Path of movement
-
భోగి వైభోగం
సౌరమానాన్ని ఆధారంగా చేసుకున్న పండగ భోగి. తెల్లవారు జామునే భోగి మంట వేస్తారు. కర్రపుల్లలు, పిడకల దండలు, పాత సామాన్లు, కొబ్బరిమట్టలు... లాంటివాటితో పెద్దపెద్ద మంటలు వేస్తారు. పాత వస్తువులతో పాటు, మనుషుల మనసుల్లో దాగి ఉన్న పాత అలవాట్లను సైతం అగ్నిలో దహింపచేసి, ఆరోజు నుంచి కొత్త ఆయనంలోకి, కొత్త జీవితాన్ని మొదలుపెట్టడానికి కొత్త మార్గంలో ప్రయాణించడానికి సూచనగా భావిస్తారు. గ్రామాల్లో నాలుగు రోడ్ల కూడళ్లలో భోగిమంట వేస్తారు. అలా అందరూ ఒకచోట చేరటం వలన సమైక్యత ఏర్పడుతుంది. ఈ రోజున భోగి మంట వేసుకోవటం వెనుక కూడా ఆరోగ్య రహస్యం దాగి ఉంది. సరిగ్గా భోగితో దక్షిణాయనం పూర్తయ్యి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. చలి కూడా వెనకపడుతుంది. ఒక్కసారిగా వాతావరణం వేడిగా మారుతుంది. ఆ వేడిని తట్టుకోవడం కోసమే ఈ మంట వేసుకునే సంప్రదాయం వచ్చి ఉండవచ్చునని ఆధ్యాత్మికవేత్తల అభిప్రాయం. వీటి నుండి వచ్చే పొగ ఆరోగ్యం కలిగించేదే కాని హాని కలిగించేది కాదు. ఈ మంట వేయడానికి పిల్లలందరూ ఇంటింటికీ వెళ్లి తోటి పిల్లల్నందర్నీ నిద్రలేపి పరాచికాలాడుకుంటూ, చలికాచుకుంటూ కోలాహలంగా కనిపిస్తారు. సైన్సుపరంగా చెప్పాలంటే, చలికాలం వాతావరణంలో సూక్ష్మక్రిములు అభివృద్ధి చెందడానికి అనువైన కాలం. అందువల్ల అందరూ ఏకకాలంలో భోగిమంటలు వేయడం వల్ల సూక్ష్మక్రిములన్నీ నశించిపోయి అంటువ్యాధులు ప్రబలకుండా ఉంటాయి. అదేవిధంగా ఎప్పటెప్పటి నుంచో మూలన పడి ఉన్న పాత సామానును ఏడాదికోసారి ఈ విధంగా వదిలించుకోవడం వల్ల దుమ్ము, ధూళి, ఎలుకలు, వాటిని తినడానికి పాములు చేరకుండా ఉంటాయనేది పెద్దల మాట. భోగం అంటే పిల్లలకు భోగం చేయడం. పిల్లలకు భోగిపళ్లు పోసేటప్పుడు రేగు పళ్లు, రాగి పైసలు, పువ్వులు మూడిటినీ కలిపి తలచుట్టూ మూడుసార్లు తిప్పి తలమీద పోస్తారు. కొన్ని ప్రాంతాలలో రేగుపళ్లు, చిల్లరడబ్బులు, కొత్తబియ్యం, తేగ ముక్కలు, చెరకు ముక్కలు, పాలకాయలు, పచ్చి శనగ కాయలు, పూలరేకలు అన్నీ కలిపి పోస్తారు. దీనివల్ల దృష్టి దోషం పోతుందని విశ్వాసం. పిల్లలు కూర్చునే పీటకింద ఇంట్లో తయారు చేసుకున్న పిండివంటన్నీ వేస్తారు. వాటిని తరవాత ఇంట్లో నమ్మకంగా పనిచేసే వారికి ఇచ్చేస్తారు. చివర్లో పేరంటాళ్లకి వాయినం ఇస్తారు. ఇందులో ఆరోగ్యానికి ఉపకరించే మొలకెత్తిన శనగలు తమలపాకులు, వక్క ఇస్తారు. మన పండుగల వెనుక సంప్రదాయంతోపాటు ఆరోగ్య కోణమూ దాగి ఉంది. అందుకే ఈ వంటకాలు, వాయినాలు ఆనవాయితీగా వస్తున్నాయి.వస్తు వ్యామోహానికి మంటమనుషుల మీదైనా, వస్తువుల మీదైనా వెర్రివ్యామోహం పనికిరాదు. కరుడుగట్టిన అలాంటి కోరికలేవైనా ఉంటే వాటిని వదిలించుకోవాలి. అప్పుడే జీవితం నిశ్చింతగా ఉంటుంది. ఈ మాటను ఊరికే చెబితే ఎవరూ వినరు కాబట్టి భోగిమంట రూపంలో చెబితే వింటారన్నది పెద్దల నమ్మకం. ఇక పోతే, భోగిపండ్లు లేదా రేగుపండ్లలో ఎనలేని ఔషధగుణాలు ఉన్నాయి. చలికాలంలో ఎవరికైనా జీర్ణశక్తి మందగిస్తుంది. పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే కాని సమస్య తొలగిపోదు. ఒకప్పుడు ఇప్పుడున్నంత ఆరోగ్య చైతన్యం లేదు కనక.. ఆ లోటును పూడ్చేందుకు రేగుపండ్లను తినమనే వారు. రేగులోని జిగట పదార్థం అన్నవాహికను శుభ్రం చేస్తుంది. ‘భుక్త్వాచ బదరీఫలం’ అన్నది అందుకే. భోంచేసిన తర్వాత రేగుపండ్లు తింటే మంచిదని దాని అర్థం. రేగుపండ్లు శరీరంలో వేడిని పుట్టించే రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. ఆకలి పుట్టిస్తాయి. రేగుపండ్లకున్నప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకునే.. పండగపూట పిల్లలకు చిల్లర నాణేలతో కలిపి భోగిపండ్లు పోస్తారు. మహా భక్తురాలైన గోదాదేవి భోగినాడే రంగనాథుని పతిగా పొందిందని ద్రవిడ వేదం చెబుతోంది. అందువల్ల విష్ణ్వాలయాలలో భోగిరోజు గోదా రంగనాథులకు కల్యాణం జరిపిస్తారు. – డి.వి.ఆర్. -
కొలువులపై ఆశలు
- ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో 1.03 లక్షల మంది - మరో 60వేల మందికి పైగా ఇంజినీరింగ్ అభ్యర్థులు - ఇతర వృత్తివిద్యా అభ్యర్థులది అదే దుస్థితి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన యువత కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకుంది. నిన్నటివరకు ఉద్యమ బాటలో నడిచిన యువతరం.. నేడు నవ తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోంది. సమైక్య రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీలో అన్యాయం జరిగిందని ఆవేదనతో ఉన్న యువతీ యువకులు.. ప్రత్యేక రాష్ట్రంలో తగిన ప్రాధాన్యం లభిస్తుందని భావిస్తున్నారు. సాక్షి, కరీంనగర్ : ఉమ్మడి రాష్ర్టంలోని ఆయా ప్రభుత్వ విభాగాల్లో లక్షలాది పోస్టులు ఖాళీగా ఉండగా పాలకులు వాటిని భర్తీ చేయకుండా వదిలేశారు. కేవలం ఉపాధ్యాయ, పోలీసు ఉద్యోగాలను మాత్రమే పెద్ద సంఖ్యలో భర్తీ చేస్తూ వచ్చారు. ఇతర అవసరమైన పోస్టుల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ నియామకాలతో నెట్టుకొచ్చారు. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఖాళీ పోస్టులను భర్తీ చేయడంతో పాటు కొత్తగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమద్ధీకరిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు అదే పార్టీ అధికారంలోకి రావడంతో నిరుద్యోగుల్లో ఆశలు రెట్టింపయ్యాయి. డిగ్రీలు, పజీలతో పాటు పలు వృత్తివిద్యా కోర్సులు పూర్తి చేసిన యువత ప్రస్తుతం తమ విద్యార్హతలకు తగ్గ ఉద్యోగాలను కోరుకుంటోంది. రెండు లక్షల మంది నిరుద్యోగులు జిల్లాలో నిరుద్యోగుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో 1.03 లక్షల మంది వివిధ విద్యార్హతలతో ఉద్యోగాల కోసం పేర్లు నమోదు చేసుకుని అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. వీరు కాకుండా 60 వేలకు పైగా ఇంజినీరింగ్ విద్యార్థులు హైదరాబాద్‌లో ఉద్యోగాల కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. జిల్లాలో 57 ప్రభుత్వ, 200 పైచిలుకు ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, 190 డిగ్రీ, 38 పీజీ, రెండు మెడికల్, 17 ఇంజినీరింగ్, 10 ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలు ఉన్నాయి. ఇవికాకుండా మరో 40 వరకు బీఈడీ, డైట్, ఫార్మసీ, నర్సింగ్‌తో పాటు ఇతర వృత్తివిద్యా కాలేజీలు ఉన్నాయి. వీటినుంచి ఏటా సగటున 20 వేల మందికి పైగా విద్యార్థులు చదువులు పూర్తి చేసుకొని ఉద్యోగాల అన్వేషణలో పడుతున్నారు. అవకాశం అందివస్తే సర్కారు కొలువుల్లో స్థిరపడాలని కలలు కంటున్నారు. కానీ ఏళ్లు గడుస్తున్నా వారికి ఉద్యోగాలు మాత్రం దక్కడం లేదు. దీంతో పలువురు యువతీ యువకులు చిన్నాచితక ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తుండగా, మరికొందరు చిరువ్యాపారాలు సాగిస్తున్నారు. చదువుకు తగ్గ ఉద్యోగం లభించక, తల్లిదండ్రులకు భారం కాలేక.. తమ బతుకు ఇంతేనా అంటూ కుమిలిపోతున్నారు. ప్రస్తుత సర్కారు వీరందరికి ఉద్యోగావకాశాలు కల్పించి.. బతుకుదెరువు చూపించాల్సిన బాధ్యను అందరూ గుర్తు చేస్తున్నారు. ఉపాధి కల్పన కార్యాలయాలు నిరుపయోగం.. గతంలో ఎంప్లాయ్మెంట్ కార్డు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే సీనియారిటీ ప్రకారం ఉపాధి కల్పన కార్యాలయం ద్వారా ఉద్యోగాలు వచ్చేవి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలోనూ మార్పు వచ్చింది. ప్రభుత్వమే పలు కీలక శాఖల్లో నేరుగా ఉద్యోగ నియామకాలను చేపడుతోంది. ప్రైవేట్ కంపెనీలు ఎంప్లాయ్మెంట్ కార్యాలయంతో సంబంధం లేకుండా జాబ్‌మేళాలు, క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా ఉద్యోగులను ఎంపిక చేసుకుంటున్నాయి. కొన్ని ప్రభుత్వ శాఖలు నేరుగా నియామక ప్రకటన ఇచ్చి నియామకాలు చేపడుతున్నాయి. దీంతో ఉపాధి కల్పన కార్యాలయాలు నిరుపయోగంగా మారాయి. మన జిల్లాలో కరీంనగర్, పెద్దపల్లిలో ఉపాధి కల్పన కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో ఏటా వేలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ కార్యాలయాల నుంచి ఉద్యోగాల ఇంటర్వ్యూల కోసం కాల్‌లెటర్లు మాత్రం అందడం లేదు. దీంతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న మూడేళ్లకు రెన్యువల్ చేయించుకునేందుకు చాలామంది ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం స్పందించి ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.