ఆహారధాన్యాల సాగు 10 శాతం
* పప్పుధాన్యాల సాగు 22%
* ఖరీఫ్‌పై వ్యవసాయశాఖ తాజా నివేదిక వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్‌లో ఇప్పటివరకు అయిన పంటల సాగుపై వ్యవసాయ శాఖ నివేదిక విడుదల చేసింది. ఇటీవల కురిసిన వర్షాలకు రైతన్న దుక్కులు దున్ని విత్తులు చల్లాడు. సోమవారం సాయంత్రానికి రాష్ట్రంలో మొత్తం 11 శాతం పంటలు సాగయ్యాయి. అందులో ఆహారధాన్యాల సాగు 10 శాతం ఉంది. ఈ విషయంపై వ్యవసాయశాఖ మొదటిసారిగా ఒక నివేదిక విడుదల చేసింది.
48.11 లక్షల ఎకరాల్లో ఆహారధాన్యాల సాగు జరగాల్సి ఉండగా ఇప్పటివరకు 4.66 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయని తెలిపింది. అందులో పప్పుధాన్యాల సాగు 2.19 లక్షల ఎకరాల్లో (22%), పత్తి 5.18 లక్షలు, సోయాబీన్ 1.03 లక్షల ఎకరాల్లో విత్తనాలు చల్లారు. వరి 22,230 ఎకరాల్లో (ఒక శాతం) విస్తీర్ణంలో నాట్లు పడ్డాయి. పత్తికి ప్రత్యామ్నాయంగా సోయాబీన్ విత్తనాలు చల్లాలని ప్రభుత్వం ఎంత మొత్తుకున్నా రైతులు మాత్రం పత్తి సాగుపై మక్కువ వదలలేదని ఈ గణాంకాలు చెబుతున్నాయి.
15 మీటర్ల లోతుల్లోకి భూగర్భ జలాలు
రాష్ట్రంలో భూగర్భ జలాలు 15.62 మీటర్ల లోతుల్లోకి పడిపోయాయని వ్యవసాయ శాఖ వెల్లడించింది. గత ఏడాది మే నెలతో పోలిస్తే ఈ ఏడాది మే నెలలో 2.35 మీటర్ల అదనపు లోతుల్లోకి భూగర్భ జలాలు పడిపోయాయి. అత్యధికంగా మెదక్ జిల్లాలో గత ఏడాది మే నెలతో పోలిస్తే ఈ ఏడాది మే నెలలో 5.47 మీటర్ల అదనపు లోతుల్లోకి భూగర్భ జలాలు అడుగంటాయి. నిజామాబాద్ జిల్లాలో 5.08 మీటర్ల అదనపు లోతుల్లోకి కూరుకుపోయాయి.