నా వయసు 34 ఏళ్లు. వివాహమై ఎనిమిదేళ్లు అయ్యింది. ఇంతవరకు సంతానం లేదు. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని వైద్యపరీక్షలు చేసి ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ అని చెప్పారు. ఇన్‌ఫెర్టిలిటీ అంటే ఏమిటి? దానికి కారణాలు ఏమిటి?
హోమియోలో నా సమస్యకు శాశ్వత పరిష్కారం ఉందా? ఇటీవల చాలామందిలో సంతానలేమి సమస్య కనిపిస్తోంది. దీనికి అనేక అంశాలు కారణమవుతాయి. సమస్య మహిళల్లో లేదా పురుషుల్లో ఉండవచ్చు.
స్త్రీలలో సాధారణంగా కనిపించే కారణాలు : ∙జన్యుసంబంధిత లోపాలు ∙థైరాయిడ్ సమస్యలు ∙అండాశయంలో లోపాలు; నీటిబుడగలు ∙గర్భాశయంలో సమస్యలు ∙ఫెలోపియన్ ట్యూబ్స్‌లో వచ్చే సమస్యలు ∙డయాబెటిస్ ∙గర్భనిరోధక మాత్రలు అధికంగా వాడటం.
పురుషుల్లో సాధారణంగా కనిపించే కారణాలు : ∙హార్మోన్ సంబంధిత సమస్యలు ∙థైరాయిడ్ ∙పొగతాగడం ∙శుక్రకణాల సంఖ్య తగ్గిపోవడం
సంతానలేమిలో రకాలు : ∙ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ ∙సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ
ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ : అసలు సంతానం కలగకపోవడాన్ని ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ అంటారు. ఇది ముఖ్యంగా జన్యుసంబంధిత లోపాలు, హార్మోన్ సంబంధిత లోపాల వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది.
సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ : మొదటి సంతానం కలిగిన తర్వాత లేదా అబార్షన్ అయిన తర్వాత మళ్లీ సంతానం కలగకపోవడాన్ని సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ అంటారు. ఇది ముఖ్యంగా గర్భాశయంలో ఏమైనా లోపాలు ఏర్పడటం, ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల సంభవిస్తుంది.
గుర్తించడం ఎలా : తగిన వైద్యపరీక్షల ద్వారా సమస్యను నిర్ధారణ చేస్తారు. ముఖ్యంగా థైరాయిడ్ ప్రొఫైల్, సాల్ఫింజోగ్రఫీ, అల్ట్రాసోనోగ్రఫీ, ఫాలిక్యులార్ స్టడీ వంటి టెస్ట్‌లు చేస్తారు.
చికిత్స: హోమియోలో ఎలాంటి సమస్యలకైనా కాన్‌స్టిట్యూషనల్ పద్ధతిలో వ్యక్తి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. మీ సమస్యను పరిష్కరించేందుకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి.
డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ
పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్
అప్పుడు వచ్చిన పైల్స్... ఇంకా బాధిస్తున్నాయి!
నా వయసు 29 ఏళ్లు. నాకు గర్భధారణ సమయంలో పైల్స్ సమస్య మొదలైంది. ఎన్ని మందులు వాడినా సమస్య తరచూ వస్తూనే ఉంది. దాంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. దయచేసి నా సమస్య హోమియోతో నయమయ్యే అవకాశం ఉందా? తగిన సలహా ఇవ్వగలరు.
గర్భధారణ సమయంలో కొన్ని హార్మోన్ల కారణంగా రక్తనాళాలు రిలాక్స్ అవుతాయి. దాంతో కొంతమంది మహిళల్లో పైల్స్ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. పైల్స్ సమస్యలో మలద్వారం దగ్గర ఉండే రక్తనాళాలు ఉబ్బిపోయి, వాపు రావడం జరుగుతుంది. తీవ్రమైన నొప్పి, రక్తస్రావం కూడా అవుతాయి.
కారణాలు: దీర్ఘకాలికంగా మలబద్ధకం, పొత్తికడుపు ఎక్కువ కాలం ఒత్తిడికి గురికావడం, దీర్ఘకాలిక దగ్గు, గర్భధారణ సమయంలో కాలేయ సంబంధిత వ్యాధుల వల్ల పైల్స్ వచ్చే అవకాశం ఉంది. పైన పేర్కొన్న కారణాలతో మలద్వారం వద్ద ఉండే రక్తనాళాలపై దీర్ఘకాలికంగా ఒత్తిడి ఏర్పడుతుంది. వాటిలో రక్తం నిల్వ ఉండటం వల్ల మలవిసర్జన సమయంలో మలద్వారం దగ్గర ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా తీవ్రమైన నొప్పి వస్తూ, రక్తనాళాలు చిట్లి, రక్తస్రావం అవుతుంది. పైల్స్‌లో రకాలు ఉంటాయి. అవి... 1. ఇంటర్నల్ పైల్స్ 2. ఎక్స్‌టర్నల్ పైల్స్.
మలద్వారం వద్ద ఏర్పడే సమస్యల్లో పైల్స్ మాత్రమే గాక ఫిషర్, ఫిస్టులా వంటి ఇతర సమస్యలను కూడా మనం గమనించవచ్చు.
ఫిషర్స్ : మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను యానల్ ఫిషర్ అంటారు. ఈ చీలిక వల్ల ఆ ప్రాంతంలో ఉండే కండర కణజాలం బహిర్గతం కావడం వల్ల అది మలవిసర్జన సమయంలోగానీ, మలవిసర్జన అనంతరం గానీ తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. రక్తస్రావం కూడా అవుతుంది.
ఫిస్టులా: మలద్వారం వద్ద రెండు ఎపిథీలియల్ కణజాలాల మధ్య భాగంలో ఒక గొట్టం లాంటి నిర్మాణాన్ని ఫిస్టులా అంటారు. ఇది శరీరంలో ఎక్కడైనా ఏర్పడవచ్చు. కానీ మలద్వారం వద్ద యానల్ ఫిషర్ ఏర్పడటం సర్వసాధారణం. మలద్వారం పక్కన ముందుగా చిన్న మొటిమలాగా ఏర్పడి నొప్పి, వాపుతో రెండు రోజులలో పగిలి చీమును వెలువరిస్తుంది. దీని తీవ్రతను బట్టి తరచూ తిరగబెడుతుంటుంది. సాధారణ జీవనానికి అడ్డంకిగా నిలుస్తూ తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తుంది. ఆపరేషన్ చేసినా, 90 శాతం మందిలో మళ్లీ మళ్లీ తిరగబెడుతుంటుంది.
చికిత్స: జెనెటిక్ కాన్‌స్టిట్యూషన్ చికిత్స విధానం ద్వారా పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా సమస్యలను హోమియో వైద్యంతో పూర్తిగా నయం చేయవచ్చు. అంతేకాదు... మళ్లీ తిరగబెట్టకుండా సంపూర్ణమైన చికిత్స అందించవచ్చు.
డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్,
సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్
సోరియాసిస్ తగ్గుతుందా?
నా వయసు 38 ఏళ్లు. గత పదేళ్ల నుంచి సోరియాసిస్‌తో బాధపడుతున్నాను. ఎన్ని పూతమందులు, మందులు వాడినా సమస్య పూర్తిగా తగ్గడం లేదు. మళ్లీ మళ్లీ వస్తోంది. దీనికి హోమియోపతిలో చికిత్స ఉందా?
సోరియాసిస్ చాలామందిని బాధపెడుతున్న సమస్య. ప్రపంచ జనాభాలో దాదాపు మూడు శాతం మంది స్త్రీ, పురుషులు దీనితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి ఏ వయసులోనైనా వచ్చే అవకాశం ఉంది. చాలామంది దీన్ని కేవలం చర్మసమస్యగా భావిస్తారు. కానీ ఇది దీర్ఘకాలిక ఆటో ఇమ్యూన్ సమస్య. అంటే మన రోగనిరోధక శక్తి మనకు ప్రతికూలంగా పరిణమించడం వల్ల వచ్చే సమస్య అన్నమాట. ఇందులో చర్మకణాలు అత్యంత వేగంగా వృద్ధిచెందడంతో పాటు ఆ కణాలు అనేక పొరలుగా ఏర్పడతాయి.
ఇలా పొరలుగా ఏర్పడటం వల్ల అక్కడ వెండి రంగు పొలుసులుగా రాలిపోతుంటాయి. తర్వాత చర్మంపై రక్తంతో కూడిన చిన్న చిన్న దద్దుర్ల వంటివి ఏర్పడతాయి. దురద కూడా ఎక్కువగా ఉంటూ చిరాకు పెడుతుంది. సోరియాసిస్ వ్యాధి ఎక్కువగా మోచేతులు, మోకాళ్లు, తల, వీపు, అరచేతులు, అరికాళ్లు, ఉదరం, మెడ, నుదురు, చెవులు మొదలైన ప్రాంతాల్లో వ్యాపిస్తుంది. సోరియాసిస్‌తో బాధపడుతున్న 15 శాతం మందిలో ఆర్థరైటిస్ లక్షణాలు కూడా కనిపిస్తాయి. దీనినే ‘సోరియాటిక్ ఆర్థరైటిస్’ అంటారు.
కారణాలు : ∙వంశపారంపర్యం ∙మానసిక ఒత్తిడి, ఆందోళన ∙శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో ఏర్పడే అస్తవ్యస్తత ∙దీర్ఘకాలికంగా కొన్ని రకాల మందులు ఎక్కువగా వాడటం.
లక్షణాలు : ∙చర్మం ఎర్రబారడం ∙తీవ్రమైన దురద ∙జుట్టు రాలిపోవడం ∙కీళ్లనొప్పులు ∙చర్మం పొడిబారినప్పుడు చర్మంపై పగుళ్లు ఏర్పడి రక్తస్రావం కూడా అవుతుంది.
నిర్ధారణ పరీక్షలు : స్కిన్ బయాప్సీ, ఈఎస్‌ఆర్, సీబీపీ, ఎక్స్–రే పరీక్షలు.
చికిత్స: సోరియాసిస్ నివారణ/చికిత్సలకు హోమియో ఎంతగానో సహాయపడుతుంది. ఈ వ్యాధి విషయంలో వెంటనే దీన్ని గుర్తించి చికిత్స తీసుకోవడం అవసరం. లక్షణాలను బట్టి సోరియాసిస్‌కు సాధారణంగా ఆర్సినికం ఆల్బమ్, సల్ఫర్, కాలీకార్బ్, సొరినమ్, పెట్రోలియం మొదలైన మందులతో చికిత్స చేస్తారు. అయితే ఈ మందులను అనుభవజ్ఞులైన హోమియో
వైద్యుల పర్యవేక్షణలో వాడాలి.
డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో),
స్టార్ హోమియోపతి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment