నిరుద్యోగంపై జేఏసీ సమరం
- ఆగస్టు మొదటి వారంలో సదస్సు: కోదండరాం
- 21, 22న పాలమూరు ప్రాజెక్టులపై అధ్యయనం
-మల్లన్నసాగర్ నిర్వాసితులకు చట్టంపై అవగాహన కల్పిస్తాం
- బలవంతపు భూసేకరణ అవసరం లేదు
- విద్యాసాగర్‌రావు వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న నిరుద్యోగ సమస్యపై పోరుబాట పట్టాలని తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్ణయించింది. గురువారం జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అధ్యక్షతన హైదరాబాద్‌లోని కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ భేటీ అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్టు మొదటి వారంలో నిరుద్యోగ సమస్యపై సదస్సు నిర్వహించాలని నిర్ణయించినట్టుగా వెల్లడించారు.
విద్యుత్ రంగ సమస్యలు, వాస్తవాలు, పరిష్కారాలపై వచ్చేవారంలో పుస్తకం విడుదల చేస్తామన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు, తెలంగాణ వచ్చిన తర్వాత పురోగతి, క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితిపై అధ్యయనం చేస్తామన్నారు. ఈ నెల 21, 22న జేఏసీ బృందం ఆ జిల్లాలోని ప్రాజెక్టులపై అధ్యయనం చేస్తుందన్నారు. మల్లన్నసాగర్‌లో భూనిర్వాసితులకు న్యాయపరమైన అంశాలు, చట్టంపై అవగాహనకు జేఏసీ ప్రయత్నం చేస్తుందన్నారు. ఇందుకు వీలైన రూపాల్లో ప్రజలకు అవగాహన, చైతన్యం కల్పిస్తామని వివరించారు.
ప్రాజెక్టులు నిపుణుల కోసం కాదు..
ప్రాజెక్టులు నిపుణుల కోసం కట్టుకునేవి కావని కోదండరాం అన్నారు. సాదా బైనామాలను అడ్డుపెట్టుకుని రైతులను బెదిరించడం సమంజసం కాదన్నారు. ‘‘బలవంతంగా భూసేకరణ అవసరం లేదు. తమ్మిడిహెట్టి, కంతనపల్లి తరహాలో మల్లన్నసాగర్‌పై ఎందుకు ఆలోచన చేయడం లేదు? సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చట్టాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం’’ అని అన్నారు.
చట్టానికి లోబడి పనిచేయాల్సిన ప్రభుత్వ సలహాదారు చట్టాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదనడం సబబు కాదన్నారు. తెలంగాణ అంశాలపై కనీస అధ్యయనం చేసిన తర్వాతే తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తామన్నారు. ఈ సమావేశంలో జేఏసీ నేతలు ప్రహ్లాద్, పిట్టల రవీందర్, ఇటిక్యాల పురుషోత్తం, వెంకట రెడ్డి, భైరి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.