పిల్లలు పుట్టక మానసిక వ్యథతో కుమిలిపోయిన ఓ మహిళ
అపవాదు నుంచి తప్పించుకునేందుకు.. గర్భవతిని అయ్యానంటూ ఇంట్లో అబద్ధం..
9 నెలలు.. కడుపు చుట్టూ బట్టలు కట్టుకుని..
ఆస్పత్రికి ‘చెకప్’ కోసం వెళ్లి వచ్చిన వైనం..
చివరకు డెలివరీకని ఆస్పత్రికి వచ్చి టాయ్‌లెట్‌లో శిశువు జారి పోయిందని చెప్పి కప్పిపుచ్చే యత్నం..
పిల్లలు పుట్టడం లేదనే బాధతోనే ఇలా చేసిందంటున్న వైద్యులు
జనగామ: ఆమెకు పెళ్లయి మూడేళ్లు అయ్యింది. ఎంతకూ పిల్లలు పుట్టడం లేదు. అంతా ఏమనుకుంటారోనని తనలో తానే కుమిలిపోయింది. మానసికంగా కుంగిపోయింది. ఎలాగైనా ఈ అపవాదు నుంచి తప్పించుకోవాలనుకుంది. ఓ రోజు తాను గర్భం దాల్చినట్లు ఇంట్లో వారికి చెప్పింది. నమ్మకం కుదిరేలా కొద్దిరోజుల తర్వాత కడుపు చుట్టూ బట్టలు కట్టుకోవడం ప్రారంభించింది. నెలకోసారి ఆస్పత్రిలో చూపించుకుంటున్నట్టు కుటుంబసభ్యుల్ని నమ్మించింది.
తొమ్మిది నెలలు అలాగే నెట్టుకొచ్చింది. చివరికి ప్రసవం కోసం అంటూ ఆస్పత్రికి వచ్చి శిశువు టాయ్‌లెట్‌లో జారి పోయిందని విలపిస్తూ చెప్పింది. అలా బయట పడదామని అనుకుంది. కానీ అంతా పరిశీలించిన వైద్యులు, సిబ్బంది చివరకు అదంతా ఉత్తదేనని తేల్చారు. ఈ విచిత్ర ఘటన బుధవారం జనగామ ఎంసీహెచ్‌లో జరిగింది.
నెలనెలా ఆస్పత్రికెళుతున్నానంటూ..
ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని ఓ తండాకు చెందిన మహిళ.. గత ఏడాది డిసెంబర్‌లో జనగామ చంపక్ హిల్స్ మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి (ఎంసీహెచ్) ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం అంటూ వచ్చింది. వైద్యులు పరీక్ష చేయగా నెగిటివ్ వచ్చింది. తర్వాత గత జూలైలో మరోసారి ఆస్పత్రికి వచి్చంది. గర్భవతినని చెప్పడంతో గైనిక్ వైద్యులు హార్ట్ బీట్, స్కానింగ్ తదితర పరీక్షలు చేసుకుని రావాలని సూచించగా వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు.
కానీ ఇంట్లో వారికి నెలనెలా పరీక్షల కోసం ఎంసీహెచ్‌కు వెళుతున్నట్టు చెప్పేది. బుధవారం డెలివరీ డేట్ అని చెప్పి కుటుంబసభ్యులతో కలిసి ఆస్పత్రికి వచ్చింది. గైనిక్ డాక్టర్ ఆమెను పరీక్షించే సమయంలో వాష్‌రూమ్‌కు వెళ్లొస్తానని చెప్పి వెళ్లింది. ఇరవై నిమిషాల తర్వాత బోరున విలపిస్తూ బయటకు వచ్చింది. మూత్ర విసర్జన చేస్తుండగా శిశువు టాయ్‌లెట్‌లోకి జారి పోయిందని చెప్పింది. వెంటనే వైద్యులు, సిబ్బంది అప్రమత్తమై టాయ్‌లెట్‌ను పరిశీలించారు. ఎలాంటి రక్తపు మరకలు కన్పించలేదు. దీంతో టాయ్‌లెట్‌కు అనుబంధంగా ఉన్న డ్రైనేజీ పైపులైన్లను పరిశీలించారు.
శిశువు జాడ లేకపోవడంతో అనుమానం వచ్చిన డాక్టర్లు మహిళను ప్రశ్నించారు. స్కానింగ్ రిపోర్టు ఏదంటూ గట్టిగా నిలదీశారు. దీంతో తనకు గర్భం రాలేదని, ఎంతకూ పిల్లలు పుట్టకపోవడంతో ఇలా చేశానంటూ ఆ మహిళ చెప్పింది. అయితే అప్పటికే ఆ మహిళ కుటుంబసభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి రావడంతో వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు.
అన్ని పరీక్షలూ చేసి ఆమె గర్భం ధరించలేదని, అంతా ఉత్తదేనని నిర్ధారించారు. సదరు మహిళతో పాటు భర్తను సఖి కేంద్రానికి తరలించగా సిబ్బంది కౌన్సెలింగ్ ఇచ్చారు. దీనిపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని సీఐ దామోదర్‌రెడ్డి తెలిపారు. పిల్లలు పుట్టడం లేదనే బాధతో, అమాయకత్వంతో ఆ మహిళ అలా చేసిందని వైద్యులు వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment