హోం మంత్రి పతకానికి ధనుంజయుడు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

హోం మంత్రి పతకానికి ధనుంజయుడు ఎంపిక

Published Mon, Aug 14 2023 1:20 AM | Last Updated on Mon, Aug 14 2023 9:29 AM

- - Sakshi

పశ్చిమ గోదావరి: కేంద్ర హోం శాఖ ఏటా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సమయంలో ఇచ్చే కేంద్ర హోం మంత్రి పతకానికి జంగారెడ్డిగూడెం డీఎస్పీ ఎం.ధనుంజయుడు ఎంపికయ్యారు. 2023 సంవత్సరానికి అత్యుత్తమ నేరపరిశోధన చేసిన రాష్ట్రానికి చెందిన ఐదురుగు పోలీసు అధికారులు ఈ పతకానికి ఎంపిక కాగా వారిలో ఒకరు ధనుంజయుడు. నేర పరిశోధనల్లో ఉన్నత ప్రమాణాల్ని ప్రోత్సహించడం కోసం 2018 నుంచి పోలీసు అధికారులకు కేంద్ర హోం శాఖ ఈ పతకాలు అందిస్తోంది. 2020లో ప్రకాశం జిల్లా ఒంగోలులో దిశ డీఎస్పీగా ధనుంజయుడు పని చేస్తున్న సమయంలో రెండు కీలకమైన కేసులను చేధించడంలో విశేష కృషిచేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఈ పతకం అందిస్తున్నారు.

ఎస్సై నుంచి డీఎస్పీ వరకూ
బాపట్ల జిల్లా చీరాల మండలం చీపురుపాలెం ధనుంజయుడి స్వగ్రామం. చీరాలలో బీఎస్సీ డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు. 1991లో ఎస్సైగా డీటీసీలో శిక్షణ పొందారు. గుంటూరు జోన్‌ నుంచి ఎంపికై న ఈయన నెల్లూరు జిల్లాలో ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ పూర్తి చేశారు. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి తాలూకా సీతారామపురం పోలీస్‌స్టేషన్‌కు ఎస్సైగా నియమితులయ్యారు.

ఆ తరువాత ఉదయగిరి, కావలి టూటౌన్‌, సంగం, ఆత్మకూరు పోలీస్‌స్టేషన్లలో ఎస్సై పనిచేశారు. నాయుడుపేట పోలీస్‌స్టేషన్‌పై దాడి జరగడంతో ఆ సమయంలో ధనుంజయుడిని అక్కడికి పంపారు. ఆ తరువాతి కాలంలో నెల్లూరు త్రీ టౌన్‌కు బదిలీ అయ్యారు. సీఐగా పదోన్నతి చెంది విజయవాడలో సీఐడీ విభాగంలో ఆరు సంవత్సరాలు పనిచేశారు. అనంతరం మూడేళ్లు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో పనిచేశారు. 2014లో డీఎస్పీగా పదోన్నతి పొంది కృష్ణా జిల్లా ఇంటిలిజెన్స్‌ డీఎస్పీగా ఐదేళ్లు పనిచేశారు. అలాగే విశాఖ ట్రాఫిక్‌ ఏసీపీగా 10 నెలలు పనిచేశారు.

సాంకేతిక ఆధారాలతో కేసుల నిరూపణలో ప్రతిభ
2020లో ప్రకాశం జిల్లా ఒంగోలు దిశ డీఎస్పీగా రెండేళ్లపాటు పనిచేశారు. ఈ సమయంలోనే రెండు కీలకమైన కేసులు చేధించడంలో కీలకంగా పనిచేశారు. గిద్దలూరు మండలం అంబవరంలో ఏడేళ్ల చిన్నారిపై ఒక వ్యక్తి అత్యాచారం చేసి హత్యచేశాడు. ఈ కేసును ధనుంజయుడు చాలెంజింగ్‌ తీసుకున్నారు. కేసును లోతుగా దర్యాప్తు చేసి నిందితుడికి శిక్ష పడేలా సాక్ష్యాధారాలు సమర్పించారు. దీంతో నిందితుడికి గత జనవరిలో కోర్టు ఉరిశిక్ష విధించింది. అలాగే కందుకూరులో 15 ఏళ్ల బాలికను నిర్భంధించి వ్యభిచారం కూపంలోకి నెట్టారు.

వారం రోజుల పాటు బాలికపై 25 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసును కూడా చాలెంజింగ్‌గా తీసుకుని సెల్‌ఫోన్‌, ఫోన్‌పే ఆధారంగా నిందితులను గుర్తించారు. 25 మంది ఆ వారం రోజుల పాటు వినియోగించిన కండోమ్‌లు డీఎస్పీ స్వాధీనం చేసుకుని డీఎన్‌ఏ పరీక్షలకు పంపారు. మేజిస్ట్రేట్‌ సమక్షంలో బాలికతో ఐడెంటిఫికేషన్‌ పెరేడ్‌ ఏర్పాటు చేశారు. దీంతో 25 మందిని బాలిక గుర్తించింది. అన్ని ఆధారాలతో ఈ కేసును నిరూపించారు. ఈ కేసును చేధించడంలో సాంకేతిక ప్రమాణాలు పాటించారు. ఈ రెండు కేసులు చేధించడంలో డీఎస్పీ విజయం సాధించారు.

దీంతో ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో ప్రకాశం జిల్లా ఎస్పీ.. డీజీపీ ద్వారా వీటి వివరాలను కేంద్రానికి పంపారు. నేర పరిశోధనలో అత్యుత్తమ సేవలను గుర్తించిన కేంద్రం ధనుంజయుడిని కేంద్ర హోం మంత్రి పతకానికి ఎంపిక చేసింది. ప్రకాశం జిల్లా నుంచి ఆయన తాడేపల్లి సిట్‌కు డీఎస్పీగా బదిలీ అయ్యారు. అక్కడ కూడా అత్యంత ప్రతిభ కనబర్చి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో రూ.250 కోట్ల దుర్వినియోగాన్ని వెలికి తీశారు. ప్రస్తుతం ఈ కేసు ఇంకా దర్యాప్తులో ఉంది. ఇటీవల బదిలీల్లో భాగంగా మే నెలలో జంగారెడ్డిగూడెం డీఎస్పీగా బదిలీపై వచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement