
రజతాచలం పైని వనాంతర సీమలలో వసంతం నిండుగా కమ్ముకుని ఉంది. ఆ ప్రకృతి రామణీయకతలో ఒకచోట దాగి ఏకాంత క్షణాలను గడుపుతూ, ఆనందిస్తున్నారు శివపార్వతులు. వారి ఏకాంతాన్ని ఎవరూ భంగపరచకుండా నంది కాపు కాస్తున్నాడు. అలాఉండగా, అది రజతాచలమని, అక్కడ మదనారియైన శివుడు వసిస్తూ ఉంటాడనే ఆలోచన మరచి, ఆవసంత శోభను తాము కూడా ఆనందించి తరించాలనే ఉద్దేశంతో గంధర్వ గణాలు ఒక్కసారిగా వచ్చి గిరిపై పడ్డాయి. తమ అరుపులతో, కేరింతలతో ఆ వన ప్రాంతంలో అట్టహాసం చేయసాగాయి. ఆ శబ్దానికి ఉలిక్కిపడిన నంది, కోపగించి, వారిపై మాటల దూషణలతో విరుచుకుపడ్డాడు. ’అంధులా మీరు? లోకేశ్వరుడైన ఈశ్వరుడు, ఈశ్వరితో ఏకాంతంలో ఉండగా, ఇలా వచ్చి గోల చేయడం తగిన పనికాదు. ఆలస్యం చేయక, ఇక్కడి నుండి వెంటనే దూరంగా వెళ్ళిపొండి!’ అని మందలించాడు.
నంది మాటలను వారు లెక్క చేసే స్థితిలో లేరు. గంధర్వ గణాల ఆ స్థితిని ఆత్మలో ఎరిగిన శంకరుడు, ఉగ్రుడై చెంతనే పడివున్న గడ్డిపోచలను పిడికిట పట్టి ‘పిశా చాలుగా మారండని’ శపించి వారిపై విసిరాడు. కనువిందు చేసే అంద మైన రూపాలు కాస్తా అంతలోనే అంతరించిపోయి, రూపురేఖలు తప్పి వికటాంగులయ్యారు గంధర్వులు. ఆ సందర్భాన్ని తెనాలి రామకృష్ణకవి ఇలా వర్ణించాడు ఉద్భటారాధ్య చరిత్రలో.
కం. కొఱకును బోవం బడిక /ల్లుఱక పయింబడిన కరణి నొకపనికై రా
నుఱుమని పిడుగై వారికి /గఱకంఠుని చేత నీచగతి వాటిల్లెన్.
పక్షులు ఎఱను ఏరి తినడానికని వెళ్ళగా, ఇంతలో ఎక్కడి నుండి వచ్చిందో తెలియని పడికల్లు – తుపాకి గుండు – వేగంగా వచ్చి వెంటాడి మీద పడినట్లుగా, రజతాచలంపైని వసంత శోభను ఆనందించాలనే ఒక పని మీద రాగా, ఉరుము లేకుండానే మీద పడిన పిడుగు చందంగా,శంకరుడి శాపం తగిలి నీచ గతి ప్రాప్తించింది కదా అని గంధర్వ గణాలు బాధపడడం పై పద్యం భావం. ఏదైనా తప్పుతుందేమో కాని ఈశ్వరాజ్ఞ తప్పదు కదా!
– భట్టు వెంకటరావుఈశ్వరాజ్ఞ
Comments
Please login to add a commentAdd a comment