భోగి భాగ్యాల సంక్రాంతి | grand sankranthi celebrations in nellore district | Sakshi
Sakshi News home page

భోగి భాగ్యాల సంక్రాంతి

Published Tue, Jan 14 2014 3:14 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM

grand sankranthi celebrations in nellore district

 పల్లెకు పండగొచ్చింది.
 ప్రతి ఇంటి లోగిళ్లు రంగు రంగుల రంగవల్లులతో కళకళలాడుతున్నాయి. పొట్టకూటి కోసం వలస వెళ్లిన వారంతా ఓ చోట చేరారు. చిన్నాపెద్దా తేడా లేకుండా భోగి మంటల సందడిలో భాగస్వాములై సంతోషం పంచుకుంటున్నారు.  పేద, ధనిక తారతమ్యం లేకుండా అందరిలో ఆత్మీయ అనుబంధాలను సంక్రాంతి తట్టిలేపుతోంది. ఊరూవాడా కోలాహలం నింపింది.
 
 నెల్లూరు(వేదాయపాళెం), న్యూస్‌లైన్: సంక్రాంతి సంబరాలతో ఊరూవాడా సందడిగా మారింది. పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేకుండా పండగకు ముస్తాబయ్యాయి. రంగవల్లులు, హరిదాసులు, గంగిరెద్దులు, భోగిమంటలు, పిండి వంటలు, బంధుమిత్రుల సందడితో ఊళ్లన్నీ కళకళలాడుతున్నాయి.
 
 సోమవారం అర్ధరాత్రి నుంచే భోగి మంటలు అంబరాన్నంటాయి. తాటాకులు, కొయ్యలు, టైర్లు, ఇళ్లలో పనికిరాని వస్తువులతో భోగి మంటలు వేశారు. నగరం నుంచి పల్లె వరకు ప్రతి చోట యువకులు బృందాలుగా ఏర్పడి కూడళ్లలో మంటలు వేశారు. మంటలు వేయడంలో ఒకరితో ఒకరు పోటీపడ్డారు. భోగినాడు తిట్లు తిట్టించుకుంటే మంచిదనే నమ్మకంతో ఇతరులకు చెందిన కొయ్యలు, తడికలు, దుంగలను తెచ్చి మంటల్లో కాల్చేశారు. మరోవైపు కుటుంబసభ్యులు, బంధువులు స్నేహితులు కలిసి పిండివంటలు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. మంగళవారం వేకువజాము నుంచి పండగలో ప్రధాన ఘట్టం మొదలుకానుంది. ఇంటిల్లపాది నూతన వస్త్రాలతో సందడి చేయనున్నారు.  కొత్త అల్లుళ్లకు మాంసాహార విందులు, బావలను మరదళ్లు ఆటపట్టించడం, కోడి పందేలు, ఎడ్ల పందేలు, వివిధ రకాల ఆటల పోటీలతో పండగ శోభ వెల్లివిరియనుంది. సాయంత్రం భోగి కల్యాణాలు( గోదాదేవి కల్యాణం) నేత్రపర్వంగా జరగనున్నాయి.
 
 సంక్రాంతికి సర్వం సిద్ధం
 సంక్రాంతిని ఘనంగా జరుపుకునేందుకు సర్వం సిద్ధమైంది. మకర సంక్రాతిని పురస్కరించుకుని బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వ రకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం పితృదేవతలకు తర్పణం వదలడం, తమ నివాసాల్లో వారికి దుస్తులు పెట్టుకుని పూజిస్తారు. బ్రాహ్మణులను ఇళ్లకు ఆహ్వానించి మోయిన ఇస్తారు. ప్రధానంగా గుమ్మడికాయ దానానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.
 
 పితృదేవతలకు పూజలు చేసేందుకు నెల్లూరు బోడిగాడితోటలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సమాధుల వద్ద నగరపాలకసంస్థ ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు చేపట్టారు. బుధవారం పెద్దసంఖ్యలో ప్రజలు ఇక్కడకు తరలిరానున్నారు. ప్రతి ఒక్కరూ తమ పెద్దలకు వస్త్రాలు, పిండి  వంటలు సమర్పించి, వారిని స్మరించుకుని జ్ఞాపకాలను నెమరువేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే పలువురు తమ పితృదేవతల సమాధులను రంగులు వేస్తున్నారు.
 
 నేత్రపర్వంగా గోదాదేవి కల్యాణం
 నెల్లూరు(వేదాయపాళెం), న్యూస్‌లైన్: రాపత్తు ఉత్సవాల్లో భాగంగా నగరంలోని మూలాపేటలో కొలువైన రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వారి దివ్యసన్నిధిలో గోదాదేవి కల్యాణం సోమవారం నేత్రపర్వంగా జరిగింది. ఆలయ అర్చకుడు శ్రీనివాస అయ్యంగార్ ఆధ్వర్యంలో అర్చకులు తొలుత రుక్మిణీ, సత్యభామ సమేతంగా గోదాదేవి, వేణుగోపాలస్వామివారి ఉత్సవమూర్తులను కల్యాణవేదికపై కొలువుదీర్చారు. పట్టుపీతాంబరాలు, వజ్రవైఢుర్యాలు, సుగంధపరిమళాలు వెదజల్లే పవిత్ర పుష్పాలతో దేవదేవేరులు భక్తులకు దర్శనమిచ్చారు. తదుపరి విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం చేశారు. అనంతరం రక్షాబంధనం, యజ్ఞోపవీతధారణ, వస్త్ర బహుమానం, కన్యాదానాన్ని జరిపారు. అనంతరం భక్తజనుల హర్షధ్వానాలు, మేళతాళాల నడుమ నేత్రపర్వంగా గోపాలుడు, గోదాదేవికి మాంగల్యధారణ చేశారు. అనంతరం తలంబ్రాలు, మంగళహారతి సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. భక్తులు సామూహికంగా విష్ణుసహస్రనామ పారాయణం చేశారు. ఉభయకర్తలుగా గండవరపు నిరంజన్‌రెడ్డి కుటుంబసభ్యులు వ్యవహరించారు. ఆలయ మేనేజర్ కృష్ణ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాల్లో వ్యవస్థాపక ధర్మకర్తలు, పురప్రముఖులు పాల్గొన్నారు.
 
 అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
 కావలి, న్యూస్‌లైన్: పట్టణ వాసుల ఇలవేల్పు శ్రీకలుగోళ శాంభవీదేవి అమ్మవారి సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా కావలిలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అమ్మవారి ఆలయం ఎదుట సోమవారం రాత్రి శివతాయి మండలి నిర్వాహకులు ఆధ్వర్యంలో ప్రదర్శించిన చింతామణి నాటకం ఆసక్తికరంగా సాగింది. అద్దంకి, పులివెందులకు చెందిన కళాకారులు ఈ నాటకాన్ని ప్రదర్శించారు.
 
 సుబ్బిశెట్టి పాత్రను అద్దంకికి చెందిన శ్రీను, చింతామణి పాత్రను పులివెందులకు చెందిన వసంతలక్ష్మి పోషించారు. పెద్దపవని బస్టాండ్ సెంటర్లో స్నేహ యూత్ ఆధ్వర్యంలో నృత్యప్రదర్శన జరిగింది. సాయిమహల్ సెంటర్లో వడ్డిపాలెం యూత్ ఆధ్వర్యంలో సినీపాట కచేరి నిర్వహించారు. పోటాపోటీగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు కావలిలో కోలాహల వాతావరణం నెలకొంది. కళుగోళ శాంభవీ ఆలయం, పట్టణంలోని పలు రోడ్లలో చేసిన విద్యుత్ దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
 
 నేడు గ్రామోత్సవం
 అమ్మవారి గ్రామోత్సవం మంగళవారం ప్రారంభం కానుంది. బుధవారం వరకు జరిగే ఈ ఉత్సవం సర్వాయపాళెం చేరుకుంటుంది.
 
 కోలాహలం
 హిందువులు సంక్రాంతిని పెద్ద పండగగా భావిస్తారు. పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమ శక్తి మేర పండగను ఘనంగా చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ దుస్తుల కొనుగోలు, పిండి వంటల తయారీకి ప్రాధాన్యం ఇస్తారు. అందులో భాగంగా జిల్లాలోని ప్రధాన పట్టణాలన్ని సోమవారం జనంతో కిటకిటలాడాయి. నెల్లూరుతో పాటు సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, పొదలకూరు, బుచ్చిరెడ్డిపాళెం, వింజమూరు తదితర పట్టణాల్లోని దుకాణాలు జనంతో కిక్కిరిశాయి. నెల్లూరులోని షాపింగ్‌మాళ్లు, ప్రముఖ వస్త్ర దుకాణాలు, రెడిమేడ్ దుస్తుల షోరూమ్లు, మద్రాస్ బస్టాండ్, స్టోన్‌హౌస్‌పేట, చిన్నబజార్, పెద్దబజార్‌లోని చిల్లర సామాన్ల దుకాణాలు, కూరగాయలు, పూలు, సండే మార్కెట్లలో పూర్తి రద్దీగా మారాయి. కోళ్లు, పొట్టేళ్ల విక్రయాలు కూడా జోరుగా సాగాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement