బెంగళూరును వెనక్కి నెట్టేస్తాం: కేటీఆర్
సాక్షి, ముంబై: ఐటీ రంగంలో బెంగళూరును హైదరాబాద్ నగరం వెనక్కు నెట్టేస్తుందని ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. ఇక్కడి ఓ హోటల్‌లో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్నేళ్లలోనే హైదరాబాద్‌ను ఐటీ రాజధానిగా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. రానున్న ఐదేళ్లలో ప్రస్తుతమున్న 69 వేల కోట్ల ఐటీ ఎగుమతులను రెట్టింపు చేస్తామని పేర్కొన్నారు.హైదరాబాద్‌లో 16 శాతం ఐటీ సంస్థల రెవెన్యూ పెరుగుదల నమోదైందని, ఇది దేశ సగటు కన్నా ఎక్కువ అని ఆయన తెలిపారు.
హైదరాబాద్‌లో పరిశ్రమలు పెట్టేందుకు తమ ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దేందుకు పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలు ముందుకు రావాలని ఆ రాష్ర్ట పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐటీఈసీ శాఖ కార్యదర్శి, ఐఏస్ జయేష్ రంజన్, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు తదితరులు పాల్గొన్నారు.