విలువల కోసం కడదాకా ఆరాటం | Guest Column By Venu Gopal Over Remembering Of Kondapalli Koteshwaramma | Sakshi
Sakshi News home page

విలువల కోసం కడదాకా ఆరాటం

Published Fri, Sep 21 2018 2:17 AM | Last Updated on Fri, Sep 21 2018 5:06 AM

Guest Column By Venu Gopal Over Remembering Of Kondapalli Koteshwaramma - Sakshi

కొండపల్లి కోటేశ్వరమ్మ

సరిగ్గా ఆరువారాల కింద ఆగస్టు 5 సాయంకాలం విశాఖ సముద్రతీరంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో కొండపల్లి కోటేశ్వరమ్మ వందేళ్ల పుట్టినరోజు పండుగ జరి గింది. తెలుగుసీమ నలుమూలల నుంచీ వచ్చిన మూడు నాలుగు వందల మంది విభిన్న రాజకీయ, సామాజిక అభిప్రాయాలున్న స్నేహితులను ఉద్దేశించి కోటేశ్వరమ్మ ఒక అద్భుతమైన ఉపన్యాసం చేశారు. ఆ వయసులో సాధారణంగా గళంలో వినిపించే వణుకు, తడబాటు కూడా లేకుండా ఆమె చేసిన ఆ క్లుప్త ఉపన్యాసం సమాజానికి ఆమె ఇచ్చిన చివరి బహిరంగ సందేశం కావచ్చు. నిజానికి తుది శ్వాస విడవడానికి వారం ముందు కూడ రాజ్య నిర్బంధానికి వ్యతిరేకంగా విశాఖలో జరిగిన ఒక నిరసన ప్రదర్శన ఎట్లా జరిగిందనీ, రావలసినవారందరూ వచ్చారా, అందరినీ పిలి చారా అనీ వాకబు చేశారంటే ఆమె చివరిదాకా పడిన తపన, హృదయంలో నింపుకున్న ఆదర్శాలు అర్థమవుతాయి. 

సమాజం కోసం పనిచేయడం, అన్నివర్గాల అణగారిన ప్రజల బాగుగురించి ఆలోచించడం, వ్యక్తిగత సమస్యలను పక్కనపెట్టి సమాజ సమస్యల గురించి ఆలోచించడం వంటి ఆదర్శాలవి. 20వ శతాబ్ది తొలి దశకాలలో జాతీయోద్యమం, కమ్యూనిస్టు ఉద్యమం ప్రేరేపించిన విలువలవి. వాటిని సంపూర్ణంగా తనలో జీర్ణం చేసుకున్న వ్యక్తి కోటేశ్వరమ్మ. ఆ తపన, ఆదర్శాలు, విలువలు ఏదో ఒక సందర్భంలో ఏర్పడి ఆ సందర్భం ముగిసిపోగానే లుప్తమైనవి కాకపోవడమే కోటేశ్వరమ్మ ప్రత్యేకత. ఆ విలువలు తొలి యవ్వనంలో 1930ల చివర జాతీయోద్యమ ప్రభావంలోకి వచ్చినప్పుడు ప్రారంభమై, ప్రజానాట్యమండలి, కమ్యూనిస్టు పార్టీల మీదుగా ఈ బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచేవరకూ ఎని మిది దశాబ్దాలపైన నిరంతరంగా కొనసాగాయి.

ఈ సుదీర్ఘ జీవితంలో కళాకారిణిగా, గాయకురాలిగా, అజ్ఞాత కార్యకర్తగా, కవిగా, కథారచయితగా, వార్డెన్‌గా, తల్లిగా, అమ్మమ్మగా ఆమె గడిపిన బహిరంగ ప్రజాజీవితం ఎంత ఉద్వేగభరితంగా గడిచిందో, బాల్య వితంతువుగా, సహచరుడితో విభేదాలు వచ్చిన భార్యగా, పిల్ల లకు దూరంగా ఒంటరిగా గడపవలసి వచ్చిన తల్లిగా ఆమె వ్యక్తిగత జీవితం అంత దుఃఖభరితంగా సాగింది. అటు ఉద్వేగభరితమైన సామాజిక జీవితాన్నైనా, ఇటు కష్టభరితమైన వ్యక్తిగత జీవితాన్నైనా స్థితప్రజ్ఞతతో గ్రహించి ఎన్నడూ తన విలువలను, ఆదర్శాలను వదులుకోకుండా జీవించడమే ఆమె సమాజానికి ఇచ్చిన సందేశం. 
అలా కష్టాల కొలిమిలో పదునుదేరిన విశిష్ట వ్యక్తిత్వం గనుకనే ఆమె నిలువెల్లా కరుణ గల మనిషి అయింది. తన కన్నబిడ్డ కరుణ చనిపోయినా, వ్యక్తిమాత్రమైన కరుణ కోసం దుఃఖిస్తూనే సమాజానికి అవసరమైన గుణంగా కరుణ బతకాలి అని కోరుకుంది.

చివరి ఉపన్యాసంలో కూడా కరుణ బతకడమంటే, కరుణను బతికించడమంటే హెచ్చుతగ్గులు, కుల అసమానతలు, విభేదాలు లేకుండా, సమసమాజ నిర్మాణంకోసం పనిచేయడమే అని నిర్వచించింది. అలాగే చివరి చూపు కూడ దక్కని తన కన్నబిడ్డ చందు కోసం దుఃఖిస్తూనే, నా కొడుకు చేసిన త్యాగం చేయమని చెప్పను గానీ, చచ్చిపోయేంతవరకు దేశానికి ఉపకారం చేసే, స్నేహభావాన్ని కనబరచే, మంచిపనులు చేసే మంచి మనుషులు కావాలి అని చెప్పింది. ఆస్తినీ, భర్తనూ, పిల్లలనూ కోల్పోయినప్పటికీ తాను ఆశావాదం కోల్పోలేదని చెప్పింది. ఒక సమసమాజ నిర్మాణం కోసం, ఆ భవిష్యత్తుకూ వర్తమానానికీ ఉన్న దూరాన్ని దగ్గర చేయడం కోసం యువకులు వస్తారనీ, రావాలనీ, ఆ ఆశతోనే తాను జీవిస్తున్నాననీ చెప్పింది. 

కరుణతో కొనసాగాలంటే, ఆశను కొడిగట్టిపోకుండా నిలుపుకోవాలంటే అపారమైన త్యాగాలు అవసరమని కూడా తనకు తెలుసు. తనకు నాయకులుగా, గురువులుగా, మార్గదర్శులుగా ఉండిన చండ్ర రాజేశ్వర రావు, పుచ్చలపల్లి సుందరయ్యల త్యాగనిరతిని సన్నిహితంగా చూసింది గనుక ఆ మహనీయుల త్యాగాన్ని కొనసాగించాలనే స్ఫూర్తిని మొన్నటి ఉపన్యాసంలో కూడ ప్రకటించింది. వారిలాగ దేశాన్ని బాగు చేసేవాళ్లు మళ్లీ వస్తారు అనే ఆశాభావాన్ని ప్రకటించింది. ఆమె రూపొందిన క్రమంలో ఏర్పడిన, ఇవాళ మరింత ఎక్కువ ప్రాసంగికంగా మారిన ఒక విలువ గురించి చివరి ఉపన్యాసంలోనూ ప్రస్తావించారని గుర్తిస్తే ఆమె హృదయం ఎక్కడుందో అర్థమవుతుంది. ఆ ఉపన్యాసంలో ఆమె చండ్ర రాజేశ్వర రావు గురించి చెపుతూ బెజవాడలో రౌడీల సమస్య లేకుండా చేశారు అన్నారు. ఆమె నవయవ్వనంలో ఉన్నప్పుడు బెజవాడలో ఉండిన ఆ రౌడీల సమస్య ప్రధానంగా సంఘ్‌ పరివార్‌ సమస్య.

వారిని భావజాలపరంగా ప్రతిఘటించడానికి గాంధీ హత్యకు ఏడాది ముందే చండ్ర రాజేశ్వరరావుగారు పుస్తకం రాశారు. గాంధీ హత్యకు ముందూ వెనుక పెచ్చరిల్లిన ఆ రౌడీమూకలను అరికట్టడానికి లాఠీలు పట్టుకుని భౌతిక ఘర్షణకు కూడ దిగే కార్యకర్తలను తయారు చేశారు. ఆ అవసరం మళ్లీ పెరుగుతున్న సందర్భంలో ఉన్న మనం ఆ పసిడి రెక్కలు విసిరి కాలం పారిపోయిన జాడలను కనిపెట్టవలసి ఉంది. త్యాగాల పునాదులతో నిర్మాణమైన విలువల జీవితాలలో అత్యంత ఆదర్శప్రాయమైన కోటేశ్వరమ్మ జీవితాన్ని, ఆమె స్వప్నాలను, అర్థంతరంగా ఆగిపోయిన ఆమె ఆకాంక్షలను మరొక్కసారి మననం చేసుకోవలసి ఉంది. ఆ విలువలు జీవించినంతకాలం కోటేశ్వరమ్మ సజీవంగానే ఉంటారు. అవి ఉదాత్తమైన, మానవజాతి లక్ష్యంగా నిర్వచించుకున్న విలువలు గనుక వాటికెప్పుడూ మరణం లేదు. అంటే కొండపల్లి కోటేశ్వరమ్మకూ మరణం లేదు. 

వ్యాసకర్త
ఎన్‌. వేణుగోపాల్‌
వీక్షణం సంపాదకులు ‘ 98485 77028 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement