శ్రీమన్నారాయణుడు శ్రీరామచంద్రుడిగా భద్రాద్రి మీద కొలువై ఉంటాడు. నిజానికి వైకుంఠమే కొద్ది పాటి మార్పులతో భద్రాచల శిఖరం అయింది అంటాడు భక్తాగ్రేసరుడు భద్రాచల రామదాసు. అలాగే దక్షిణాది వైష్ణవులు శ్రీరంగ మహా క్షేత్రాన్ని వైకుంఠ ధామంగా భావిస్తారు. వాళ్లకు కావేరీ నదే విరజానది. ఆ విరజానదే ఈ కావేరి, శ్రీరంగనాథ ఆలయమే వైకుంఠం.
శ్రీహరి విరజా తీరంలో, దివ్య భోగాలతో ఇందిరా సహితుడిగా ఎలా శోభిల్లుతుంటాడో, అచ్చం అలాగే కావేరీ తీరంలో శ్రీరంగధాముడై సౌఖ్య శ్రీలతో చెన్నారుతుంటాడు, అంటుంది శ్రీరంగ మహాత్మ్య కావ్యం. విరజ అనే పౌరాణిక నాయిక బ్రహ్మకైవర్త పురాణంలో కనిపిస్తుంది. ఈమె అతిలోక సౌందర్యవతి. రాధాకృష్ణులు నివసించే గోలోకంలోనే ఈమె నివాసం కూడా. ఈమె కూడా తన మధుర భక్తితో రాధా వల్లభు డిని వలచి, వలపించుకొన్న ధన్యురాలు.
ఒకానొక సమయంలో శ్రీకృష్ణుడు విరజా దేవితో విహరిస్తుండగా, రాధాదేవి కంటబడతాడు. రాధాదేవి కోపించి, విరజను నదిగా మారిపొమ్మని శపిస్తుంది. నదీ రూపం పొందినా, విరజ వైకుంఠాన్ని తన తీరంలో కలుపుకొని, వైకుంఠుడయిన నారాయణుడితో సాన్ని హిత్యాన్ని కొనసాగిస్తూ ఆయనను సేవిస్తూనే ఉంది. విరజకు శ్రీహరి ద్వారా ఏడుగురు పుత్రులు కలిగారు. కానీ ఆ బిడ్డల ఆలనా, పాలనా, పోషణ తనను శ్రీకృష్ణ సాంగత్యానికి దూరం చేస్తున్నాయన్న వేదనతో, ఆమె తన సంతానాన్నే సప్త సముద్రాలుగా మార్చి వేసిందట.
‘అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టు. అమా యకులైన పిల్లలనెందుకమ్మా అలా శపించావు?’ అని ప్రశ్నించాడట వైకుంఠంలో శ్రీహరి ఆంతరంగిక సేవ కులలో ఒకడైన సుదాముడు. దాంతో, విరజ ఆయన మీద కూడా కోపించి ‘నువ్వు రాక్షసుడిగా పుడతావు!’ అని శపించిందట. ఫలితంగా సుదాముడే శంఖ చూడుడనే రాక్షసుడిగా పుట్టాడు.
పురాణ కథలు ప్రతీకాత్మకమైన పాత్రల ద్వారా, కథల ద్వారా ధర్మాన్ని, సన్మార్గాన్నీ బోధించుతాయి. ఈ కోణం నుంచి చూస్తే విరజా నది అంటే రజం లేనిది. రజం అంటే దుమ్మూ, ధూళీ, మాలిన్యం, కాలుష్యం. కాలుష్యం లేని పరిశుద్ధమైన, పావనమైన నది విరజా నది. కల్మషమూ, కాలుష్యమూ లేని శుద్ధ త్వాన్నీ, పవిత్రతనూ భగవంతుడైన శ్రీహరి అభిమా నిస్తాడు. కనుక ఆయన నివాసం విరజా నదీ తీరంలో. కల్మషం లేని, పరిశుద్ధతగల విరజమైన పరిసరాల లోనూ, అంతఃకరణాలలోనూ భగవంతుడు నెలవై ఉంటాడు.
– ఎం. మారుతిశాస్త్రి
Comments
Please login to add a commentAdd a comment