కొలువులపై ఆశలు | youth are dreams of new government | Sakshi
Sakshi News home page

కొలువులపై ఆశలు

Published Tue, Jun 17 2014 3:58 AM | Last Updated on Sat, Sep 2 2017 8:54 AM

కొలువులపై ఆశలు

కొలువులపై ఆశలు

- ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసులో 1.03 లక్షల మంది
- మరో 60వేల మందికి పైగా ఇంజినీరింగ్ అభ్యర్థులు
- ఇతర వృత్తివిద్యా అభ్యర్థులది అదే దుస్థితి

తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర     పోషించిన యువత కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకుంది. నిన్నటివరకు ఉద్యమ బాటలో నడిచిన యువతరం.. నేడు నవ     తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోంది. సమైక్య రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీలో అన్యాయం జరిగిందని ఆవేదనతో ఉన్న     యువతీ యువకులు.. ప్రత్యేక రాష్ట్రంలో     తగిన ప్రాధాన్యం లభిస్తుందని భావిస్తున్నారు.
సాక్షి, కరీంనగర్ : ఉమ్మడి రాష్ర్టంలోని ఆయా ప్రభుత్వ విభాగాల్లో లక్షలాది పోస్టులు ఖాళీగా ఉండగా పాలకులు వాటిని భర్తీ చేయకుండా వదిలేశారు. కేవలం ఉపాధ్యాయ, పోలీసు ఉద్యోగాలను మాత్రమే పెద్ద సంఖ్యలో భర్తీ చేస్తూ వచ్చారు. ఇతర అవసరమైన పోస్టుల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ నియామకాలతో నెట్టుకొచ్చారు. టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఖాళీ పోస్టులను భర్తీ చేయడంతో పాటు కొత్తగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమద్ధీకరిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు అదే పార్టీ అధికారంలోకి రావడంతో నిరుద్యోగుల్లో ఆశలు రెట్టింపయ్యాయి. డిగ్రీలు, పజీలతో పాటు పలు వృత్తివిద్యా కోర్సులు పూర్తి చేసిన యువత  ప్రస్తుతం తమ విద్యార్హతలకు తగ్గ ఉద్యోగాలను కోరుకుంటోంది.
 
రెండు లక్షల మంది నిరుద్యోగులు
జిల్లాలో నిరుద్యోగుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో 1.03 లక్షల మంది వివిధ విద్యార్హతలతో ఉద్యోగాల కోసం పేర్లు నమోదు చేసుకుని అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. వీరు కాకుండా 60 వేలకు పైగా ఇంజినీరింగ్ విద్యార్థులు హైదరాబాద్‌లో ఉద్యోగాల కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. జిల్లాలో 57 ప్రభుత్వ, 200 పైచిలుకు ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, 190 డిగ్రీ, 38 పీజీ, రెండు మెడికల్, 17 ఇంజినీరింగ్, 10 ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలు ఉన్నాయి. ఇవికాకుండా మరో 40 వరకు బీఈడీ, డైట్, ఫార్మసీ, నర్సింగ్‌తో పాటు ఇతర వృత్తివిద్యా కాలేజీలు ఉన్నాయి.

వీటినుంచి ఏటా సగటున 20 వేల మందికి పైగా విద్యార్థులు చదువులు పూర్తి చేసుకొని ఉద్యోగాల అన్వేషణలో పడుతున్నారు. అవకాశం అందివస్తే సర్కారు కొలువుల్లో స్థిరపడాలని కలలు కంటున్నారు. కానీ ఏళ్లు గడుస్తున్నా వారికి ఉద్యోగాలు మాత్రం దక్కడం లేదు. దీంతో పలువురు యువతీ యువకులు చిన్నాచితక ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తుండగా, మరికొందరు చిరువ్యాపారాలు సాగిస్తున్నారు. చదువుకు తగ్గ ఉద్యోగం లభించక, తల్లిదండ్రులకు భారం కాలేక.. తమ బతుకు ఇంతేనా అంటూ కుమిలిపోతున్నారు. ప్రస్తుత సర్కారు వీరందరికి ఉద్యోగావకాశాలు కల్పించి.. బతుకుదెరువు చూపించాల్సిన బాధ్యను అందరూ గుర్తు చేస్తున్నారు.
 
ఉపాధి కల్పన కార్యాలయాలు నిరుపయోగం..
గతంలో ఎంప్లాయ్‌మెంట్ కార్డు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే సీనియారిటీ ప్రకారం ఉపాధి కల్పన కార్యాలయం ద్వారా ఉద్యోగాలు వచ్చేవి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలోనూ మార్పు వచ్చింది. ప్రభుత్వమే పలు కీలక శాఖల్లో నేరుగా ఉద్యోగ నియామకాలను చేపడుతోంది. ప్రైవేట్ కంపెనీలు ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయంతో సంబంధం లేకుండా జాబ్‌మేళాలు, క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా ఉద్యోగులను ఎంపిక చేసుకుంటున్నాయి.

కొన్ని ప్రభుత్వ శాఖలు నేరుగా నియామక ప్రకటన ఇచ్చి నియామకాలు చేపడుతున్నాయి. దీంతో ఉపాధి కల్పన కార్యాలయాలు నిరుపయోగంగా మారాయి. మన జిల్లాలో కరీంనగర్, పెద్దపల్లిలో ఉపాధి కల్పన కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో ఏటా వేలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ కార్యాలయాల నుంచి ఉద్యోగాల ఇంటర్వ్యూల కోసం కాల్‌లెటర్లు మాత్రం అందడం లేదు. దీంతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న మూడేళ్లకు రెన్యువల్ చేయించుకునేందుకు చాలామంది ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం స్పందించి ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement