Hanumanta Rao
-
వామ్మో..! మాజీ ఎంపీ వీహెచ్ డ్యాన్స్ చూడండి
-
మాణిక్యం ఠాగూర్ ముఖం చాటేశారా.?
-
‘బాబు అటు పోయేది లేదు’.. నమస్తే సార్!
ఖమ్మం: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు శనివారం ట్రాఫిక్ పోలీస్ అవతారమెత్తారు. ట్రాఫిక్‌లో చిక్కుకున్న వీహెచ్.. తానే దగ్గరుండి దాన్ని క్లియర్ చేశారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలోని తల్లంపాడులో చోటు చేసుకుంది. ఖమ్మంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తు చేపడుతున్న ఆందోళనలో పాల్గొనేందుకు హీహెచ్ హైదరాబాద్ నుంచి వెళ్తుండగా తల్లంపాడులో ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంది. వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోవడంతో వీహెచ్ తానే స్వయంగా దగ్గరుండి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ‘‘బాబు అటు పోయేది లేదు.. ఇటు వెళ్లండి’’ అంటూ సూచనలు చేయడమే కాక.. రోడ్డు మీద వెళ్తున్న వారిని ‘‘నమస్తే సార్’’ అంటూ పలకరించారు. ప్రస్తుతం ఇందుకు సబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. రేపు ఖమ్మం నగరంలో జరుగున్న కార్పోరేషన్ ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశంలో కూడా వీహెచ్ పాల్గోననున్నారు. చదవండి: రేవంత్‌రెడ్డిని మాత్రం కానివ్వను.. -
కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి వినోద్
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ మంత్రి గడ్డం వినోద్‌కుమార్ తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. గతంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల్లో పనిచేసిన వినోద్.. 2018 శాసనసభ ఎన్నికల్లో బీఎస్పీ తరఫున పోటీ చేశారు. ఆయన సోదరుడు, మాజీ ఎంపీ జి.వివేక్ కొంతకాలం క్రితం బీజేపీలో చేరగా.. వినోద్ మాత్రం స్వతంత్రంగానే రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా శనివారం ఆయన కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అంతకుముందు ఆయన పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్‌ను కూడా కలిశారు. వినోద్ కాంగ్రెస్‌లో చేరిన అనంతరం పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి వినోద్ కృషి చేస్తారని అన్నారు. కాంగ్రెస్‌తో బంధం..: వినోద్ వినోద్ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పార్టీతో నాకు 35 ఏళ్లుగా సత్సంబంధాలు ఉన్నాయి. వీటన్నింటినీ తిరిగి కొనసాగించాలనుకుంటున్నా. అప్పట్లో అపరిపక్వ నిర్ణయం తీసుకున్నా. కొన్ని అపార్థాల కారణంగా పార్టీని వీడాల్సి వచ్చింది. తిరిగి సొంత పార్టీకి రావడం అదృష్టంగా భావిస్తున్నా’అని వివరించారు. వినోద్‌కు స్వాగతం: వీహెచ్ ‘కాంగ్రెస్‌కు పునర్ వైభవం కల్పించాలన్నదే అందరి ఆలోచన. వినోద్ పార్టీలోకి తిరిగి రావడం, వెంకటస్వామి బాటలో నడవడం స్వాగతించదగిన పరిణామం’ అని మాజీ ఎంపీ వి.హనుమంతరావు పేర్కొన్నారు. -
మన ఊరు.. విరాళాల జోరు
మీ సొంత ఊరికి మేలు చేయడానికి ఎంతో కొంత సహాయం, సహకారం అందించండి అంటూ కలెక్టర్ హనుమంతరావు ఇచ్చిన పిలుపునకు భారీ స్పందనే వచ్చింది.. ‘మన ఊరు’ పేరుతో విరాళాలివ్వండి అంటూ కలెక్టర్ ఓ కార్యక్రమం చేపట్టగానే ప్రజాప్రతినిధులు, అధికారులు, పరిశ్రమల యజమానులు భారీగానే విరాళాలందించారు. ఇప్పటికే రూ. 3 కోట్ల 31లక్షల పై చిలుకు నిధులు సమకూరాయి. ఈ క్రమంలో విరాళాలిచ్చిన దాతలను సోమవారం (నేడు) సన్మానించనున్నారు. సాక్షి, సంగారెడ్డి: రాష్ట్రంలోనే భూవాణి, ప్రజావాణిలో అక్షయపాత్ర భోజనం, పల్లె నిద్ర, మెగా శ్రమదానం, మెగా హరితహారం.. తదితర కార్యక్రమాలను వినూత్నంగా ప్రవేశపెట్టిన కలెక్టర్ ఎం.హనుమంతరావు మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే ‘మన ఊరు’. ఆర్థికంగా స్థితిమంతులైన వారు తమ స్వగ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ఎంతో కొంత డబ్బును విరాళంగా ఇవ్వడం మన ఊరు ముఖ్య ఉద్దేశం. దాతల నుంచి విరాళాల సేకరించే అంశాన్ని కొత్తగా అమలులోకి తెచ్చిన పంచాయతీరాజ్ చట్టంలో పొందుపర్చడంతో కలెక్టర్ ఆ దిశగా ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. దాతలు విరాళంగా ఇచ్చిన నిధులను ఆయా గ్రామాల్లో అత్యవసర పనులకు ప్రాధాన్యతా క్రమంలో ఖర్చు చేయనున్నా రు. ముఖ్యంగా పాఠశాలల్లో మౌలిక వసతులు, గ్రామంలో పరిశుభ్రతకు చెత్త బుట్టల పంపిణీ, వీధి లైట్లు, యువజనులకు భవనాలు, హరితహారం.. తదితర కార్యక్రమాలకు ప్రాధాన్యమివ్వనున్నారు. మన ఊరు వినూత్న కార్యక్రమమని, దాతలు స్పందించాలని మంత్రి హరీశ్‌రావు సైతం అభినందించడం విశేషం. గ్రామం నుంచి ఆర్థికంగా ఎదిగినవారితోనే.. జిల్లాలో మొత్తం 647 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఈ గ్రామాల నుంచి ఆర్థికంగా ఎంతో బలపడిన వారున్నారు. ఆయా గ్రామాల నుంచి విదేశాలకు వెళ్లినవారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి సంపాదించినవారు, ఉద్యోగులు, తదితరులుంటారు. వారు ఎంతో కొంత తమ గ్రామానికి సహాయం చేయాలని తాపత్రయపడుతుంటారు. కానీ ఎవరి ద్వారా ఆ డబ్బులు ఖర్చు చేయాలి, ఏవిధంగా ఖర్చుచేయాలి, తదితర విషయాలు తెలియక వెనుకంజ వేస్తుంటారు. అందువల్లనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 30 రోజుల గ్రామాల కార్యాచరణ ప్రణాళికను వేదిక చేసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు మన ఊరు కార్యక్రమం ద్వారా విరాళాలు సేకరించాలని నిర్ణయించారు. దీంతో ప్రజాప్రతినిధులు, అధికారులు, పారిశ్రామిక వేత్తల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈనెల 30న జిల్లా వ్యాప్తంగా ‘డోనర్స్‌డే.. జిల్లా వ్యాప్తంగా డోనర్స్ డేను మొదటి విడతగా ఈ నెల 30న(నేడు) నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు దాతలకు ఆ రోజున గ్రామాల్లో సన్మానించడానికి అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. గ్రామసభలో ఆ రోజు ఆ గ్రామంలో ఎంతమంది దాతలు విరాళంగా ఇచ్చారో వారందరినీ గ్రామస్తుల ముందు సన్మానించాలని నిర్ణయించారు. ఆ గ్రామానికి విరాళంగా ఇచ్చినవారు ఆ రోజు గ్రామంలో లేకపోతే వారి తరఫున కుటుంబ సభ్యులు, బంధువులను సన్మానించనున్నారు. ముఖ్యంగా ఎన్ఆర్ఐలు అందుబాటులో ఉండరు కాబట్టి వారి కుటుంబీకులను సన్మానించాలని నిర్ణయించారు. అదే వి«ధంగా రెండో విడత డోనర్స్ డేను వచ్చే నెల 5న నిర్వహించనున్నారు. విశేష స్పందన: తమ స్వగ్రాల సర్వతోముఖాభివృద్ధికి దాతల నుంచి విరాళాల సేకరించేందుకు ఉద్దేశించిన మన ఊరు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. దీన్ని నిరంతర కార్యక్రమంగా చేపట్టాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. కలెక్టర్ పిలుపుతో ప్రజాప్రతినిధులు, అధికారులు, పారిశ్రామికవేత్తల నుంచి స్పందన లభిస్తోంది. ఒక్క పటాన్ చెరు మండలంలోనే పలు పరిశ్రమల యజమానులు స్పందించి రూ. కోటి విరాళంగా అందజేశారు. ఈ నిధులను ఆయా గ్రామాల పరిధిలో అభివృద్ధి పనులకు ఖర్చు చేయనున్నారు. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తాను దత్తత తీసుకున్న కొత్తపల్లి, నల్లవెల్లి గ్రామాలకు గాను రెండు ట్రాక్టర్లను ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. దీని కోసం మొదటి విడతగా రూ.9 లక్షల విరాళం ప్రకటించారు. అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తానని తెలిపారు. ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి రూ.5లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఈ నిధులను అవసరమైన గ్రామాల్లో వినియోగించాలని కలెక్టర్‌కు సూచించారు. కలెక్టర్ హనుమంతరావు దత్తత తీసుకున్న కంది మండలంలోని చెర్లగూడెం గ్రామ అభివృద్ధికి తన వేతనంలో నుంచి రూ.25 వేల చెక్కును మంత్రి టి.హరీవ్రావుకు అందజేశారు. జిల్లాలోని పలువురు అధికారులంతా కలిసి రూ.5 లక్షలను ఆయా గ్రామాలకు విరాళంగా అందించారు. ఒక్కో అధికారి రూ. 5వేల నుంచి రూ.25 వేల వరకు స్వంత డబ్బులను అందజేశారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్లోళ్ల మంజుశ్రీ తాను దత్తత తీసుకున్న పుల్కల్ మండలంలోని పోచారం గ్రామ అభివృద్ధికి రూ.20వేలు మొదటి విడతగా విరాళం ఇచ్చారు. జిన్నారం మండలంలోని ఊట్ల గ్రామానికి జెడ్పీ వైస్‌చైర్మన్ కుంచాల ప్రభాకర్ అమెరికాలో ఉన్న తన కూతురు పేరుతో రూ. 16 వేలు విరాళం ఇచ్చారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి కంది మండలంలోని కాశీపూర్ గ్రామానికి రూ.25వేలు అందజేశారు. అధికారుల దాతృత్వం.. కలెక్టర్ తన దత్తత గ్రామ అభివృద్ధికి రూ.25వేలు విరాళంగా ఇచ్చిన స్ఫూర్తితో జిల్లా అధికారుల నుంచి విశేష స్పందన లభించింది. డీఆర్ఓ రాధికారమణి రూ.10వేలు, సంగారెడ్డి ఆర్డీఓ శ్రీనివాస్ 20వేలు, జహీరాబాద్ ఆర్డీఓ రమేష్‌బాబు రూ.15వేలు, నారాయణఖేడ్ ఆర్డీఓ అంబదాస్ రాజేశ్వర్ రూ.10వేలు, జెడ్పీ సీఈఓ రవి రూ.25వేలు, బీసీ సంక్షేమాధికారి కేశురాం రూ.25వేలు, జిల్లా అటవీశాఖ అధికారి వెంకటేశ్వర్లు రూ.25వేలు, నీటిపారుదల శాఖ ఈఈ మధుసూదన్ రెడ్డి రూ.25వేలు, జిల్లా ల్యాండ్ సర్వే అధికారి మధుసూదన్ రావు రూ.21వేలు, ఇంటర్మీడియట్ విద్యాధికారి ఎం.కిషన్ రూ.15వేలు, పంచాయతీరాజ్ ఈఈ దామోదర్ రూ.15వేలు, లీగల్ మెట్రాలజీ అధికారి ప్రవీణ్‌కుమార్ రూ.15వేలు, మత్స్యశాఖ జిల్లా అధికారి సుజాత రూ.11వేలు, మైన్స్ అండ్ జియాలజీ అధికారి మధుకుమార్ రూ.10వేలు, జౌళి, చేనేత అధికారి విజయలక్ష్మి రూ.10వేలు, అసిస్టెంట్ కమిషనర్ రవీందర్ రూ.10వేలు, సీపీఓ పి.మనోహర్ రూ.10వేలు, డీఎంటీఎస్ఈ ఎస్సీఎల్ సుగుణ రూ.10వేలు, అందోల్ పీఆర్ ఈఈ వేణుమాధవ్ రూ.10వేలు, ఆర్ఎంఓ డాక్టర్.సంగారెడ్డి రూ.10వేలు, డీఈఓ విజయలక్ష్మి రూ.10వేలు, డీపీఓ వెంకటేశ్వర్లు రూ.10వేలు, పశుసంవర్ధకశాఖ అధికారి రామారావు రాథోడ్ రూ.10వేలు, డీఆర్డీఓ శ్రీనివాస్‌రావు రూ.10వేలు, జిల్లా ట్రెజరీ అధికారి వెంకటేశ్వర్లు రూ.10వేలు అందజేశారు. అదే విధంగా రూ.5వేలు విరాళం ఇచ్చిన అధికారుల్లో జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబూరావు, ఆడిట్ అధికారి బలరాం, జిల్లా మహిళా సంక్షేమాధికారి పద్మావతి, ఎస్సీ డెవలప్మెంట్ అధికారి మల్లేశం, టీఎన్‌ఆర్‌ఈడీసీఎల్ మాణిక్యం, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి వందన, జిల్లా యువజన, క్రీడలు అధికారి రాంచందర్‌రావులు ఉన్నారు. ఇలా ఎంతోమంది దాతలు విరాళంగా ఇవ్వడంతో పటాన్ చెరు మండలంలో పారిశ్రామిక వేత్తలు ఇచ్చిన రూ. కోటికి అదనంగా రెండు రోజుల్లోనే రూ.21,09,000 వచ్చినట్లు జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు ప్రకటించారు. సన్మానిస్తారిలా.. ఇచ్చిన డబ్బును బట్టి ఎవరిని ఎలా సన్మానించాలనే విషయమై జిల్లా యంత్రాంగా విధివిధానాలు రూపొందించింది. దాతలను మూడు విభాగాలుగా చేసి సన్మానించనున్నారు.రూ.లక్షలోపు విరాళం ఇస్తే గ్రామంలోనే గ్రామసభలో సన్మానిస్తారు ∙రూ.లక్ష నుంచి ఐదు లక్షలలోపు విరాళంగా ఇచ్చిన వారిని కలెక్టర్, ఎస్పీ, జిల్లా పరిషత్ చైర్పర్సన్, తదితరుల సమక్షంలో కలెక్టరేట్లో సన్మానిస్తారు . రూ. 5 లక్షలకు పైబడి విరాళమిస్తే జిల్లా మంత్రిని ముఖ్యఅతిథిగా ఆహ్వానించి ఆయన చేతులమీదుగా సన్మానించాలని జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు నిర్ణయించారు. దాతలు ముందుకు రావాలి మన ఊరికి ఎంతో కొంత సేవచేయాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయినా నేరుగా చేసే అవకాశం అందరికీ రాదు. అందువల్లనే మీ స్వంత గ్రామాల అభివృద్ధికి మీరు చేయూతనివ్వడానికి అధికారికంగా విరాళాలు స్వీకరిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 30వ తేదీ, వచ్చే నెల 5వ తేదీన డోనర్స్‌డే గా నిర్వహిస్తున్నాం. విరాళాలు ఇచ్చిన వారిని సన్మానిస్తాం. గ్రామం నుంచి వెళ్లి విదేశాల్లో ఉన్నవారు, ఆర్థిక స్థితిమంతులు..ఇలా ఎవరైనా సరే మీ గ్రామాభివృద్ధికి తోడ్పడండి. విరివిగా విరాళాలు ఇవ్వడం ద్వారా గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కండి. దాతలు ముందుకు రావాలి. – హనుమంతరావు, కలెక్టర్ -
ప్రజలను గందరగోళపరచకండి
ప్రాజెక్టులపై ఆర్. విద్యాసాగర్‌రావు వ్యాఖ్య - కోదండరాం, హనుమంతరావు వంటివారు తొందరపడి మాట్లాడొద్దు - మల్లన్నసాగర్‌పై అనుమానాలుంటే నివృత్తి చేసుకోవచ్చు - మీకు ఎలాంటి అనుమానాలున్నా తగిన సమాచారం ఇస్తాం సాక్షి, న్యూఢిల్లీ : ‘‘కోదండరాం సాధారణ వ్యక్తి కాదు. తెలంగాణ ప్రజలకు ప్రతిబింబం లాంటి వారు. అలాంటివారు తొందరపడి మాట్లాడకూడదు. మాకు చాలా బాధ కలుగుతోంది. తెలంగాణ ఉద్యమంలో కలిసి తిరిగిన వాళ్లం. హనుమంతరావుకు, కోదండరాంకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ప్రాజెక్టులపై ప్రజలను గందరగోళ పరచవద్దు’’ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, నీటిపారుదల రంగ నిపుణుడు ఆర్.విద్యాసాగర్‌రావు అన్నారు. మల్లన్నసాగర్‌పై అనుమానాలుంటే నివృత్తి చేసుకోవచ్చన్నారు. ప్రాజెక్టుకు ఇంకా తుది రూపం లేదని, అయితే అన్ని ప్రత్యామ్నాయాలు ఆలోచించాకే ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చిందన్నారు. మల్లన్నసాగర్, పాల మూరు ఎత్తిపోతల పథకాలపై అనుమానాలను నివృత్తి చేసేందుకు బుధవారమిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘ప్రభుత్వానికి ఉండే ఇబ్బందులు ఉం టాయి. ప్రతిదానికి దురుద్దేశం ఆపాదించాల్సిన అవసరం లేదు. నాడు పులిచింతల, పోలవరం వద్దని అనేక పార్టీలు, ప్రజాసంఘాలు, నేను, కోదండరాం, హనుమంతరావు వ్యతిరేకించాం. పోలవరానికి అనుమతులు లేవు. అయినా కడుతున్నారు. మన సలహాలు స్వీకరించనంత మాత్రాన ప్రభుత్వాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. నా బాధ ఏంటం టే.. కోదండరాం, హనుమంతరావులాంటి వాళ్లు.. కూడా తప్పుపట్టడం. మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నా తగిన సమాచారం ఇస్తాం. అవసరమైతే సంబంధిత అధికారులను మీ దగ్గరికి పంపిస్తాం. కానీ మీరు ఎవరో పిలిచారని అక్కడికి వెళ్లి.. తెలిసీ తెలియకుండా మాట్లాడడం వల్ల ప్రజల్లో గందరగోళం తలెత్తుతుంది. ఇటీవల నారాయణఖేడ్ వద్ద రాజీవ్ బీమా ప్రాజెక్టుకు సంబంధించి పక్కనున్న జూరాల నుంచి కాకుండా శ్రీశైలం నుంచి నీళ్లు తెస్తున్నారని మీరు మాట్లాడారు. ఆచరణ యోగ్యంకాని వాటిని ఎలా అమలుచేస్తాం? జూరాల ప్రాజెక్టుకు శ్రీశైలం ప్రాజెక్టుకు చాలా తేడా ఉంది. అని ఆయన అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు కట్టుకున్నప్పుడు తాము అభ్యంతరం చెప్పలేదని, అయితే పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ప్రైవేటు వ్యక్తితో కేసు వేయించిందని తప్పుపట్టారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పాతదేదని, కేవలం డిజైన్ మాత్రమే మారిందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు, పట్టిసీమకు అనుమతి వచ్చిన వెంటనే అందులో నాగార్జునసాగర్ పై ప్రాంతానికి వాటా రావాల్సి ఉందన్నారు. వైఎస్ రాజనీతిజ్ఞుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాజనీతిజ్ఞత కారణంగానే ఆంధ్రప్రదేశ్‌లో ఆయన మొదలుపెట్టిన 84 ప్రాజెక్టుల్లో చాలావరకు ఇప్పుడు పూర్తవుతున్నాయని విద్యాసాగర్‌రావు అన్నారు. ‘‘రాజశేఖరరెడ్డి జలయజ్ఞం మొదలుపెట్టినప్పుడు సరిగ్గా ఇదే పరిస్థితి ఉంది. అప్పుడు మేం అభ్యంతరం చెప్పాం. మీరు 84 ప్రాజెక్టులు కడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేవు. నీళ్ల కేటాయింపులు లేవన్నాం. పోలవరం వంటి ప్రాజెక్టుకు కనీసం స్థలానికి సంబంధించిన అనుమతి కూడా లేదు. అప్పుడు ఆయన అన్నాడు.. ‘రావు గారూ మీరు పద్ధతి ప్రకారం కట్టాలంటున్నారు. కానీ ఎగువ రాష్ట్రాలు అడ్డూఅదుపు లేకుండా కడుతున్నాయి.. వాటిని ఎవరు ఆపుతున్నారు? నాకు ప్రజలు ఐదేళ్లు పాలించమని చెప్పారు. మరి నేను ఈ ఐదేళ్లు ప్రాజెక్టులు కట్టకుండా ఉంటే ప్రజలు ఏమంటారు?’ అని నన్ను ప్రశ్నించారు. ఐదేళ్లలో అన్నీ పూర్తి కాలేకపోవచ్చని, కానీ ఈరోజు మొదలుపెడితే తప్పకుండా ఏదో ఒకరోజు పూర్తవుతాయని ఆయన చెప్పారు. ప్రాజెక్టులకు అనుమతులన్నీ వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఆయన అనుకున్నట్టుగానే పోలవరం దాదాపుగా పూర్తయ్యేందుకు వస్తోంది. ఆయన నిర్ణయం కరెక్టే అని రుజువవుతోంది’’ అని అన్నారు. వైఎస్‌ను స్ఫూర్తిగా తీసుకుని ప్రాజెక్టులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆయన రాజనీతిజ్ఞత కారణంగానే ఏపీలో ప్రాజెక్టులు పూర్తవుతున్నాయని పేర్కొన్నారు. -
మెరుగుపెడితే ‘ఉస్మానియా’ మరో చౌమొహల్లా
ఆస్పత్రి భవనం పటుత్వంపై సందేహాలొద్దు కన్జర్వేషన్ ఇంజనీరింగ్‌తో వందల ఏళ్లు కాపాడొచ్చు చారిత్రక అద్భుతాన్ని నేలకూల్చొద్దు రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ హనుమంతరావు హైదరాబాద్: శిథిలావస్థకు చేరిన చారిత్రక, వారసత్వ కట్టడమైన ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని తొలగించి ఆ ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనాల (ట్విన్ టవర్స్) ఆస్పత్రి నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రముఖ ఇంజనీరింగ్ నిపుణులు, రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్, ఐరాస కన్సల్టెంట్ ఇ.ఎన్.సి హనుమంతరావు తప్పుబట్టారు. ఆ భవనాన్ని కొన్ని వందల ఏళ్లపాటు కళ్లముందు నిలిపే అవకాశం ఉన్నందున దాన్ని కూల్చొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆ భవనం పటుత్వంపై సందేహాలొద్దన్నారు. ‘అదో అద్భుత నిర్మాణం.. అలనాటి నిర్మాణ శైలికి దర్పణం.. ప్రపంచవ్యాప్తంగా వారసత్వ కట్టడాలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. మనం దానికి భిన్నంగా వ్యవహరించటం సరికాదు.. వందల ఏళ్లపాటు చెక్కుచెదరకుండా మనగలిగేలా మలిచి ఆ నిర్మాణాన్ని భావితరాలకు అందివ్వాల్సి ఉంది. నిరంతరం నిర్వహణ పనులు కొనసాగిస్తే మరో 400 ఏళ్లయినా ఇంతే ఠీవిగా నిలబడే సత్తువ దానికుంది. ఉస్మానియా వర్సిటీ, హైకోర్టు భవనం సరసన నిలిచిన ఈ భవనం జీవితకాలాన్ని మనం సులభంగా నిర్ధారించలేం. అప్పట్లో అత్యంత పటుత్వంగా ఉండేలా వాటిని నిర్మించారు. అయితే కాలక్రమంలో గోడల పొరలు కొంత బలహీనపడి ఊడిపోవటం కద్దు. నిర్మాణంలో వినియోగించిన డంగు సున్నం వాతావరణ ప్రభావంతో బలహీనపడినంత మాత్రాన భవనమే పటుత్వం కోల్పోయిందని అనడం సరికాదు. పునాదులను బలహీనపడే పటుత్వం లేని భూమి కాదిది. గోడలు శిథిలమైన దాఖలాలేవీ లేవు. పైకప్పు జాక్ ఆర్చి రూఫ్ డిజైన్‌లో ఉంటే దాన్ని క్రాస్ గర్డర్‌లో సరిచేయొచ్చు, భారీ భూకంపాలు వస్తే తప్ప ఆ భవనం కూలే అవకాశమే లేదు’ అని పేర్కొన్నారు. సంరక్షణ చర్యలే కీలకం... గతంలో రాజ్‌భవన్ పైకప్పు నుంచి పెచ్చులూడి కిందపడటంతో ఆ భవనం శిథిలావస్థకు చేరుకుందనే భావన వ్యక్తమైందని, కానీ శాస్త్రీయ పద్ధతిలో దానికి సంరక్షణ చర్యలు చేపట్టడంతో అది ఠీవిగా కొనసాగుతోందని హనుమంతరావు గుర్తుచేశారు. అలాగే కొన్నేళ్లక్రితం వరకు కాలం తీరిన భవనాల జాబితాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపించిన చౌమొహల్లా ప్యాలెస్ ఇప్పుడు విదేశీ పర్యాటకులను గొప్పగా ఆకట్టుకుంటోందని...అందుకు సంరక్షణ చర్యలే కారణమన్నారు. ఇటలీలో ఓ పక్కకు ఒరిగిన ప్రపంచ ప్రఖ్యాత ‘లీనింగ్ టవర్ ఆఫ్ పీసా’ను కన్జర్వేషన్ ఇంజనీరింగ్ ద్వారానే కాపాడుతున్నారన్నారు. కన్జర్వేషన్ ఇంజనీరింగ్ పద్ధతులను అవలంబించి మరమ్మతు చర్యలు చేపడితే ఉస్మానియా ఆస్పత్రి భవనం మరో చౌమొహల్లా ప్యాలెస్‌గా వెలుగొందుతుందన్నారు. ఆస్పత్రి భవనం పరిరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లేదా జేఎన్టీయూ నుంచి నివేదిక తెప్పించుకోవచ్చన్నారు. -
‘ఉపాధి’ కార్యాలయం ముట్టడి
వలేటివారిపాలెం, న్యూస్‌లైన్ : గత ఏడాది మే, జూన్‌లో చేసిన పనులకు సంబంధించి కూలిడబ్బులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మండలంలోని అన్ని గ్రామాల కూలీలు సోమవారం ఉపాధి కార్యాలయాన్ని ముట్టడించారు. అంతకుముందు వారు తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కూలిడబ్బుల కోసం న్యాయ పోరాటానికి సిద్ధమైన ఉపాధి కూలీలకు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెంట్యాల హనుమంతరావు, డివిజన్ కార్యదర్శి జి. వెంకటేశ్వర్లు సంఘీభావం తెలిపారు. ధర్నా వద్ద హనుమంతరావు మాట్లాడుతూ ఉపాధి పనులు చేసిన 15 రోజుల్లో కూలి చెల్లించాల్సి ఉంటుందని, లేకుంటే ప్రభుత్వం అపరాధ రుసుం ఇవ్వాల్సి ఉందన్నారు. బకాయిలు రూ.33.82 లక్షలు చెల్లించకపోవడం కూలీల కడుపు కొట్టడమేనని విమర్శించారు. ఈ ఏడాది ఉపాధి పనులకు సంబంధించి కూడా 6 వారాల కూలి చెల్లించకపోవడం దారుణమన్నారు. పీడీని ప్రశ్నించిన హనుమంతరావు.. ఉపాధి హామీ పథకం జిల్లా పీడీ పోలప్పను హనుమంతరావు ఫోన్లో సంప్రదించారు. గత ఏడాది కూలి ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. కూలీల సమస్యను పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్పందించిన పీడీ, వెంటనే ఏపీఓకు ఫోన్ చేసి కూలీల సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ర్యాలీ నిర్వహించిన కూలీలు ధర్నా అనంతరం కూలీలు ఉపాధి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యాలయం ముట్టడించారు. దీంతో ఏపీఓ అబ్దుల్లా స్పందిస్తూ, ఈ ఏడాది కూలిడబ్బులను ఈ నెల 30వ తేదీలోపు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. గత ఏడాదికి సంబంధించి కూలి సమస్యను 15 రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో మండల మేట్ల సంఘం అధ్యక్షుడు టి.సుధాకర్, కార్యదర్శి ఎల్.లక్ష్మీనరసింహం, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.