ఉపాధి కల్పన ఉత్తిదే..? | employment office in adilabad district | Sakshi
Sakshi News home page

ఉపాధి కల్పన ఉత్తిదే..?

Published Tue, Jul 26 2016 12:53 PM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM

employment office in adilabad district

  గతమెంతో ఘనం.. ప్రస్తుతం శూన్యం..
  ఒక్కరికీ ఉపాధి కల్పించని వైనం..
  ఆశతో కార్యాలయానికి వస్తున్న నిరుద్యోగులు
 
బెల్లంపల్లి : నిరుద్యోగులకు ఉపాధికల్పన లక్ష్యంగా జిల్లాలోని బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన ఉప ఉపాధి కల్పనాధికారి కార్యాలయం ఉత్తుత్తిగా మారింది. పేరు నమోదు(ఎన్‌రోల్), రెన్యూవల్ చేయడానికి మాత్రమే పరిమితమైంది. ఇక్కడ నుంచి కాల్ లెటర్లు జారీ అయ్యేది లేదు.. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు వెళ్లి ఉద్యోగం సాధించేది అంతకన్న లేకుండా పోయింది. ఎంతో ఆశతో ఎంప్లాయ్‌మెంట్ కార్డు తీసి, కాల్ లెటర్ రాక ఏళ్ల తరబడి నుంచి నిరీక్షించడం నిరుద్యోగులకు సర్వసాధారణమైంది.
 
నాలుగు దశాబ్దాల క్రితం..
తూర్పు ప్రాంతంలో ప్రధాన పట్టణంగా ఉన్న బెల్లంపల్లిలో 1975లో ఉప ఉపాధి కల్పనాధికారి (సబ్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్ఛ్సేంజ్) కార్యాలయాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. బొగ్గు గనుల క్షేత్రంగా విలసిల్లిన ఆ కాలంలో నిరుద్యోగులకు  ఉపాధి అవకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. తొలినాళ్లలో నిరుద్యోగులకు కాల్ లెటర్లు పంపి, వేలాది మందికి బొగ్గు గనుల్లో, ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగావకాశాలు కల్పించిన సబ్  ఎంప్లాయ్‌మెంట్ అప్పట్లో ఎంతో ప్రఖ్యాతి గాంచింది. ప్రస్తుతం అలంకారప్రాయంగా మారింది.
 
ఎవరెవరికి అంటే..!
సబ్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్ఛ్సేంజ్‌లో 1నుంచి 9వ తరగతి వరకు చదువుకున్న విద్యార్థులు, పదో తరగతితో ఐటీఐ , పాలిటెక్నిక్ చదివి సాంకేతిక విద్యను పూర్తి చేసిన విద్యార్థులు, నిరుద్యోగులు ఇక్కడ ఎన్‌రోల్ చేసుకోవడానికి వీలుంది. జిల్లా వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెకానికల్ తదితర కోర్సులు చదివిన వారు, నిరుద్యోగులకు ఎంప్లాయిమెంట్ కార్డు తీయడానికి బెల్లంపల్లిలోని ఈ సబ్ కార్యాలయం ఆధారం. రోజువారీగా వచ్చిపోయే నిరుద్యోగులు, విద్యార్థులతో ఎంప్లాయిమెంట్ ఎక్ఛ్సేంజ్ ప్రాంగణం ఎంతో సందడిగా కనిపించినా కాల్ లెటర్ల  జారీ మాత్రం లేకుండా పోయింది.  
 
పదిహేనేళ్ల నుంచి..
ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలలో ఉద్యోగాల భర్తీ కోసం ఎంప్లాయిమెంట్ ఎక్ఛ్సేంజ్‌ల నుంచి కాల్ లెటర్లు పంపి నిరుద్యోగులకు  ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగావకాశం కల్పించడం ఆ రోజుల్లో జరిగేది. ఏ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్లాలన్నా కాల్ లెటర్ అప్పట్లో అనివార్యమయ్యేది. ప్రతి ప్రభుత్వ కార్యాలయం నుంచి ఉద్యోగ నియామకపు ఉత్తర్వులు వస్తే సీనియార్టీ ప్రాతిపాదికన సంబంధిత శాఖకు ఎంప్లాయిమెంట్ కార్యాలయం నుంచి జాబితాను, అర్హత కలిగిన నిరుద్యోగులకు కాల్ లెటర్లు పంపించేవారు. ఆ తీరుగా ఇంటర్వ్యూకి వెళ్లి నిరుద్యోగులు ఉద్యోగం పొందేవారు. ఈ కారణంగానే నిరుద్యోగులు ఎంప్లాయిమెంట్ ఎక్ఛ్సేంజ్‌లో పేరు ఎన్‌రోల్ చేసుకోవడానికి ఎగబడేవారు. ఎంప్లాయిమెంట్ ఎక్ఛ్సేంజ్ అంటే ఉద్యోగం కల్పించే సంస్థగా భావించేవారు. కానీ.. ఆ పరిస్థితులు ప్రస్తుతం కానరాకుండా పోయాయి. ఉద్యోగాల నియామకాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఎంప్లాయిమెంట్ ఎక్ఛ్సేంజ్‌ల నుంచి కాల్ లెటర్లు పంపించని పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటి ప్రభావం పూర్తిగా తగ్గింది. పదిహేనేళ్ల నుంచి కాల్ లెటర్లు జారీ కాకపోవడం ఇందుకు తార్కాణంగా చెప్పొచ్చు. అయినా.. ఇంకా ఆశ చావని నిరుద్యోగులు కార్డు తీయడానికి వచ్చి వెళ్తున్నారు. 
 
నేరుగా ఇంటర్వ్యూలు
జిల్లాలో కిందిస్థాయి పోస్టులు అనేకం ఏళ్ల తరబడి నుంచి ఖాళీగా ఉన్నాయి. ప్రతి ప్రభుత్వ శాఖలో ఖాళీ ఉద్యోగాల భర్తీకి ఎంప్లాయిమెంట్ కార్యాలయం నుంచి నిరుద్యోగుల జాబితాను అడగటం లేదు. దీంతో ఎంప్లాయిమెంట్ ఎక్ఛ్సేంజ్ నుంచి స్పాన్సరింగ్ (కాల్ లెటర్లు పంపడం) నిలిచిపోయాయి. అటెండ ర్, వాచ్‌మెన్ కొలువులు, కారుణ్య నియామకాలతో భర్తీ చేస్తుండటంతో ప్రభుత్వ శాఖలు రిక్విజేషన్ (ఖాళీ పోస్టుల వివరాల జాబితా )ను పంపించడం మానేశాయి .మరోపక్క ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగాల భర్తీ కోసం దినపత్రికల్లో ప్రకటనలు ఇచ్చి, ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించి ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేసుకుంటున్నాయి. ఆ ప్రకారంగా ఉద్యోగానికి ఎంపికైన నిరుద్యోగుల పేర్లను ఎంప్లాయిమెంట్ ఎక్ఛ్సేంజ్ అధికారులు సీనియార్టీ జాబితా నుంచి క్రమంగా తొలగిస్తున్నారు. 
 
ఎన్‌రోల్ చేసుకున్న నిరుద్యోగులు
బెల్లంపల్లి సబ్ ఎంప్లాయిమెంట్ ఎక్ఛ్సేంజ్‌లో ప్రస్తుతం 11,014 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో అత్యధికంగా పదో తరగతితో ఐటీఐ, పాలిటెక్నిక్ పూర్తి చేసిన 8,472 మంది డిప్లొమా విద్యార్థులు ఉన్నారు. మిగిలిన 2,542 మంది వివిధ కేటగిరీలకు చెందిన నిరుద్యోగులు ఎన్‌రోల్ చేసుకున్నారు. చాలా వరకు కిందిస్థాయి ఉద్యోగాలు పొందే అర్హతలు కలిగిన నిరుద్యోగులు పేరు నమోదు చేసుకుని ఏళ్ల తరబడి నుంచి కాల్ లెటర్ల కోసం ఎదురు చూస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement