vibhishunudu
-
సుగుణ భూషణుడు... విభీషణుడు!
విభీషణుడు విశ్రవసు, కైకసిల సంతానమే విభీషణుడు, రావణాసురుని చిన్న తమ్ముడు. అందరికంటే పెద్దవాడు రావణాసురుడు, కుంభకర్ణుడు రెండవవాడు. విభీషనుడు వీరిద్దరికంటే పూర్తి భిన్నమైన వాడు. సంస్కారవంతుడు, ఉత్తమోత్తమగుణాలు కలవాడు. సోదరులంటే అభిమానం కలవాడు. అందులో రావణాసురుడు అంటే భయభక్తులున్నవాడు. సీతమ్మ వారిని రావణాసురుడు చెర పట్టినప్పుడు‘అన్నా నీకు ఇది తగదు’ అని మొదట హెచ్చరించింది విభీషణుడే. తదుపరి ఎన్నడూ రావణుని మందిరానికి వెళ్ళింది లేదు.హనుమ లంకాదహనం చేసినప్పుడు మరోసారి రావణునికి హితబోధ చేయాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. రావణుడు, సీతమ్మ దగ్గరకు వెళ్ళి గడువు పెట్టి వస్తున్నప్పుడు, రావణుని ఏకాంతంగా కలసి చెప్పాలనుకుని భయంతో విరమించుకున్నాడు. ఈ దిశలో రామలక్ష్మణులు, వానర సైన్యంతో సముద్రాన్ని దాటి రావడం, రావణునితో సమర భేరి మోగించడం జరిగింది ఆ సమయంలో రాచకొలువులో కోపోద్రిక్తుడై యుద్ధంలో ఆ రోజు విధులను కొంతమంది రాక్షస వీరులను నియమించాడు. అప్పుడు కూడా విభీషనుడు, రావణునికి చెప్పలేకపోయాడు. అన్న అంటే అంత భయం అతనికి. యుద్ధంలో రాక్షస వీరులు మరణిస్తుంటే తట్టుకోలేక పోయాడు విభీషణుడు. అప్పుడే పూజ ముగించి దైర్యంతో నేరుగా రావణుని దగ్గరకు వెళ్ళాడు.. అప్పుడు రావణుడు ‘‘రా విభీషణా!రేపు యుద్ధంలో నీవే నాయకత్వం వహించాలి’’ అని చెబుతుండగా, విభీషణుడు చేతులు జోడించి ‘అగ్రజా! యుద్ధం మనకు వద్దు.సీతమ్మ పరమ సాధ్వి. ఆ రామలక్ష్మణులు దైవాంశ సంభూతులు... అందువల్ల... ’’ అంటుండగా రావణుని తీక్షణ చూపులు చూడలేక తల దించుకున్నాడు. మళ్ళీ ధైర్యంతో ‘ఒక్కసారి ఆలోచించు ఒక రాజుగా మీకు ఇది శ్రేయస్కరం కాదు. రాజు ప్రజల బాగోగులు చూడాలి. స్త్రీలకు రక్షణగా ఉండాలి. నా మాట విను, ఆ సీతమ్మ వారిని రాముల వారికి అప్పగించు. సమయం మించి పోలేదు. చేసిన తప్పు ఒప్పుకుని ఆ శ్రీరాముల వారిని శరణు వేడు. నీకు జయం కలుగుతుంది. శరణుజొచ్చిన వారిని అక్కున చేర్చుకునే మంచి గుణాలు అయనకు ఉన్నాయి, మీ మేలు కోరి ఈ లంక ప్రజల తరపున చివరిసారిగా చెబుతున్నాను. సీతమ్మ వారిని అప్పగించు, చేసిన తప్పు ఒప్పుకో! నిన్ను శ్రీ రాములు వారు కరుణిస్తారు’’ అని పరి పరి విధాలుగా చెప్పాడు.ఆ మాటలు విని రావణుడు ‘‘అయ్యిందా నీ ఉపన్యాసం? నాకే నీతులు చెబుతావా! ముల్లోకాలలోనూ నాకు ఎదురు లేదు అనే విషయం నీకు తెలియదా! ఆ రాముని వధించి, సీతను వివాహం చేసుకొనుటకే నేను నిశ్చయించుకున్నా, నీ హితబోధ నాకు కాదు. ఇదే నిన్ను శాసిస్తున్నాను. రేపు యుద్ధ భూమిలో నీవే ప్రధాన బాధ్యత వహించాలి ఇది నా ఆజ్ఞ’’ అని చర చర వెళ్ళిపోయాడు రావణుడు. విభీషణుడు అన్నీ ఆలోచించి శ్రీరాముల వారి దగ్గరకు ‘శరణు, శరణు’ అని వెళ్ళాడు.శ్రీ రాముడు అతన్ని చూశాడు. వినమ్రంగా, చేతులు జోడించి ఉన్న విభీషణుని చూడగానే ఆసనంపై నుంచి లేచి తన హృదయానికి హత్తుకున్నాడు.‘నా జన్మ ధన్యమైంది ప్రభూ’’ అంటూ శ్రీ రాముల వారి పాదాలు తాకి తన భక్తి, వినయం నిరూపించుకున్నాడు. ఆ విధంగా శ్రీరాముడితో విభీషణునికి స్నేహం కుదిరింది. రాముడికి యుద్ధంలో చేదోడుగా ఉన్నాడు. రావణుని మరణానంతరం లంకకు విభీషణుడు రాజైనాడు. ఇది శ్రీ రాముల వారు, విభీషణునికి ఇచ్చిన కానుక. లంకకు రాజైన విభీషణుడు సుపరిపాలన చేసి, ప్రజలకు ఉత్తమ పాలన అదించాడు. విభీషణుని చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. – కనుమ ఎల్లారెడ్డి, పౌరశాస్త్ర అధ్యాపకులు -
అప్పుడు ఆప్తుడే.. మరిప్పుడో..!!!
Chaganti Koteswara Rao: కమలములు నీటబాసిన/కమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్/ తమ తమ నెలవులు దప్పిన/ తమ మిత్రులె శత్రులగుట తథ్యము సుమతీ...అన్నాడు బద్దెన సుమతీ శతకంలో. నీళ్ళల్లో ఉన్న తామర మొగ్గ విచ్చుకోవడానికి కారణమయిన సూర్యనారాయణుడు, అదే తామరతూడును నీళ్ళల్లో నుంచి తీసి ఒడ్డున పెడితే ...ఆయన వాడివేడి కిరణాలు సోకి అది వాడిపోతుంది, కమలాప్తుడు అంటే నీళ్ళల్లో ఉన్న కమలానికి బంధువు, నీళ్ళనుంచి బయటికి వచ్చిన పిదప శత్రువయిపోయాడు. విభీషణుడు రావణునికి సోదరుడు. కానీ ఎప్పుడూ ధర్మంవైపే నిలబడతాడు. అన్నగారు అధర్మానికి పాల్పడినప్పుడల్లా హెచ్చరిస్తూ ఉంటాడు. అలా చెప్పే వారు మన శ్రేయోభిలాషులని గుర్తించకపోతే చాలా ప్రమాదకరం. హనుమ రాయబారం తరువాత రావణాసురుడు కోపంతో హనుమ కంఠాన్ని నరికేయమన్నాడు. ఆయన్ని సంహరించబోతున్నారు. విభీషణుడు జోక్యం చేసుకొన్నాడు. ‘అన్నయ్యా! నీకు తెలియని ధర్మం లేదు కదా... అతను దూత. ఎవరో చెప్పి పంపినవి ఆయన చెబుతున్నాడు. అవి దూత అభిప్రాయాలు కావు కదా. దూత పరిధి దాటాడనిపిస్తే స్వల్పంగా శిక్షించవచ్చు. అంతేకానీ సంహరిస్తానంటే ఎలా..? పైగా నీవితన్ని సంహరిస్తే నీ అభిప్రాయాలు అవతలివారికి ఎలా చేరవేయగలవు? కాబట్టి వద్దు.. అన్నాడు. రావణుడు నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అటువంటి ధర్మాత్ముడు పక్కన ఉన్నంతకాలం ... ఉపద్రవాలు ప్రాణాంతకం కాకుండా ఉన్నాయి. కానీ తరువాత జరిగిన పరిణామాలవల్ల విభీషణుడు రాముడి పక్కన చేరిపోయాడు. ఇంద్రజిత్తు రాముడిపై యుద్ధానికి బయలుదేరుతున్నాడు. బ్రహ్మగారు ఒకానొకప్పుడు ఆయనకు వరం ఇస్తూ...‘‘నికుంభిలా (దట్టమైన అడవిలో ఉన్న ఒక దేవాలయం. అక్కడికి చేరుకోవడం చాలా ప్రమాదకరం) కు వెళ్ళి హోమం చెయ్యి. దానిలోంచి వచ్చిన రథం మీద కూర్చొని యుద్ధానికి బయల్దేరితే... నువ్వు మేఘాలలో ఉండి దుర్నిరీక్షవుడవుతావు. నిన్ను యుద్ధంలో గెలవడం ఎవరికీ సాధ్యం కాదు.’’ అని వరమిస్తూనే...‘‘నువ్వు నికుంభిలా చేరకపోయినా, చేరి హోమాన్ని పూర్తి చేయలేక పోయినా, నువ్వు ఆయుధాన్ని ధరించి ఉండగా నీపై యుద్ధానికి వచ్చినవాడే నీ ప్రాణాలను హరిస్తాడని గుర్తించు’’ అని హెచ్చరించాడు. ఈ రహస్యం విభీషణుడికి తెలుసు. ఇప్పుడాయన రాముడి పక్షంలో ఉన్నాడు. అదంతా రాముడికి తెలిపి... ఇపుడు ఇంద్రజిత్తు నికుంభిలా చేరుకున్నాడు... అని కూడా చెప్పి రాముడి ఆజ్ఞతో లక్ష్మణస్వామిని తీసుకొని వెళ్ళాడు. ఇంద్రజిత్తు హోమాన్ని మధ్యలోనే ఆపేసి యుద్ధానికి వచ్చాడు. ఆ తరువాత లక్ష్మణుడి చేతిలో చచ్చాడు. అంటే విభీషణుడు స్థానం తప్పిన కారణంగా లంకకు, రావణాసురుడికి చేటు వచ్చింది. అందుకే బద్దెన చెప్పింది.. ఒక్కొక్కసారి ఒక్కొక్కస్థానంలో మిత్రుడిగా ఉన్నవాడు, స్థానం తప్పితే శత్రువయిపోతాడు. మన పక్కన ఉన్నవారిలో మన శ్రేయస్సు కోరి కొన్ని కఠినమైన సలహాలు ఇచ్చినా, వాటిని పరిశీలించి ఓర్పుతో, విచక్షణతో మసలుకొన్నప్పుడు అవాంఛిత ప్రమాదాలు మాత్రం ఎదురుకాకుండా ఉంటాయన్నదే బద్దెన ఇస్తున్న సలహా. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చదవండి: మంచి మాట..: ఏది నిజమైన సంపద? -
లంక విభీషణుడిదే!
సీతాపతి రావణ సంహారం జరిగాక ఆయనకు అంత్యక్రియలు జరిపేందుకు విభీషణుడు వెనకాడాడు. దీనిని రాముడు తప్పు పట్టాడు. మరణంతో శత్రుత్వం సమసిపోయినట్లేననీ ఇప్పుడు నీ అన్న నీకెంతో నాకూ అంతే అని... దగ్గరుండి మరీ విభీషణుని చేత అంత్యక్రియలు జరిపించాడు. రావణుడు మనసు పడి కట్టించుకున్న కోటను యుద్ధం తర్వాత స్వాధీనం చేసుకోవాలని లక్ష్మణుడు భావించి అన్నతో చెప్పాడు. రావణ రాజసౌధం సామాన్యమైంది కాదు. అంతా మణిమయమే. ఎటు చూసినా బంగారమే. కానీ రాముడు ఏమాత్రం దురాశ పడలేదు. లంకానగరం విభీషణునికే దక్కుతుందని చెప్పి ఆయనకే పట్టం కట్టి శీలం చాటుకున్నాడు. అంతేకాదు ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ... లంకానగరం కన్నా, పుట్టి పెరిగిన అయోధ్యే నాకు మిన్న...’ అంటూ లక్ష్మణుని సలహాను సున్నితంగా తిరస్కరించాడు. అయోధ్యానగరానికి పట్టాభిషిక్తుడైన తర్వాత ప్రజలను కన్నబిడ్డల్లా పాలించాడు. ప్రజాభిప్రాయానికి విలువనిచ్చాడు. ఆయన పాలనలో రాజ్యం ఎంతో సుభిక్షంగా ఉంది. అందుకే రామరాజ్యం గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు.