగా నియమితుడైన సోము వీర్రాజుకు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment