ప్రజలను గందరగోళపరచకండి
ప్రాజెక్టులపై ఆర్. విద్యాసాగర్‌రావు వ్యాఖ్య
- కోదండరాం, హనుమంతరావు వంటివారు తొందరపడి మాట్లాడొద్దు
- మల్లన్నసాగర్‌పై అనుమానాలుంటే నివృత్తి చేసుకోవచ్చు
- మీకు ఎలాంటి అనుమానాలున్నా తగిన సమాచారం ఇస్తాం
సాక్షి, న్యూఢిల్లీ : ‘‘కోదండరాం సాధారణ వ్యక్తి కాదు. తెలంగాణ ప్రజలకు ప్రతిబింబం లాంటి వారు. అలాంటివారు తొందరపడి మాట్లాడకూడదు. మాకు చాలా బాధ కలుగుతోంది. తెలంగాణ ఉద్యమంలో కలిసి తిరిగిన వాళ్లం. హనుమంతరావుకు, కోదండరాంకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ప్రాజెక్టులపై ప్రజలను గందరగోళ పరచవద్దు’’ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, నీటిపారుదల రంగ నిపుణుడు ఆర్.విద్యాసాగర్‌రావు అన్నారు. మల్లన్నసాగర్‌పై అనుమానాలుంటే నివృత్తి చేసుకోవచ్చన్నారు. ప్రాజెక్టుకు ఇంకా తుది రూపం లేదని, అయితే అన్ని ప్రత్యామ్నాయాలు ఆలోచించాకే ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చిందన్నారు.
మల్లన్నసాగర్, పాల మూరు ఎత్తిపోతల పథకాలపై అనుమానాలను నివృత్తి చేసేందుకు బుధవారమిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘ప్రభుత్వానికి ఉండే ఇబ్బందులు ఉం టాయి. ప్రతిదానికి దురుద్దేశం ఆపాదించాల్సిన అవసరం లేదు. నాడు పులిచింతల, పోలవరం వద్దని అనేక పార్టీలు, ప్రజాసంఘాలు, నేను, కోదండరాం, హనుమంతరావు వ్యతిరేకించాం. పోలవరానికి అనుమతులు లేవు. అయినా కడుతున్నారు. మన సలహాలు స్వీకరించనంత మాత్రాన ప్రభుత్వాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. నా బాధ ఏంటం టే.. కోదండరాం, హనుమంతరావులాంటి వాళ్లు.. కూడా తప్పుపట్టడం. మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నా తగిన సమాచారం ఇస్తాం. అవసరమైతే సంబంధిత అధికారులను మీ దగ్గరికి పంపిస్తాం.
కానీ మీరు ఎవరో పిలిచారని అక్కడికి వెళ్లి.. తెలిసీ తెలియకుండా మాట్లాడడం వల్ల ప్రజల్లో గందరగోళం తలెత్తుతుంది. ఇటీవల నారాయణఖేడ్ వద్ద రాజీవ్ బీమా ప్రాజెక్టుకు సంబంధించి పక్కనున్న జూరాల నుంచి కాకుండా శ్రీశైలం నుంచి నీళ్లు తెస్తున్నారని మీరు మాట్లాడారు. ఆచరణ యోగ్యంకాని వాటిని ఎలా అమలుచేస్తాం? జూరాల ప్రాజెక్టుకు శ్రీశైలం ప్రాజెక్టుకు చాలా తేడా ఉంది. అని ఆయన అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు కట్టుకున్నప్పుడు తాము అభ్యంతరం చెప్పలేదని, అయితే పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ప్రైవేటు వ్యక్తితో కేసు వేయించిందని తప్పుపట్టారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పాతదేదని, కేవలం డిజైన్ మాత్రమే మారిందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు, పట్టిసీమకు అనుమతి వచ్చిన వెంటనే అందులో నాగార్జునసాగర్ పై ప్రాంతానికి వాటా రావాల్సి ఉందన్నారు.
వైఎస్ రాజనీతిజ్ఞుడు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాజనీతిజ్ఞత కారణంగానే ఆంధ్రప్రదేశ్‌లో ఆయన మొదలుపెట్టిన 84 ప్రాజెక్టుల్లో చాలావరకు ఇప్పుడు పూర్తవుతున్నాయని విద్యాసాగర్‌రావు అన్నారు. ‘‘రాజశేఖరరెడ్డి జలయజ్ఞం మొదలుపెట్టినప్పుడు సరిగ్గా ఇదే పరిస్థితి ఉంది. అప్పుడు మేం అభ్యంతరం చెప్పాం. మీరు 84 ప్రాజెక్టులు కడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేవు. నీళ్ల కేటాయింపులు లేవన్నాం. పోలవరం వంటి ప్రాజెక్టుకు కనీసం స్థలానికి సంబంధించిన అనుమతి కూడా లేదు. అప్పుడు ఆయన అన్నాడు.. ‘రావు గారూ మీరు పద్ధతి ప్రకారం కట్టాలంటున్నారు.
కానీ ఎగువ రాష్ట్రాలు అడ్డూఅదుపు లేకుండా కడుతున్నాయి.. వాటిని ఎవరు ఆపుతున్నారు? నాకు ప్రజలు ఐదేళ్లు పాలించమని చెప్పారు. మరి నేను ఈ ఐదేళ్లు ప్రాజెక్టులు కట్టకుండా ఉంటే ప్రజలు ఏమంటారు?’ అని నన్ను ప్రశ్నించారు. ఐదేళ్లలో అన్నీ పూర్తి కాలేకపోవచ్చని, కానీ ఈరోజు మొదలుపెడితే తప్పకుండా ఏదో ఒకరోజు పూర్తవుతాయని ఆయన చెప్పారు. ప్రాజెక్టులకు అనుమతులన్నీ వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఆయన అనుకున్నట్టుగానే పోలవరం దాదాపుగా పూర్తయ్యేందుకు వస్తోంది. ఆయన నిర్ణయం కరెక్టే అని రుజువవుతోంది’’ అని అన్నారు. వైఎస్‌ను స్ఫూర్తిగా తీసుకుని ప్రాజెక్టులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆయన రాజనీతిజ్ఞత కారణంగానే ఏపీలో ప్రాజెక్టులు పూర్తవుతున్నాయని పేర్కొన్నారు.