employment office
-
రేపు ఉపాధి కార్యాలయంలో ఉద్యోగ మేళా
కర్నూలు(హాస్పిటల్): జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 12వ తేదీన ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ప్రతాపరెడ్డి బుధవారం ప్రకటనలో తెలిపారు. ఎన్ఎస్ఎల్ మైనింగ్ రిసోర్సెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో ఆపరేటర్ ట్రైనీ ఉద్యోగాల కోసం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జాబ్‌మేళా నిర్వహిస్తామన్నారు. ఈ పోస్టులకు 20 నుంచి 25 సంవత్సరాలలోపు వయస్సుగల వారు, ఐటీఐ(ఫిట్టర్ట్రేడ్) చదివిన వారు అర్హులన్నారు. ఎంపికైన వారు బేతంచర్ల మండలం వీరయపల్లి గ్రామంలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. వీరికి రూ.8,700 నుంచి రూ.9వేల వరకు జీతం ఇస్తామన్నారు. -
23న జాబ్‌మేళా
అనంతపురం ఎడ్యుకేషన్ : చెన్నైకు చెందిన బాట్లిబాల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉద్యోగాలకు ఈనెల 23న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారి ఎ.కళ్యాణి ఒక ప్రకటనలో తెలిపారు. బీటెక్ (ఈఈఈ), డిప్లొమా ఎలక్ట్రికల్ విద్యార్హతలు ఉన్నవారు అర్హులన్నారు. 25–35 ఏళ్లలోపు పురుఫులకు మాత్రమే అవకాశం ఉందన్నారు. మొత్తం 60 ఖాళీలు ఉన్నాయని, జీతం నెలకు రూ. 15 వేలు ఉంటందని, ఎంపికైన వారు అనంతపురం జిల్లాలోనే పని చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. ఆసక్తిగల అభ్యర్థులు 23న ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్థానిక ప్రభుత్వ బాలికల ఐటీఐలో జరిగే జాబ్‌మేళాకు బయోడేటాతో పాటు విద్యార్హత పత్రాలతో హాజరుకావాలన్నారు. వివరాలకు 88868 82092 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
రేపు జాబ్ మేళా
మర్రిపాలెం : శిక్షణ, ఉపాధి కల్పన కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్‌మేళా జరుపుతామని జిల్లా ఉపాధి అధికారి(టెక్నికల్) సిహెచ్.సుబ్బిరెడ్డి తెలియజేశారు. గ్రామ్‌తరంగ్ ఎంప్లాయిబిలిటీ, ఐటీసీ కంపెనీల సంయుక్త ఆధ్వర్యంలో అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు. కనీస విద్యార్హత పదో తరగతి కలిగి 18 నుంచి 26 ఏళ్ల మధ్య వయసు గల పురుష అభ్యర్థులు జాబ్‌మేళాకు అర్హులన్నారు. ఖాళీలు 40 ఉన్నాయన్నారు. శిక్షణ కాలం 55 రోజులని, ఆ కాలంలో ప్రభుత్వం నిర్దేశించిన సై్టఫండ్ అభ్యర్థికి చెల్లిస్తారని తెలిపారు. శిక్షణ అనంతరం ఐటీసీ కంపెనీ ఎఫ్.ఎం.జి.సి విభాగంలో సేల్స్‌మన్ ఉద్యోగంలో ప్రవేశం కల్పిస్తారని వివరించారు. కంపెనీ నెలకు రూ.8 వేల నుంచి రూ.10 వరకు జీతం చెల్లిస్తుందన్నారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసిన అభ్యర్థులకు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సెంచూరియన్ యూనివర్సిటీ మంజూరు చేసిన సర్టిఫికేట్ ప్రదానం చేస్తామన్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు పాత ఐటీఐ జంక్షన్ ప్రాంతంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఉదయం 10 గంటలకు నేరుగా హాజరు కావాలని తెలిపారు. -
ఉపాధి కల్పన ఉత్తిదే..?
గతమెంతో ఘనం.. ప్రస్తుతం శూన్యం.. ఒక్కరికీ ఉపాధి కల్పించని వైనం.. ఆశతో కార్యాలయానికి వస్తున్న నిరుద్యోగులు బెల్లంపల్లి : నిరుద్యోగులకు ఉపాధికల్పన లక్ష్యంగా జిల్లాలోని బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన ఉప ఉపాధి కల్పనాధికారి కార్యాలయం ఉత్తుత్తిగా మారింది. పేరు నమోదు(ఎన్రోల్), రెన్యూవల్ చేయడానికి మాత్రమే పరిమితమైంది. ఇక్కడ నుంచి కాల్ లెటర్లు జారీ అయ్యేది లేదు.. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు వెళ్లి ఉద్యోగం సాధించేది అంతకన్న లేకుండా పోయింది. ఎంతో ఆశతో ఎంప్లాయ్మెంట్ కార్డు తీసి, కాల్ లెటర్ రాక ఏళ్ల తరబడి నుంచి నిరీక్షించడం నిరుద్యోగులకు సర్వసాధారణమైంది. నాలుగు దశాబ్దాల క్రితం.. తూర్పు ప్రాంతంలో ప్రధాన పట్టణంగా ఉన్న బెల్లంపల్లిలో 1975లో ఉప ఉపాధి కల్పనాధికారి (సబ్ ఎంప్లాయ్మెంట్ ఎక్ఛ్సేంజ్) కార్యాలయాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. బొగ్గు గనుల క్షేత్రంగా విలసిల్లిన ఆ కాలంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో ఎంప్లాయ్మెంట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. తొలినాళ్లలో నిరుద్యోగులకు కాల్ లెటర్లు పంపి, వేలాది మందికి బొగ్గు గనుల్లో, ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగావకాశాలు కల్పించిన సబ్ ఎంప్లాయ్మెంట్ అప్పట్లో ఎంతో ప్రఖ్యాతి గాంచింది. ప్రస్తుతం అలంకారప్రాయంగా మారింది. ఎవరెవరికి అంటే..! సబ్ ఎంప్లాయ్మెంట్ ఎక్ఛ్సేంజ్‌లో 1నుంచి 9వ తరగతి వరకు చదువుకున్న విద్యార్థులు, పదో తరగతితో ఐటీఐ , పాలిటెక్నిక్ చదివి సాంకేతిక విద్యను పూర్తి చేసిన విద్యార్థులు, నిరుద్యోగులు ఇక్కడ ఎన్రోల్ చేసుకోవడానికి వీలుంది. జిల్లా వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెకానికల్ తదితర కోర్సులు చదివిన వారు, నిరుద్యోగులకు ఎంప్లాయిమెంట్ కార్డు తీయడానికి బెల్లంపల్లిలోని ఈ సబ్ కార్యాలయం ఆధారం. రోజువారీగా వచ్చిపోయే నిరుద్యోగులు, విద్యార్థులతో ఎంప్లాయిమెంట్ ఎక్ఛ్సేంజ్ ప్రాంగణం ఎంతో సందడిగా కనిపించినా కాల్ లెటర్ల జారీ మాత్రం లేకుండా పోయింది. పదిహేనేళ్ల నుంచి.. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలలో ఉద్యోగాల భర్తీ కోసం ఎంప్లాయిమెంట్ ఎక్ఛ్సేంజ్‌ల నుంచి కాల్ లెటర్లు పంపి నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగావకాశం కల్పించడం ఆ రోజుల్లో జరిగేది. ఏ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్లాలన్నా కాల్ లెటర్ అప్పట్లో అనివార్యమయ్యేది. ప్రతి ప్రభుత్వ కార్యాలయం నుంచి ఉద్యోగ నియామకపు ఉత్తర్వులు వస్తే సీనియార్టీ ప్రాతిపాదికన సంబంధిత శాఖకు ఎంప్లాయిమెంట్ కార్యాలయం నుంచి జాబితాను, అర్హత కలిగిన నిరుద్యోగులకు కాల్ లెటర్లు పంపించేవారు. ఆ తీరుగా ఇంటర్వ్యూకి వెళ్లి నిరుద్యోగులు ఉద్యోగం పొందేవారు. ఈ కారణంగానే నిరుద్యోగులు ఎంప్లాయిమెంట్ ఎక్ఛ్సేంజ్‌లో పేరు ఎన్రోల్ చేసుకోవడానికి ఎగబడేవారు. ఎంప్లాయిమెంట్ ఎక్ఛ్సేంజ్ అంటే ఉద్యోగం కల్పించే సంస్థగా భావించేవారు. కానీ.. ఆ పరిస్థితులు ప్రస్తుతం కానరాకుండా పోయాయి. ఉద్యోగాల నియామకాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఎంప్లాయిమెంట్ ఎక్ఛ్సేంజ్‌ల నుంచి కాల్ లెటర్లు పంపించని పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటి ప్రభావం పూర్తిగా తగ్గింది. పదిహేనేళ్ల నుంచి కాల్ లెటర్లు జారీ కాకపోవడం ఇందుకు తార్కాణంగా చెప్పొచ్చు. అయినా.. ఇంకా ఆశ చావని నిరుద్యోగులు కార్డు తీయడానికి వచ్చి వెళ్తున్నారు. నేరుగా ఇంటర్వ్యూలు జిల్లాలో కిందిస్థాయి పోస్టులు అనేకం ఏళ్ల తరబడి నుంచి ఖాళీగా ఉన్నాయి. ప్రతి ప్రభుత్వ శాఖలో ఖాళీ ఉద్యోగాల భర్తీకి ఎంప్లాయిమెంట్ కార్యాలయం నుంచి నిరుద్యోగుల జాబితాను అడగటం లేదు. దీంతో ఎంప్లాయిమెంట్ ఎక్ఛ్సేంజ్ నుంచి స్పాన్సరింగ్ (కాల్ లెటర్లు పంపడం) నిలిచిపోయాయి. అటెండ ర్, వాచ్మెన్ కొలువులు, కారుణ్య నియామకాలతో భర్తీ చేస్తుండటంతో ప్రభుత్వ శాఖలు రిక్విజేషన్ (ఖాళీ పోస్టుల వివరాల జాబితా )ను పంపించడం మానేశాయి .మరోపక్క ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగాల భర్తీ కోసం దినపత్రికల్లో ప్రకటనలు ఇచ్చి, ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించి ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేసుకుంటున్నాయి. ఆ ప్రకారంగా ఉద్యోగానికి ఎంపికైన నిరుద్యోగుల పేర్లను ఎంప్లాయిమెంట్ ఎక్ఛ్సేంజ్ అధికారులు సీనియార్టీ జాబితా నుంచి క్రమంగా తొలగిస్తున్నారు. ఎన్రోల్ చేసుకున్న నిరుద్యోగులు బెల్లంపల్లి సబ్ ఎంప్లాయిమెంట్ ఎక్ఛ్సేంజ్‌లో ప్రస్తుతం 11,014 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో అత్యధికంగా పదో తరగతితో ఐటీఐ, పాలిటెక్నిక్ పూర్తి చేసిన 8,472 మంది డిప్లొమా విద్యార్థులు ఉన్నారు. మిగిలిన 2,542 మంది వివిధ కేటగిరీలకు చెందిన నిరుద్యోగులు ఎన్రోల్ చేసుకున్నారు. చాలా వరకు కిందిస్థాయి ఉద్యోగాలు పొందే అర్హతలు కలిగిన నిరుద్యోగులు పేరు నమోదు చేసుకుని ఏళ్ల తరబడి నుంచి కాల్ లెటర్ల కోసం ఎదురు చూస్తున్నారు. -
సా‘పాటు’ఎటూలేదు
- జిల్లాలో చదువుకున్న నిరుద్యోగుల సంఖ్య 2 లక్షల పైనే - ఉపాధి కార్యాలయంలో నమోదైన వారి సంఖ్య 57,173 - ఉద్యోగం దొరక్క .. స్వయం ఉపాధి అందక తల్లడిల్లుతున్న యువత ఏలూరు సిటీ : ఉద్యోగం పురుష లక్షణం అన్న నానుడికి ఎప్పుడో కాలం చెల్లింది. పురుషులు, మహిళలు అనే భేదం లేకుండా ఉద్యోగం చేయూల్సిన బాధ్యత అందరిపైనా పడింది. అయితే, ఉద్యోగం దొరక్క.. స్వయం ఉపాధి పొందుదామంటే సాయం అందక నిరుద్యోగులు విలవిల్లాడిపోతున్నారు. చదువు‘కొన్న’ యువత పరిస్థితి అయితే మరీ దీనంగా మారింది. పిల్లల చదువు కోసం రూ.లక్షలు వెచ్చించిన తల్లిదండ్రులకు వారు ఎప్పుడు సంపాదనాపరులవుతారో.. తమకు చేదోడు వాదోడుగా ఎప్పుడు నిలుస్తారోననే బెంగ పట్టుకుంది. సాదాసీదా చదువులే కాదు.. ఇంజినీరింగ్, ఎంబీఏ, ఫార్మసీ, ఎంఎస్సీ, బీఎడ్, పాలిటెక్నిక్ వంటి కోర్సులు చేస్తున్నా ఉద్యోగాలు దొరకడం లేదు. ప్రభుత్వ ఉద్యోగం కోసం చూడకుండా తమ కాళ్లమీద తాము నిలబడదామనుకున్నా.. ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగమైనా చేద్దామనుకున్నా అవకాశాలు దొరకడం లేదు. నైపుణ్యం లేదనో.. ఇంగ్లిష్ రాదనో ప్రైవేటు కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. నిరుద్యోగ పట్టభద్రులు 2 లక్షల పైనే... జిల్లాలో పట్టభద్రులైన నిరుద్యోగుల సంఖ్య 2 లక్షలకు పైగానే ఉన్నట్టు అంచనా. ప్రభుత్వ ఉద్యోగాలు చాలానే ఖాళీగా ఉన్నా భర్తీచేసే పరిస్థితులు కనిపించడం లేదు. పెద్ద నగరాలకు వెళితే తప్ప ప్రైవేటు ఉద్యోగాలు దొరకని పరిస్థితి నెలకొంది. ఇంజినీరింగ్ చదివినా.. పీజీ చేసినా.. బీఎడ్ పూర్తయినా ఫలితం దక్కడం లేదు. జిల్లాలో బీఈడీ పూర్తిచేసిన వారి సంఖ్య 30 వేలకుపైనే ఉంది. వారంతా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. వారు కోచింగ్‌లకు వెళుతూ వేలాది రూపాయలను నేటికీ వెచ్చిస్తూనే ఉన్నారు. ఉద్యోగాలు దొరకని ఇంజినీరింగ్ నిరుద్యోగులు 50 వేలకు పైగా ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. పీజీలు పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారు 10వేలకు పైగానే ఉన్నట్టు సమాచారం. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఫార్మసీ, డీఎడ్, నర్సింగ్ వంటి వృత్తి విద్యా కోర్సులు చేసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య లక్షకు పైనే ఉన్నట్టు సమాచారం. ఉపాధి కార్యాలయంలో నమోదైనా.. ప్రభుత్వ ఉద్యోగాల కోసం జిల్లా ఉపాధి కార్యాలయం (ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్)లో 57,173 మంది పేర్లను నమోదు చేయించుకున్నారు. వీరిలో 18,264 మంది ఎస్సీలు, 248 మంది ఎస్టీలు, 24,428 మంది బీసీలు ఉన్నారు. వీరిలో మహిళలు 17,347 మంది కాగా, ఎస్సీ మహిళలు 3,749 మంది, ఎస్టీ మహిళలు 58 మంది, బీసీ మహిళలు 5,136 మంది ఉన్నారు. 5,733 మంది వికలాం గులు సైతం తమ పేర్లను నమోదు చేరుుంచుకోగా, వారిలో మూగ, చెవిటి అభ్యర్థులు 370 మంది, అంధులు 441 మంది, వైకల్యం బారినపడిన వారు 4,925 మంది ఉన్నారు. పరిశ్రమలు పెరగాలి ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు పెరగాలి. గతంలో హైదరాబాద్ వెళ్లి కంపెనీల్లో ఉద్యోగాలు, ఉపాధి పొందేవాళ్లం. రాష్ట్రం విడిపోయిన అనంతరం పరిస్థితులు మారాయి. ఎంత చదివినా ఉద్యో గం వస్తుందా అనే ఆందోళన పెరిగిపోతోంది. ప్రభుత్వ ఉద్యోగాలూ భర్తీ చేయటం లేదు. చదువుకున్న యువత ఏమైపోవాలి. - బి.సత్యమానస, బీఎస్సీ పరిపాలన రంగమే ఇష్టం కంపెనీలు, సంస్థలకు సంబంధించి కార్యాలయ పరిపాలన ఉద్యోగాలంటే ఇష్టం. ప్రస్తుతం డిగ్రీ స్థాయి చదువులకు అసలు ప్రాధాన్యత ఇవ్వటం లేదు. పీజీ స్థాయి కోర్సులు చేసినా తగిన ఉద్యోగం రావటం లేదు. ప్రతిభ ఉన్నా చాటుకునే అవకాశం దొరకడం లేదు. - టి.లక్ష్మీ జ్యోత్స్న, బీకామ్ కోర్సులు చేసినా ఉపాధి లేదు వృత్తి విద్యా కోర్సులు చేసినా ఉపయోగం ఉండటం లేదు. ఐటీఐ సివిల్ కోర్సు చేస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండాపోయాయి. స్వయం ఉపాధి కోసం ప్రయత్నించినా ప్రయోజనం లేదు. అందుకే ఈసారి పాలిటెక్నిక్ చదువుతున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాలు వస్తాయనే నమ్మకం లేదు. - ఎస్కే నయీమ్, ఐటీఐ ఏపీలో కంపెనీలు పెట్టాలి నవ్యాంధ్ర ప్రదేశ్‌లో కంపెనీలు పెడితేనే గాని యువతకు ఉద్యోగాలు రావు. విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో ఎప్పుడు పెద్ద కంపెనీలు పెడతారో తెలియటం లేదు. యువతకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలి. కష్టపడదామన్నా అవకాశాలు లేకుండా పోయాయి. - ఎండీ రిజ్వాన్, ఏలూరు కెమికల్ కంపెనీలో జాబ్ కావాలి ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచి చూడటం లేదు. ప్రైవేటు ఉద్యోగమైనా చదువుకు తగినది చేయాలి. కష్టపడి చదివినా ప్రస్తు తం ఉద్యోగాలు దొరకటం కష్టంగా మారింది. కెమికల్ కంపెనీలో ఉద్యోగం సాధించాలనేది లక్ష్యం. నా కల ఎప్పటికి నెరవేరుతుందో. - కె.నందిని, ఎంఎస్సీ ఫైనాన్షియల్ రంగం వైపు చూస్తున్నా మేనేజ్మెంట్ ఉద్యోగాలకు డిమాండ్ పెద్దగా లేకపోవటం నిరాశ కలిగిస్తోంది. ఈ రంగంలోనే ఫైనాన్షియల్ విభాగంలో ఉద్యోగాలకు అవకాశం ఉంది. పెద్ద కంపెనీల్లో ఇలాంటి ఉద్యోగాలు లభిస్తే లైఫ్ బాగుంటుంది. ఎంబీఏలోనూ కొన్ని విభాగాలకు ప్రాధాన్యత లేదు. -జి.బేబి, ఎంబీఏ 220 మందికి ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పించాం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ప్రస్తుతం నిషేధం ఉంది. ఈ దృష్ట్యా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు తక్కువే. ఈ నేపథ్యంలో ఉపాధి కార్యాలయం ద్వారా ప్రైవేటు కంపెనీల ప్రతినిధులను పిలిచి జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది ఇప్పటివరకు 220 మందికి ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించాం. - ఎ.వసంతలక్ష్మి, జిల్లా ఉపాధి అధికారి -
కొలువులపై ఆశలు
- ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో 1.03 లక్షల మంది - మరో 60వేల మందికి పైగా ఇంజినీరింగ్ అభ్యర్థులు - ఇతర వృత్తివిద్యా అభ్యర్థులది అదే దుస్థితి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన యువత కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకుంది. నిన్నటివరకు ఉద్యమ బాటలో నడిచిన యువతరం.. నేడు నవ తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోంది. సమైక్య రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీలో అన్యాయం జరిగిందని ఆవేదనతో ఉన్న యువతీ యువకులు.. ప్రత్యేక రాష్ట్రంలో తగిన ప్రాధాన్యం లభిస్తుందని భావిస్తున్నారు. సాక్షి, కరీంనగర్ : ఉమ్మడి రాష్ర్టంలోని ఆయా ప్రభుత్వ విభాగాల్లో లక్షలాది పోస్టులు ఖాళీగా ఉండగా పాలకులు వాటిని భర్తీ చేయకుండా వదిలేశారు. కేవలం ఉపాధ్యాయ, పోలీసు ఉద్యోగాలను మాత్రమే పెద్ద సంఖ్యలో భర్తీ చేస్తూ వచ్చారు. ఇతర అవసరమైన పోస్టుల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ నియామకాలతో నెట్టుకొచ్చారు. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఖాళీ పోస్టులను భర్తీ చేయడంతో పాటు కొత్తగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమద్ధీకరిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు అదే పార్టీ అధికారంలోకి రావడంతో నిరుద్యోగుల్లో ఆశలు రెట్టింపయ్యాయి. డిగ్రీలు, పజీలతో పాటు పలు వృత్తివిద్యా కోర్సులు పూర్తి చేసిన యువత ప్రస్తుతం తమ విద్యార్హతలకు తగ్గ ఉద్యోగాలను కోరుకుంటోంది. రెండు లక్షల మంది నిరుద్యోగులు జిల్లాలో నిరుద్యోగుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో 1.03 లక్షల మంది వివిధ విద్యార్హతలతో ఉద్యోగాల కోసం పేర్లు నమోదు చేసుకుని అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. వీరు కాకుండా 60 వేలకు పైగా ఇంజినీరింగ్ విద్యార్థులు హైదరాబాద్‌లో ఉద్యోగాల కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. జిల్లాలో 57 ప్రభుత్వ, 200 పైచిలుకు ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, 190 డిగ్రీ, 38 పీజీ, రెండు మెడికల్, 17 ఇంజినీరింగ్, 10 ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలు ఉన్నాయి. ఇవికాకుండా మరో 40 వరకు బీఈడీ, డైట్, ఫార్మసీ, నర్సింగ్‌తో పాటు ఇతర వృత్తివిద్యా కాలేజీలు ఉన్నాయి. వీటినుంచి ఏటా సగటున 20 వేల మందికి పైగా విద్యార్థులు చదువులు పూర్తి చేసుకొని ఉద్యోగాల అన్వేషణలో పడుతున్నారు. అవకాశం అందివస్తే సర్కారు కొలువుల్లో స్థిరపడాలని కలలు కంటున్నారు. కానీ ఏళ్లు గడుస్తున్నా వారికి ఉద్యోగాలు మాత్రం దక్కడం లేదు. దీంతో పలువురు యువతీ యువకులు చిన్నాచితక ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తుండగా, మరికొందరు చిరువ్యాపారాలు సాగిస్తున్నారు. చదువుకు తగ్గ ఉద్యోగం లభించక, తల్లిదండ్రులకు భారం కాలేక.. తమ బతుకు ఇంతేనా అంటూ కుమిలిపోతున్నారు. ప్రస్తుత సర్కారు వీరందరికి ఉద్యోగావకాశాలు కల్పించి.. బతుకుదెరువు చూపించాల్సిన బాధ్యను అందరూ గుర్తు చేస్తున్నారు. ఉపాధి కల్పన కార్యాలయాలు నిరుపయోగం.. గతంలో ఎంప్లాయ్మెంట్ కార్డు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే సీనియారిటీ ప్రకారం ఉపాధి కల్పన కార్యాలయం ద్వారా ఉద్యోగాలు వచ్చేవి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలోనూ మార్పు వచ్చింది. ప్రభుత్వమే పలు కీలక శాఖల్లో నేరుగా ఉద్యోగ నియామకాలను చేపడుతోంది. ప్రైవేట్ కంపెనీలు ఎంప్లాయ్మెంట్ కార్యాలయంతో సంబంధం లేకుండా జాబ్‌మేళాలు, క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా ఉద్యోగులను ఎంపిక చేసుకుంటున్నాయి. కొన్ని ప్రభుత్వ శాఖలు నేరుగా నియామక ప్రకటన ఇచ్చి నియామకాలు చేపడుతున్నాయి. దీంతో ఉపాధి కల్పన కార్యాలయాలు నిరుపయోగంగా మారాయి. మన జిల్లాలో కరీంనగర్, పెద్దపల్లిలో ఉపాధి కల్పన కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో ఏటా వేలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ కార్యాలయాల నుంచి ఉద్యోగాల ఇంటర్వ్యూల కోసం కాల్‌లెటర్లు మాత్రం అందడం లేదు. దీంతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న మూడేళ్లకు రెన్యువల్ చేయించుకునేందుకు చాలామంది ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం స్పందించి ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. -
‘ఉపాధి’ కార్యాలయం ముట్టడి
వలేటివారిపాలెం, న్యూస్‌లైన్ : గత ఏడాది మే, జూన్‌లో చేసిన పనులకు సంబంధించి కూలిడబ్బులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మండలంలోని అన్ని గ్రామాల కూలీలు సోమవారం ఉపాధి కార్యాలయాన్ని ముట్టడించారు. అంతకుముందు వారు తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కూలిడబ్బుల కోసం న్యాయ పోరాటానికి సిద్ధమైన ఉపాధి కూలీలకు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెంట్యాల హనుమంతరావు, డివిజన్ కార్యదర్శి జి. వెంకటేశ్వర్లు సంఘీభావం తెలిపారు. ధర్నా వద్ద హనుమంతరావు మాట్లాడుతూ ఉపాధి పనులు చేసిన 15 రోజుల్లో కూలి చెల్లించాల్సి ఉంటుందని, లేకుంటే ప్రభుత్వం అపరాధ రుసుం ఇవ్వాల్సి ఉందన్నారు. బకాయిలు రూ.33.82 లక్షలు చెల్లించకపోవడం కూలీల కడుపు కొట్టడమేనని విమర్శించారు. ఈ ఏడాది ఉపాధి పనులకు సంబంధించి కూడా 6 వారాల కూలి చెల్లించకపోవడం దారుణమన్నారు. పీడీని ప్రశ్నించిన హనుమంతరావు.. ఉపాధి హామీ పథకం జిల్లా పీడీ పోలప్పను హనుమంతరావు ఫోన్లో సంప్రదించారు. గత ఏడాది కూలి ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. కూలీల సమస్యను పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్పందించిన పీడీ, వెంటనే ఏపీఓకు ఫోన్ చేసి కూలీల సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ర్యాలీ నిర్వహించిన కూలీలు ధర్నా అనంతరం కూలీలు ఉపాధి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యాలయం ముట్టడించారు. దీంతో ఏపీఓ అబ్దుల్లా స్పందిస్తూ, ఈ ఏడాది కూలిడబ్బులను ఈ నెల 30వ తేదీలోపు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. గత ఏడాదికి సంబంధించి కూలి సమస్యను 15 రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో మండల మేట్ల సంఘం అధ్యక్షుడు టి.సుధాకర్, కార్యదర్శి ఎల్.లక్ష్మీనరసింహం, ఉపాధి కూలీలు పాల్గొన్నారు. -
కూలీ సొమ్ము కోసం ఆందోళనలు
పెదబయలు, న్యూస్‌లైన్: గత ఏడాది చేసిన పనులకు కూలీ సొమ్ము చెల్లించాలని డిమాండ్ చేస్తూ మండలంలోని ఉపాధి కూలీలు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఉపాధి కార్యాలయానికి తాళం వేసి సిబ్బందిని ఐదు గంటల పాటు నిర్బంధించారు. గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు బొండా సన్నిబాబు మాట్లాడుతూ ఉపాధి పనులు చేసి 8 నెలలు గడుస్తున్నా సొమ్ము చెల్లించకపోవడం దారుణమన్నారు. కూలీ సొమ్ము కోసం ధర్నాలు, ర్యాలీలు చేయాల్సిన దుస్థితి నెలకొం దని ఆవేదన చెందారు. ఫినో సిబ్బంది ద్వారా సొమ్ము అందిస్తామని చెప్పిన అధికారులు కాలయాపన చేస్తున్నారని చెప్పారు. దీనిపై ఏపీవో ధనుంజయ్ స్పందిస్తూ కూలీలకు రూ.67 లక్షలు చెల్లించాల్సి ఉంద న్నారు. మూడు రోజుల్లో రూ.15 లక్షలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో ఉపాధి కూలీలు శాంతించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు కిల్లో శరభన్న, కోమటి, పరశురాం తదితరులు పాల్గొన్నారు. అరకులోయలో... అరకు రూరల్: బకాయి ఉన్న ఉపాధి కూలీ సొమ్ము చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉపాధి కూలీలు శుక్రవారం భారీ ఆందోళన చేపట్టారు. వైఎస్సార్ సీపీ నేతలు వంతాల పూర్ణ (చినలబుడు సర్పంచ్), గొల్లూరి రాజు, సొనాయి కృష్ణారావు, సీపీఎం నేత పొద్దు బాలదేవ్ ల ఆధ్వర్యంలో కూలీలు ఉపాధి కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఫినో సంస్థ మండల కో-ఆర్డినేటర్లు, ఉపాధి ఏపీఎంలను నిర్బంధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని ఉపాధి కూలీలకు సుమారు రూ.కోటిన్నర చెల్లించాల్సి ఉందన్నారు. తక్షణం సొమ్ము పంపిణీ చేయాలని కోరుతూ ఫినో సంస్థ మండల కో-ఆర్డినేటర్లను నిలదీశారు. వారి వద్ద నుంచి సరైన సమాధానం రాకపోవడంతో కార్యాలయంలోనికి వెళ్లనివ్వకుండా నిర్బంధించారు. ఈ నెల 28లోగా బకాయి సొమ్ము మొత్తం చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో వారిని విడిచిపెట్టారు.