పెదబయలు, న్యూస్‌లైన్: గత ఏడాది చేసిన పనులకు కూలీ సొమ్ము చెల్లించాలని డిమాండ్ చేస్తూ మండలంలోని ఉపాధి కూలీలు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఉపాధి కార్యాలయానికి తాళం వేసి సిబ్బందిని ఐదు గంటల పాటు నిర్బంధించారు. గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు బొండా సన్నిబాబు మాట్లాడుతూ ఉపాధి పనులు చేసి 8 నెలలు గడుస్తున్నా సొమ్ము చెల్లించకపోవడం దారుణమన్నారు.
కూలీ సొమ్ము కోసం ధర్నాలు, ర్యాలీలు చేయాల్సిన దుస్థితి నెలకొం దని ఆవేదన చెందారు. ఫినో సిబ్బంది ద్వారా సొమ్ము అందిస్తామని చెప్పిన అధికారులు కాలయాపన చేస్తున్నారని చెప్పారు. దీనిపై ఏపీవో ధనుంజయ్ స్పందిస్తూ కూలీలకు రూ.67 లక్షలు చెల్లించాల్సి ఉంద న్నారు. మూడు రోజుల్లో రూ.15 లక్షలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో ఉపాధి కూలీలు శాంతించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు కిల్లో శరభన్న, కోమటి, పరశురాం తదితరులు పాల్గొన్నారు.
అరకులోయలో...
అరకు రూరల్: బకాయి ఉన్న ఉపాధి కూలీ సొమ్ము చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉపాధి కూలీలు శుక్రవారం భారీ ఆందోళన చేపట్టారు. వైఎస్సార్ సీపీ నేతలు వంతాల పూర్ణ (చినలబుడు సర్పంచ్), గొల్లూరి రాజు, సొనాయి కృష్ణారావు, సీపీఎం నేత పొద్దు బాలదేవ్ ల ఆధ్వర్యంలో కూలీలు ఉపాధి కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఫినో సంస్థ మండల కో-ఆర్డినేటర్లు, ఉపాధి ఏపీఎంలను నిర్బంధించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని ఉపాధి కూలీలకు సుమారు రూ.కోటిన్నర చెల్లించాల్సి ఉందన్నారు. తక్షణం సొమ్ము పంపిణీ చేయాలని కోరుతూ ఫినో సంస్థ మండల కో-ఆర్డినేటర్లను నిలదీశారు. వారి వద్ద నుంచి సరైన సమాధానం రాకపోవడంతో కార్యాలయంలోనికి వెళ్లనివ్వకుండా నిర్బంధించారు. ఈ నెల 28లోగా బకాయి సొమ్ము మొత్తం చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో వారిని విడిచిపెట్టారు.
కూలీ సొమ్ము కోసం ఆందోళనలు
Published Sat, Aug 24 2013 3:37 AM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM
Advertisement
Advertisement