అసలే పార్టీ పరిస్థితి అంతంత మాత్రం.. అందులోనూ గ్రూప్ రాజకీయాలు.. వర్గ విభేదాలు. పాతాళానికి పడిపోయిన పార్టీతో అధినేత ఆందోళన చెదుతుంటే.. వ్యక్తిగత ఆరోపణలతో నేతలు రోడ్డెక్కుతున్నారు. ఆ జిల్లా.. ఈ జిల్లా అని కాదు.. అన్ని చోట్లా టీడీపీ పరిస్థితి ఇలానే ఉంది. పచ్చపార్టీ నేతలు గ్రూప్లు కట్టి మరీ కొట్లాడుకుంటున్నారు.
తెలుగుదేశం పార్టీలో నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు.. విభేదాలతో టీడీపీ నాయకులు రోడ్డెక్కుతున్నారు.. ఒకరిపై మరొకరు బహిరంగంగానే విమర్శలు గుప్పించుకుంటున్నారు. నేతలు కలహాలతో పార్టీ పరువు బజారున పెడుతున్నారు. పార్టీలో ఒక క్రమశిక్షణ సంఘం ఉందనే విషయాన్ని కూడా మర్చిపోయి నేతలు నువ్వు ఎంత అంటే నువ్వు ఎంతని ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారు.. పార్టీలో జరుగుతున్న పరిణామాలు చక్కదిద్ద లేక నాయకులకు సర్ది చెప్పలేక చంద్రబాబు చివరికి నిస్సహాయుడిగా మిగిలిపోతున్నారు. ఒకప్పుడు పార్టీ కేడర్ను కంటిచూపుతో శాసించిన చంద్రబాబు మాటను ఇప్పుడు ఎవరూ లెక్క చేసే పరిస్థితి కనిపించడం లేదు.. మీ దారి మీదే మా దారి మాదే అన్నట్లు పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు.. పార్టీ కంటే వర్గ ప్రయోజనాలే ముఖ్యమనే ధోరణిలో పచ్చనేతల తీరు ఉంది.
విజయవాడలో ఎంపీ కేశినేని నాని, బుద్ధ వెంకన్న రెండు వర్గాలుగా విడిపోయి కత్తులు దూసుకుంటున్నారు. ఒక వర్గం పై మరొక వర్గం నేతలు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. ఒకరిపై మరొకరు పై చేయి సాధించేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు.. కాల్ మనీ సెక్స్ రాకెట్ గాళ్లకు చంద్రబాబు అధిక ప్రాధాన్యత నిస్తున్నారని నాని మీడియా ముందు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు.. కొంతమంది పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.. పార్టీ కోసం ఎవరూ పనిచేయడం లేదని, మీడియా ముందు కెమెరాలకు ఫోజులు ఇస్తుంటారని నాని మండిపడ్డారు.. చివరకు తమ స్వార్థం కోసం తమ కుటుంబ వ్యవహారాల్లో కూడా వేలు పెడుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.. తనకు వ్యతిరేకంగా తన సోదరుడిని కొంతమంది ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.. నాని కామెంట్స్పై బుద్దా వెంకన్న కూడా అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. తమను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని కొంతమంది వ్యవహరిస్తున్నారని నానిని ఉద్దేశించి మాట్లాడారు.. బీసీలను పార్టీకి దూరం చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు..
అటు విశాఖ జిల్లాలో ఇద్దరు మాజీ మంత్రులు అయ్యన్న పాత్రుడు గంటా శ్రీనివాస రావుల మధ్య వైరం మరోసారి మొదలైంది. ఎన్నికల తర్వాత గంటా శ్రీనివాసరావు సైలెంట్ అయ్యారు.. ఎన్నికల సమీపిస్తుండడంతో మళ్లీ గంటా యాక్టీవ్ అయ్యారు.. గంటాపై మరోసారి అయ్యన్నపాత్రుడు తనదైన శైలిలో రెచ్చిపోయారు.. గంటా ఎవడండి లక్షల్లో ఒకడు అంటూ ఆవేశంగా మాట్లాడారు.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇంట్లో దాక్కొని ఎన్నికలు వస్తుండడంతో మళ్లీ పుట్టలో పాముల్లా బయటకు వస్తున్నారని మండిపడ్డారు.
కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడని వాడు ఏం నాయకుడని గంటాను ప్రశ్నించారు. గంటా కూడా అయ్యన్నకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చేందుకు తన అనుచరులతో సిద్ధమవుతున్నారట. తాను సొంత కుటుంబ సభ్యులకి అయ్యన్నలా వెన్నుపోటు పోడవలేదని అక్రమంగా ఆస్తులు సంపాదించలేదని కొడుకుల కోసం సీట్లు అడగలేదని గంటా వర్గం అయ్యన్నపై విమర్శలు చేస్తోంది. మరోవైపు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పార్టీలో నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. నాయకులు ఎక్కడికక్కడ గ్రూపులుగా విడిపోయి ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పటికే అంతంత మాత్రమంగా ఉన్న టీడీపీని ఈ గ్రూపు రాజకీయాలు మరింత పాతాళానికి తొక్కేస్తాయని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. చంద్రబాబుకు పార్టీ మీద రోజురోజుకీ పట్టు సడలిపోతుందనే అభిప్రాయాన్ని ఆ పార్టీ కేడర్ నుంచి వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment