సంక్రాంతి శోభ
రాష్ట్రంలో సంక్రాంతి సందడి ఆరంభమైంది. స్వగ్రామాలకు జనం తరలి వెళ్లడంతో మంగళవారం బస్సులు, రైళ్లు కిక్కిరిశాయి. బుధవారం భోగి పండుగను కాలుష్య, ప్రమాద రహితంగా జరుపుకుందామని పర్యావరణ శాఖ పిలుపునిచ్చింది. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి భద్రతా ఏర్పాట్లను పోలీసు యంత్రాంగం చేపట్టింది. అనేక ప్రాంతాల్లో అగ్నిమాపక వాహనాల్ని సిద్ధంగా ఉంచారు.
సాక్షి, చెన్నై: భోగి మంటలు, రేగి పండ్లు, గొబ్బెలు, గంగిరెద్దులు, హరిదాసుల కృష్ణార్పణాల మేళవింపుతో సంక్రాంతి శోభ రానే వచ్చింది. బుధవారం భోగి, గురువారం సంక్రాంతి, శుక్రవారం కనుమ, శనివారం కానం పొంగళ్ పర్వదినాల్ని జరుపుకునేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధమయ్యారు. పండుగ సమయం ఆసన్నం కావడంతో షాపింగ్ సందడి ముగిసినట్టు అయింది. కొత్త బట్టలు కొనుగోలు చేసిన ప్రజలు, ఇక భోగి అనంతరం పొంగళ్లు పెట్టి పూజాది కార్యక్రమాల వస్తువుల మీద దృష్టి పెట్టనున్నారు. పూజా సామగ్రి వస్తువులు మార్కెట్లలో కొలువు దీరాయి. అరటి పండ్లు, ఆపిల్, ఆరెంజ్ తదితర పండ్ల ధరలకు రెక్కలు వచ్చాయి. చెరకు ధరలు అమాంతంగా పెరిగాయి. పది చెరకుల కట్ట రూ.300 వరకు పలికింది. మదురై, దిండుగల్ చెరకులకు భలే డిమాండ్ ఏర్పడింది. అరటి గెలలకు సైతం రెక్కలు రాగా, పువ్వుల ధర ప్రియంగా మారింది.
బోగి తప్పెట్లు: కష్టాలు వైదొలగి, తమ బాధలన్నీ మంటల్లో ఆహుతినిచ్చే రీతిలో బోగి మంటల్ని వేయడం జరుగుతోంది. ఇళ్లలోని పాత వస్తువుల్ని, చాప, చీపురు కట్టలు ఇలా పలు వస్తువులను ఈ బోగి మంటల్లో వేస్తారు. ఈ బోగి పండుగను చిన్న పిల్లలు భలే సరదాగా ఆనందిస్తుంటారు. తప్పెట్లు వాయిస్తూ కేకలు పెడుతూ ఆనందాన్ని ఆస్వాదించే ఈ పండుగ కోసం మార్కెట్లో తప్పెట్లు కొలువు దీరాయి. మెట్టు పాళయం, పెరంబూరు, చూళై, ఆరుదొడ్డిల్లోని గ్రామీణ కళాకారులు తీర్చిదిద్దిన ఈ తప్పెట్లు బుధవారం వేకువ జామున బోగి సందర్భంగా మర్మోగనున్నాయి. బోగీకి సర్వం సిద్ధం చేసుకున్న జనం తప్పెట్ల కొనగోళ్లలో బిజీ అయ్యారు. ఈ తప్పెట్ల ధరలు రూ. 25 నుంచి రూ.50 వరకు పలికాయి.
స్వగ్రామాలకు జనం
ఇంటిల్లిపాది ఆనందంతో జరుపుకునే పెద్ద పండుగకు సెలువులూ ఎక్కువే. దీంతో నగరంలో పనిచేస్తున్న వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్లు పండగ కోసం తమ స్వగ్రామాలకు తరలి వెళ్లారు. దక్షిణాది జిల్లాలకు చెందిన వేలాదిమంది ఉద్యోగం, వ్యాపారం, చదువు తదితర పనుల నిమిత్తం చెన్నైలో ఉంటున్నారు. వీరంతా ఒక్కసారిగా తమ ప్రాంతాలకు తరలడంతో రైళ్లు, బస్సులు కిక్కిరిశాయి. చెన్నై సెంట్రల్, ఎగ్మూర్ స్టేషన్లలో దక్షిణాది జిల్లాల వైపుగా పది వరకు రైళ్లు పయనిస్తుండడంతో ఆ రైళ్ల బోగీలు ఇసుక వేస్తే రాలనంతగా కిటకిటలాడాయి. రిజర్వేషన్ లేని వాళ్ల కోసం ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేసి బోగీల్లోకి రైల్వే పోలీసులు అనుమతించారు. ఇక కోయంబేడు బస్టాండ్ జన సందోహంతో నిండింది. ప్రభుత్వం ప్రత్యేక బస్సులు నడిపింది. ముందస్తు రిజర్వేషన్లు లేని వారికి టోకెన్లను అందజేశారు. ఆ టోకెన్ల ఆధారంగా బస్సుల్లో టికెట్లను తీసుకునే అవకాశం కల్పించారు.
ఆమ్నీ బస్సుల వద్దకు సైతం జనం పరుగులు తీయక తప్పలేదు. ప్రభుత్వ బస్సులు కిటకిటలాడడంతో ఆమ్నీ యాజమాన్యాలు తమ పనితనాన్ని ప్రదర్శించే యత్నం చేశారని చెప్పవచ్చు. ప్రమాద రహితంగా... : పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్ర పోలీసు యంత్రాంగం గట్టి భద్రతకు ఆదేశించింది. చెన్నై మహానగరంలో జన సంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో భద్రతను పెంచారు. బోగి రోజున టైర్లు, ప్లాస్టిక్ వస్తువులను కాల్చితే మాత్రం చర్యలు తప్పదని హెచ్చరించారు. పర్యావరణానికి ఆటంకం కల్గని రీతిలో, ప్రమాదాల రహితంగా బోగీని జరుపుకుందామని ప్రజలకు పోలీసులు, పర్యావరణ శాఖ పిలుపు నిచ్చింది. ప్రధానంగా గుడిసె ప్రాంతాలు, పెట్రోల్ బంకుల సమీపాల్లో అగ్నిమాపక వాహనాల్ని సిద్ధం చేసి ఉంచారు.