30 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు
2016-17 ఖరీఫ్, రబీ ఉత్పత్తి లక్ష్యాలను ఖరారు చేసిన కేంద్రం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఖరీఫ్, రబీ ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యాన్ని ప్రకటించింది. ఈసారి రుతు పవనాలు ఆశాజనకంగా ఉంటాయన్న భారత వాతావరణ శాస్త్రవేత్తల అంచనాల మేరకు లక్ష్యాలను నిర్దేశించింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో రెండేళ్లుగా కరువు పరిస్థితులు నెలకొనడంతో పంటలు ఎండిపోయాయి. ఆహారధాన్యాల దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. అయితే, ఈసారి వరి, గోధుమ, పప్పుధాన్యాల దిగుబడులు మరింత పెంచాలని తాజా గా రాష్ట్రాలకు సూచించింది. 2016-17 ఖరీఫ్, రబీ సీజన్ ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 30.55 కోట్ల టన్నులుగా ప్రకటించింది. అందుకు తగ్గట్లుగా చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
వరి ఉత్పత్తి లక్ష్యం 14.35 కోట్ల టన్నులు
దేశవ్యాప్తంగా వరి పంటనే అధికంగా సాగు చేస్తారు. గతేడాది వరి ఉత్పత్తి లక్ష్యం 13.98 కోట్ల టన్నులుండగా ఈసారి 14.35 కోట్ల టన్నులు పండించాలని కేంద్ర వ్యవసాయశాఖ రాష్ట్రాలను ఆదేశించింది. ఖరీఫ్‌లో 12.36 కోట్ల టన్నులు, రబీలో 1.99 కోట్ల టన్నుల వరి ధాన్యం పండించాలని సూచించింది. వరి తర్వాత దేశంలో అధికంగా సాగయ్యే గోధుమ ఉత్పత్తి లక్ష్యం రబీలో 9.65 కోట్లుగా నిర్ధారించింది. 60 లక్షల టన్నుల జొన్నలను పండించాలని సూచించింది. దేశంలో పప్పుధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పడిపోతుండడంపై కేంద్ర వ్యవసాయ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటీవల భోపాల్‌లో జరిగిన పప్పుధాన్యాల సాగు సదస్సులో కంది విస్తీర్ణాన్ని మరింత పెంచి ఉత్పత్తి పెంచాలని నిర్దేశించిన సంగతి తెలిసిందే.
దాని ప్రకారం వచ్చే సీజన్‌లో అన్ని రకాల పప్పుధాన్యాలను 2.07 కోట్ల టన్నుల మేరకు ఉత్పత్తి చేయాలని రాష్ట్రాలను కోరింది. గతేడాది కంటే 14 లక్షల టన్నులు అధికంగా పండించాలని సూచించింది. తెలంగాణలో ఐదేళ్ల క్రితం పప్పుధాన్యాల ఉత్పత్తి 4.74 లక్షల మెట్రిక్ టన్నులుండగా, ఈ ఏడాది 2.50 లక్షల మెట్రిక్ టన్నులకు పడిపోయింది. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్‌లో కంది సాగు విస్తీర్ణాన్ని 10 శాతం వరకు పెంచాలని రాష్ట్ర వ్యవసాయశాఖ నిర్ణయించింది. చెరకు 35.50 కోట్ల టన్నులు, నూనెగింజల ఉత్పత్తి లక్ష్యం 3.5 కోట్లుగా కేంద్రం నిర్ధారించింది. పత్తి సాగు తగ్గించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించినా కేంద్రం మాత్రం గతం కంటే 10 లక్షల బేళ్లు అధికంగా లక్ష్యాన్ని నిర్ణయించింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 3.6 కోట్ల బేళ్లు ఉత్పత్తి చేయాలని ఆదేశించింది.