నాకు సంతానం కలిగే అవకాశం ఉందా?
నా వయసు 34 ఏళ్లు. వివాహమై తొమ్మిదేళ్లు అయ్యింది. ఇంతవరకు సంతానం లేదు. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని వైద్య పరీక్షలు చేసి ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ అని చెప్పారు. ఇన్‌ఫెర్టిలిటీ అంటే ఏమిటి? దానికి కారణాలు ఏమిటి? హోమియోలో నా సమస్యకు శాశ్వత పరిష్కారం ఉందా?
ఇటీవల చాలా మందిలో సంతానలేమి సమస్య కనిపిస్తోంది. దీనికి అనేక అంశాలు కారణమవుతాయి. సమస్య మహిళల్లో లేదా పురుషుల్లో ఉండవచ్చు.
స్త్రీలలో సాధారణంగా కనిపించే కారణాలు: ∙జన్యుసంబంధిత లోపాలు థైరాయిడ్ సమస్యలు అండాశయంలో లోపాలు నీటిబుడగలు గర్భాశయంలో సమస్యలు ఫెలోపియన్ ట్యూబ్స్‌లో వచ్చే సమస్యలు ∙డయాబెటిస్ గర్భనిరోధక మాత్రలు అధికంగా వాడటం.
పురుషుల్లో సాధారణంగా కనిపించే కారణాలు: హార్మోన్ సంబంధిత సమస్యలు ∙థైరాయిడ్ పొగతాగడం ∙శుక్రకణాల సంఖ్య తగ్గిపోవడం
సంతానలేమిలో రకాలు: ∙ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ
ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ: అసలు సంతానం కలగకపోవడాన్ని ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ అంటారు. ఇది ముఖ్యంగా జన్యుసంబంధిత లోపాలు, హార్మోన్ సంబంధిత లోపాల వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది.
సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ: మొదటి సంతానం కలిగిన తర్వాత లేదా అబార్షన్ అయిన తర్వాత మళ్లీ సంతానం కలగకపోవడాన్ని సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ అంటారు. ఇది ముఖ్యంగా గర్భాశయంలో ఏమైనా లోపాలు ఏర్పడటం, ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల సంభవిస్తుంది.
గుర్తించడం ఎలా: తగిన వైద్య పరీక్షల ద్వారా సమస్యను నిర్ధారణ చేస్తారు. ముఖ్యంగా థైరాయిడ్ ప్రొఫైల్, సాల్ఫింజోగ్రఫీ, అల్ట్రాసోనోగ్రఫీ, ఫాలిక్యులార్ స్టడీ వంటి టెస్ట్‌లు చేస్తారు.
చికిత్స: హోమియోలో ఎలాంటి సమస్యలకైనా కాన్‌స్టిట్యూషనల్ పద్ధతిలో వ్యక్తి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. మీ సమస్యను పరిష్కరించేందుకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి.
డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ,
పాజిటివ్ హోమియోపతి
పీసీవోడీ నయమవుతుందా?
నా భార్య వయసు 36 ఏళ్లు. ఇటీవల ఆమె శరీరంపై వెంట్రుకలు ఎక్కువగా పెరుగుతుంటే డాక్టర్‌కు చూపించాం. ఆమె పీసీఓడీతో బాధపడుతున్నట్లు చెప్పారు. దీనికి హోమియోలో చికిత్స ఉందా?
రుతుక్రమం సవ్యంగా ఉన్న మహిళల్లో నెలసరి అయిన 11–18 రోజుల మధ్యకాలంలో వాళ్లలోని రెండు అండాశయల్లోని ఏదో ఒకదాని నుంచి అండం విడుదల అవుతుంది. అలా జరగకుండా అపరిపక్వమైన అండాలు వెలువడి అవి నీటిబుడగల్లా అండాశయపు గోడలపై ఉండిపోయే కండిషన్‌ను పీసీవోడీ (పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్) అంటారు. ఇవి రెండువైపులా ఉంటే ‘బైలేటరల్ పీసీఓడీ’ అంటారు. ఈ సమస్యకు కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ జన్యుపరమైన అంశాలు ఒక కారణంగా భావిస్తున్నారు. అంతేగాక ఎఫ్‌ఎస్‌హెచ్, ఎల్‌హెచ్, ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ హార్మోన్ల అసమతౌల్యత వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు. సరైన జీవనశైలి పాటించనివారిలోనూ ఇది ఎక్కువ.
లక్షణాలు: నెలసరి సరిగా రాకపోవడం, వచ్చినా అండాశయం నుంచి అండం విడుదల కాకపోవడం, రుతుస్రావం సమయంలో ఎక్కువ రక్తంపోవడం, రెండు రుతుక్రమాల మధ్యకాలంలో రక్తస్రావం కావడం, నెలసరి వచ్చే సమయంలో కడుపులో బాగా నొప్పిరావడం, నెలసరి రాకపోవడం, బరువు పెరగడం, తలవెంట్రుకలు రాలిపోతుండటం, ముఖం, వీపు, శరీరంపై మొటిమలు రావడం, ముఖం, ఛాతీపైన మగవారిలా వెంట్రుకలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల సంతానకలగకపోవడం, స్థూలకాయం, డయాబెటిస్, కొందరిలో చాలా అరుదుగా హృద్రోగ సమస్యలు రావచ్చు. రోగిని భౌతిక లక్షణాలతో పాటు అల్ట్రాసౌండ్ స్కాన్, హెచ్‌సీజీ, టెస్టోస్టెరాన్, ఆండ్రోజెన్, ప్రోలాక్టిన్ మొదలైన హార్మోన్ల పరీక్షలు, రక్తంలో చక్కెరపాళ్లు, కొలెస్ట్రాల్ శాతం వంటి పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. హోమియో విధానంలో సరైన హార్మోన్ వ్యవస్థను పరిపుష్టం చేయడం ద్వారా దుష్ఫలితాలేవీ లేకుండా శాశ్వతంగా పీసీఓడీని నయం చేయవచ్చు.
డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్,
సీఎండీ, హోమియోకేర్
పేనుకొరుకుడు తగ్గుతుందా?
మా అమ్మాయి వయసు 24 ఏళ్లు. ఈమధ్య ఒకే దగ్గర వెంట్రుకలు రాలిపోతున్నాయి. అందరూ పేనుకొరుకుడు అంటున్నారు. హోమియోలో దీనికి పరిష్కారం ఉందా?
పేనుకొరుకుడు సమస్యను వైద్యపరిభాషలో అలొపేషియా అంటారు. ఈ కండిషన్‌లో ఒక నిర్ణీత స్థలంలో వెంట్రుకలు పూర్తిగా రాలిపోయి, నున్నగా మారుతుంది. శరీరం తనను తాను రక్షించుకోగలిగే శక్తిని కోల్పోయినప్పుడు జుట్టు రాలిపోతుంటుంది. అలాంటప్పుడు చాలాసార్లు తలపై అక్కడక్కడ ప్యాచ్‌లలాగా ఏర్పడతాయి. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే తన సొంత వ్యాధి నిరోధక శక్తి తన వెంట్రుకలపైనే ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే సమస్య అన్నమాట. ఇది తలలోగానీ, గడ్డంలోగానీ, మీసాలలోగాని ఇది రావచ్చు. ఇది అంటువ్యాధి కాదు. సాధారణంగా 60 ఏళ్లు పైబడిన వారిలో ఈ సమస్య కనిపించదు.
కారణాలు: ∙మానసిక ఆందోళన ∙థైరాయిడ్ సమస్య ∙డయాబెటిస్, బీపీ వంటి సమస్య ఉన్నవాళ్లలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది ∙వంశపారంపర్యంగా ∙కవలల్లో ఒకరికి ఉంటే మరొకరికి వచ్చే అవకాశం ఉంటుంది.
లక్షణాలు: ∙తలపై మొత్తం జుట్టు ఊడిపోయి, బట్టతల లక్షణాలు కనిపిస్తాయి.
∙తలపై అక్కడక్కడ గుండ్రంగా ప్యాచ్‌లలా జుట్టు ఊడిపోతుంది ∙సాధారణంగా గుండ్రగా లేదా అండాకృతితో ఈ ప్యాచ్‌లు ఉంటాయి.
నిర్ధారణ : ఈ సమస్య నిర్దిష్టంగా ఏ కారణం వల్ల వచ్చిందో తెలుసుకోవాలి. ట్రైకోస్కోపీ, బయాప్సీ, హిస్టలాజిక్ పరీక్షలు, పిగ్మెంట్ ఇన్‌కాంటినెన్స్ వంటివే మరికొన్ని పరీక్షలు.
చికిత్స: పేనుకొరుకుడు సమస్యకు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వైద్యులు వ్యాధి కారణాలు, లక్షణాలను పరిగణనలోకి తీసుకొని మందులను సూచిస్తారు. దీనికి హోమియోలో యాసిడ్ ఫ్లోర్, సల్‌ఫర్, ఫాస్ఫరస్, గ్రాఫైటిస్, సెలీనియమ్, సొరినమ్, తుజా వంటి మందులను డాక్టర్ల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది.
డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా,
ఎండీ (హోమియో)
Comments
Please login to add a commentAdd a comment