న్యూఢిల్లీ: దేశంలో అత్యంత వేతన చెల్లింపులకు రాజధానిగా బెంగళూరు తన స్థానాన్ని కాపాడుకుంది. అలాగే, అత్యధిక పారితోషికాలు ఐటీ రంగంలో ఉన్నట్టు రాండ్‌స్టాడ్ ‘ఇన్‌సైట్స్ శాలరీ ట్రెండ్స్ 2019’ నివేదిక వెల్లడించింది. బెంగళూరులో జూనియర్ స్థాయి ఉద్యోగిపై కంపెనీ వార్షికంగా చేస్తున్న సగటు వ్యయం (సీటూసీ) రూ.5.27 లక్షలుగా ఉంటే, మధ్య స్థాయి ఉద్యోగిపై ఇది రూ.16.45 లక్షలు, సీనియర్ లెవల్ ఉద్యోగిపై రూ.35.45 లక్షలుగా ఉంది.
ఈ సంస్థ రూపొందించిన 2018, 2017 నివేదికల్లోనూ అత్యధిక వేతనాలున్న నగరంగా బెంగళూరు మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. జూనియర్ లెవల్ ఉద్యోగులకు అధికంగా చెల్లింపులున్న రెండో నగరంగా హైదరాబాద్ చోటు సంపాదించింది. ఇక్కడ సగటు సీటూసీ రూ.5లక్షలు. రూ.4.59 లక్షలతో మూడో స్థానంలో ముంబై నగరం ఉంది. మధ్య స్థాయి ఉద్యోగులకు అధికంగా చెల్లిస్తున్న నగరాల్లో ముంబై రూ.15.07 లక్షలతో రెండో స్థానంలో, దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్) రూ.14.5 లక్షలతో మూడో స్థానంలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment