వలేటివారిపాలెం, న్యూస్‌లైన్ : గత ఏడాది మే, జూన్‌లో చేసిన పనులకు సంబంధించి కూలిడబ్బులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మండలంలోని అన్ని గ్రామాల కూలీలు సోమవారం ఉపాధి కార్యాలయాన్ని ముట్టడించారు. అంతకుముందు వారు తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కూలిడబ్బుల కోసం న్యాయ పోరాటానికి సిద్ధమైన ఉపాధి కూలీలకు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెంట్యాల హనుమంతరావు, డివిజన్ కార్యదర్శి జి. వెంకటేశ్వర్లు సంఘీభావం తెలిపారు.
ధర్నా వద్ద హనుమంతరావు మాట్లాడుతూ ఉపాధి పనులు చేసిన 15 రోజుల్లో కూలి చెల్లించాల్సి ఉంటుందని, లేకుంటే ప్రభుత్వం అపరాధ రుసుం ఇవ్వాల్సి ఉందన్నారు. బకాయిలు రూ.33.82 లక్షలు చెల్లించకపోవడం కూలీల కడుపు కొట్టడమేనని విమర్శించారు. ఈ ఏడాది ఉపాధి పనులకు సంబంధించి కూడా 6 వారాల కూలి చెల్లించకపోవడం దారుణమన్నారు.
పీడీని ప్రశ్నించిన హనుమంతరావు..
ఉపాధి హామీ పథకం జిల్లా పీడీ పోలప్పను హనుమంతరావు ఫోన్‌లో సంప్రదించారు. గత ఏడాది కూలి ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. కూలీల సమస్యను పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్పందించిన పీడీ, వెంటనే ఏపీఓకు ఫోన్ చేసి కూలీల సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.
ర్యాలీ నిర్వహించిన కూలీలు
ధర్నా అనంతరం కూలీలు ఉపాధి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యాలయం ముట్టడించారు. దీంతో ఏపీఓ అబ్దుల్లా స్పందిస్తూ, ఈ ఏడాది కూలిడబ్బులను ఈ నెల 30వ తేదీలోపు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. గత ఏడాదికి సంబంధించి కూలి సమస్యను 15 రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో మండల మేట్‌ల సంఘం అధ్యక్షుడు టి.సుధాకర్, కార్యదర్శి ఎల్.లక్ష్మీనరసింహం, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.
‘ఉపాధి’ కార్యాలయం ముట్టడి
Published Tue, May 27 2014 1:36 AM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM
Advertisement
Advertisement