కాంగ్రెస్‌లో చేరుతున్న గడ్డం వినోద్
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ మంత్రి గడ్డం వినోద్‌కుమార్ తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. గతంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీల్లో పనిచేసిన వినోద్.. 2018 శాసనసభ ఎన్నికల్లో బీఎస్పీ తరఫున పోటీ చేశారు. ఆయన సోదరుడు, మాజీ ఎంపీ జి.వివేక్ కొంతకాలం క్రితం బీజేపీలో చేరగా.. వినోద్ మాత్రం స్వతంత్రంగానే రాజకీయాల్లో కొనసాగుతున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా శనివారం ఆయన కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అంతకుముందు ఆయన పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్‌ను కూడా కలిశారు. వినోద్ కాంగ్రెస్‌లో చేరిన అనంతరం పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి వినోద్ కృషి చేస్తారని అన్నారు.
కాంగ్రెస్‌తో బంధం..: వినోద్
వినోద్ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పార్టీతో నాకు 35 ఏళ్లుగా సత్సంబంధాలు ఉన్నాయి. వీటన్నింటినీ తిరిగి కొనసాగించాలనుకుంటున్నా. అప్పట్లో అపరిపక్వ నిర్ణయం తీసుకున్నా. కొన్ని అపార్థాల కారణంగా పార్టీని వీడాల్సి వచ్చింది. తిరిగి సొంత పార్టీకి రావడం అదృష్టంగా భావిస్తున్నా’అని వివరించారు.
వినోద్‌కు స్వాగతం: వీహెచ్
‘కాంగ్రెస్‌కు పునర్ వైభవం కల్పించాలన్నదే అందరి ఆలోచన. వినోద్ పార్టీలోకి తిరిగి రావడం, వెంకటస్వామి బాటలో నడవడం స్వాగతించదగిన పరిణామం’ అని మాజీ ఎంపీ వి.హనుమంతరావు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment