సా‘పాటు’ఎటూలేదు | unemployment insurance debt paid down by workers | Sakshi
Sakshi News home page

సా‘పాటు’ఎటూలేదు

Published Sat, Nov 15 2014 1:47 AM | Last Updated on Sat, Sep 2 2017 4:28 PM

సా‘పాటు’ఎటూలేదు

సా‘పాటు’ఎటూలేదు

- జిల్లాలో చదువుకున్న నిరుద్యోగుల సంఖ్య 2 లక్షల పైనే
- ఉపాధి కార్యాలయంలో నమోదైన వారి సంఖ్య 57,173
- ఉద్యోగం దొరక్క .. స్వయం ఉపాధి అందక తల్లడిల్లుతున్న యువత

ఏలూరు సిటీ : ఉద్యోగం పురుష లక్షణం అన్న నానుడికి ఎప్పుడో కాలం చెల్లింది. పురుషులు, మహిళలు అనే భేదం లేకుండా ఉద్యోగం చేయూల్సిన బాధ్యత అందరిపైనా పడింది. అయితే, ఉద్యోగం దొరక్క.. స్వయం ఉపాధి పొందుదామంటే సాయం అందక నిరుద్యోగులు విలవిల్లాడిపోతున్నారు. చదువు‘కొన్న’ యువత పరిస్థితి అయితే మరీ దీనంగా మారింది.

పిల్లల చదువు కోసం రూ.లక్షలు  వెచ్చించిన తల్లిదండ్రులకు వారు ఎప్పుడు సంపాదనాపరులవుతారో.. తమకు చేదోడు వాదోడుగా ఎప్పుడు నిలుస్తారోననే బెంగ పట్టుకుంది. సాదాసీదా చదువులే కాదు.. ఇంజినీరింగ్, ఎంబీఏ, ఫార్మసీ, ఎంఎస్సీ, బీఎడ్, పాలిటెక్నిక్ వంటి కోర్సులు చేస్తున్నా ఉద్యోగాలు దొరకడం లేదు. ప్రభుత్వ ఉద్యోగం కోసం చూడకుండా తమ కాళ్లమీద తాము నిలబడదామనుకున్నా.. ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగమైనా చేద్దామనుకున్నా అవకాశాలు దొరకడం లేదు. నైపుణ్యం లేదనో.. ఇంగ్లిష్ రాదనో ప్రైవేటు కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు.
 
నిరుద్యోగ పట్టభద్రులు 2 లక్షల పైనే...
జిల్లాలో పట్టభద్రులైన నిరుద్యోగుల సంఖ్య 2 లక్షలకు పైగానే ఉన్నట్టు అంచనా. ప్రభుత్వ ఉద్యోగాలు చాలానే ఖాళీగా ఉన్నా భర్తీచేసే పరిస్థితులు కనిపించడం లేదు. పెద్ద నగరాలకు వెళితే తప్ప ప్రైవేటు ఉద్యోగాలు దొరకని పరిస్థితి నెలకొంది. ఇంజినీరింగ్ చదివినా.. పీజీ చేసినా.. బీఎడ్ పూర్తయినా ఫలితం దక్కడం లేదు. జిల్లాలో బీఈడీ పూర్తిచేసిన వారి సంఖ్య 30 వేలకుపైనే ఉంది. వారంతా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.

వారు కోచింగ్‌లకు వెళుతూ వేలాది రూపాయలను నేటికీ వెచ్చిస్తూనే ఉన్నారు. ఉద్యోగాలు దొరకని ఇంజినీరింగ్ నిరుద్యోగులు 50 వేలకు పైగా ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. పీజీలు పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారు 10వేలకు పైగానే ఉన్నట్టు సమాచారం. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఫార్మసీ, డీఎడ్, నర్సింగ్ వంటి వృత్తి విద్యా కోర్సులు చేసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య లక్షకు పైనే ఉన్నట్టు సమాచారం.
 
ఉపాధి కార్యాలయంలో నమోదైనా..
 ప్రభుత్వ ఉద్యోగాల కోసం జిల్లా ఉపాధి కార్యాలయం (ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్చేంజ్)లో 57,173 మంది పేర్లను నమోదు చేయించుకున్నారు. వీరిలో 18,264 మంది ఎస్సీలు, 248 మంది ఎస్టీలు, 24,428 మంది బీసీలు ఉన్నారు. వీరిలో మహిళలు 17,347 మంది కాగా, ఎస్సీ మహిళలు 3,749 మంది, ఎస్టీ మహిళలు 58 మంది, బీసీ మహిళలు 5,136 మంది ఉన్నారు. 5,733 మంది వికలాం గులు సైతం తమ పేర్లను నమోదు చేరుుంచుకోగా, వారిలో మూగ, చెవిటి అభ్యర్థులు 370 మంది, అంధులు 441 మంది, వైకల్యం బారినపడిన వారు 4,925 మంది ఉన్నారు.
 
పరిశ్రమలు పెరగాలి
ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు పెరగాలి. గతంలో హైదరాబాద్ వెళ్లి కంపెనీల్లో ఉద్యోగాలు, ఉపాధి పొందేవాళ్లం. రాష్ట్రం విడిపోయిన అనంతరం పరిస్థితులు మారాయి. ఎంత చదివినా ఉద్యో గం వస్తుందా అనే ఆందోళన పెరిగిపోతోంది. ప్రభుత్వ ఉద్యోగాలూ భర్తీ చేయటం లేదు. చదువుకున్న యువత ఏమైపోవాలి.
- బి.సత్యమానస, బీఎస్సీ

పరిపాలన రంగమే ఇష్టం
కంపెనీలు, సంస్థలకు సంబంధించి కార్యాలయ పరిపాలన ఉద్యోగాలంటే ఇష్టం. ప్రస్తుతం డిగ్రీ స్థాయి చదువులకు అసలు ప్రాధాన్యత ఇవ్వటం లేదు. పీజీ స్థాయి కోర్సులు చేసినా తగిన ఉద్యోగం రావటం లేదు. ప్రతిభ ఉన్నా చాటుకునే అవకాశం దొరకడం లేదు.            - టి.లక్ష్మీ జ్యోత్స్న, బీకామ్
 
కోర్సులు చేసినా ఉపాధి లేదు
వృత్తి విద్యా కోర్సులు చేసినా ఉపయోగం ఉండటం లేదు. ఐటీఐ సివిల్ కోర్సు చేస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండాపోయాయి. స్వయం ఉపాధి కోసం ప్రయత్నించినా ప్రయోజనం లేదు. అందుకే ఈసారి పాలిటెక్నిక్ చదువుతున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాలు వస్తాయనే నమ్మకం లేదు.
 - ఎస్‌కే నయీమ్, ఐటీఐ
 
ఏపీలో కంపెనీలు పెట్టాలి
నవ్యాంధ్ర ప్రదేశ్‌లో కంపెనీలు పెడితేనే గాని యువతకు ఉద్యోగాలు రావు. విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో ఎప్పుడు పెద్ద కంపెనీలు పెడతారో తెలియటం లేదు. యువతకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలి. కష్టపడదామన్నా అవకాశాలు లేకుండా పోయాయి.    - ఎండీ రిజ్వాన్, ఏలూరు
 
కెమికల్ కంపెనీలో జాబ్ కావాలి
ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచి చూడటం లేదు. ప్రైవేటు ఉద్యోగమైనా చదువుకు తగినది చేయాలి. కష్టపడి చదివినా ప్రస్తు తం ఉద్యోగాలు దొరకటం కష్టంగా మారింది. కెమికల్ కంపెనీలో ఉద్యోగం సాధించాలనేది  లక్ష్యం. నా కల ఎప్పటికి నెరవేరుతుందో.
 - కె.నందిని, ఎంఎస్సీ
 
ఫైనాన్షియల్ రంగం వైపు చూస్తున్నా
మేనేజ్‌మెంట్ ఉద్యోగాలకు డిమాండ్ పెద్దగా లేకపోవటం నిరాశ కలిగిస్తోంది. ఈ రంగంలోనే ఫైనాన్షియల్ విభాగంలో ఉద్యోగాలకు అవకాశం ఉంది. పెద్ద కంపెనీల్లో ఇలాంటి ఉద్యోగాలు లభిస్తే లైఫ్ బాగుంటుంది. ఎంబీఏలోనూ కొన్ని విభాగాలకు ప్రాధాన్యత లేదు.                        -జి.బేబి, ఎంబీఏ
 
220 మందికి ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పించాం
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ప్రస్తుతం నిషేధం ఉంది. ఈ దృష్ట్యా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు తక్కువే. ఈ నేపథ్యంలో ఉపాధి కార్యాలయం ద్వారా ప్రైవేటు కంపెనీల ప్రతినిధులను పిలిచి జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది ఇప్పటివరకు 220 మందికి ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు  కల్పించాం.
 - ఎ.వసంతలక్ష్మి, జిల్లా ఉపాధి అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement