సాక్షి, విజయవాడ : దుర్గగుడి పాలకమండలి సభ్యుల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయంలో తాంత్రిక పూజలు జరిగాయని వాస్తవాలు బైటపెట్టిన పాలక మండలిపై సీఎం అసంతృప్తిగా ఉన్నారు. అంతేకాకుండా దుర్గగుడి వివాదంపై పాలక మండలి సభ్యులు ఇకపై నోరు మెదపవద్దని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గురువారం పాలక మండలి సభ్యులతో అత్యవసర సమావేశం అయ్యారు. ఎంపీ కేశినేని నాని కార్యాలయంలో ఈ భేటీ జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలను పాలకమండలి సభ్యులకు వివరించారు. అయితే ఎటువంటి విచారణ జరగకుండానే ఆలయంలో పూజలు జరగలేదని దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఎలా ప్రకటించారని పాలకమండలి సభ్యులు...ఎమ్మెల్సీని నిలదీశారు. ఈవో వ్యవహారంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం వల్లే ఎటువంటి పరిస్థితి ఏర్పడిందని పాలకమండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదం ఇలాగే ముదిరితే పాలక మండలినే రద్దు చేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారంటూ సభ్యులను ఎమ‍్మెల్సీ బుద్ధా వెంకన్న హెచ్చరించారు. అలాగే ఈవో సూర్యకుమారి తప్పేమీ లేదని చెప్పకపోతే దుర్గగుడి ఆయల ప్రతిష్ట దెబ్బతింటుందని సూచన చేశారు.
కాగా సంప్రదాయాలకు విరుద్ధంగా దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరగడం ఇంద్రకీలాద్రిపై హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. దీనికితోడు ఈవో సూర్యకుమారిని బదిలీ చేశారంటూ సమాచారం రావడంతో బుధవారం దీనిపైనే చర్చ జరిగింది. ఈవో సూర్యకుమారి స్థానంలో సింహాచలం ఈవో రామచంద్ర మోహన్ ఇన్‌చార్జి బాధ్యతలు తీసుకుంటారంటూ జోరుగా ప్రచారం సాగింది. అయితే, బుధవారం రాత్రి వరకూ ఈవోను మార్చుతున్నట్లు ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో అంతా సందిగ్ధంలో పడింది. దీనిపై పూర్తి విచారణ చేయించి, నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి ప్రకటించడంతో ఏ నిమిషానికి ఏం జరుగుతుందోనన్న ఆందోళన దేవస్థానం వర్గాల్లో నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment