ఏపీ సీడ్స్ గోదాముల్లో పంపిణీకి సిద్ధంగా ఉన్న వేరుశనగ
అనంతపురం (అగ్రికల్చర్): వేరుశనగ రైతులకు ఖరీఫ్ వేరుశనగ విత్తనాలను ఈ నెల 17 నుంచి రాయితీపై పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అనంతపురం జిల్లాలో ప్రధాన పంట వేరుశనగ కావడంతో 2.90 లక్షల క్వింటాళ్ల విత్తనాలను కేటాయించారు. కర్నూలు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలకు 1.60 లక్షల క్వింటాళ్లు వెరసి 4.50 లక్షల క్వింటాళ్ల పంపిణీకి ప్రణాళిక రూపొందించారు. క్వింటాల్ విత్తనాల ధర రూ.8,680గా నిర్ణయించగా.. అందులో 40 శాతం అంటే రూ.3,472 రాయితీ ఇస్తున్నారు. రైతులకు క్వింటా విత్తనాలను రూ.5,208కే అందజేస్తారు. సోమవారం నుంచి రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు అవసరమైన రైతుల రిజి్రస్టేషన్ మొదలు పెట్టారు. ఈ నెల 17 నుంచి వేరుశనగ పంపిణీ చేపట్టనున్నారు.
ముందుగానే మద్దతు ధర ప్రకటించడంతో..
రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరిలోనే వేరుశనగకు మద్దతు ధర ప్రకటించడంతో రైతులకు గిట్టుబాటు అయింది. అనంతపురం జిల్లాలో ఏపీ సీడ్స్ ఎండీ శేఖర్‌బాబు, వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ వేర్వేరుగా రెండు మూడు రోజులు పర్యటించి వేరుశనగ సేకరణకు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అనంతపురం జిల్లాలో 2.90 లక్షల క్వింటాళ్లు పంపిణీ చేయాలని నిర్ణయించి.. రూ.193 కోట్ల వరకు వెచ్చించి 20వేల మంది రైతుల నుంచి 3 లక్షల క్వింటాళ్లకు పైగా కొనుగోలు చేశారు. చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల పరిధిలో కూడా ఇదేవిధంగా సేకరించి విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 17నుంచి మూడు విడతలుగా విత్తనాలు పంపిణీ చేసేలా మండలాల వారీగా షెడ్యూల్ ప్రకటించారు.
‘అనంత’లో 4.70 లక్షలహెక్టార్లలో సాగు
అనంతపురం జిల్లాలో ఈ ఖరీఫ్‌లో 4.70 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగు అవుతుందని అంచనా వేశాం. అందుకోసం రైతులకు 40 శాతం రాయితీపై 2.90 లక్షల క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేశాం. కరోనా నేపథ్యంలో రైతులు, అధికారులు ఇబ్బంది పడకుండా మూడు దశల్లో సాఫీగా పూర్తి చేయడానికి కార్యాచరణ సిద్ధం చేశాం. ఆర్‌బీకే వేదికగా విత్తనం కోసం రిజి్రస్టేషన్ చేసుకున్న రైతులకు గ్రామాల్లోనే పంపిణీ చేస్తాం. విత్తనాలు తీసుకున్న రైతులు తప్పనిసరిగా పంట సాగు చేసి ఈ–క్రాప్‌లో నమోదు చేసుకుంటేనే ప్రభుత్వ రాయితీలు, ప్రయోజనాలు వర్తిస్తాయి.
– వై.రామకృష్ణ, జాయింట్ డైరెక్టర్, వ్యవసాయ శాఖ
Comments
Please login to add a commentAdd a comment