పొల్ల సబ్‌సెంటర్‌లో ఉన్న బైక్ అంబులెన్స్
సాక్షి, సీతంపేట(శ్రీకాకుళం) : గిరిజన ప్రాంతాల్లో అత్యవసర వైద్యసేవలు అందించేందుకు ఫీడర్ (బైక్) అంబులెన్స్‌లు మరిన్ని రానున్నాయి. ఆరోగ్య, కుటుంబ సంక్షేమంపై ఇటీవల జరిపిన సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈమేరకు ఆదేశించారు. దీంతో ఈ ప్రతిపాదనకు కదలిక వచ్చింది. మారుమూల గిరిజన ప్రాంతాల్లో ద్విచక్రవాహనాల ద్వారా వైద్యసేవలు మరింత అందుబాటులోకి తీసుకురానున్నారు. 108, 104లతో పాటు ఫీడర్ అంబులెన్స్‌ల సంఖ్య పెంచాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. దీంతో ఇప్పటి వరకు 15 ఉన్న బైక్ అంబులెన్స్‌లు రెట్టింపు కానున్నాయి. సీతంపేట, కొత్తూరు, పాలకొండ, వీరఘట్టం, పాతపట్నం, మందస పీహెచ్‌సీల పరిధిలో 108 అంబులెన్స్‌లు 6 ఉండగా వీటి అనుసంధానంగా ఫీడర్ అంబులెన్స్‌లు 15 ఉన్నాయి. ఎం.సింగుపురం, ఎంఎస్‌పల్లి, ఎస్‌జే పురం, భామిని, బుడంబోకాలనీ, అల్తి, సిరిపురం, బాలేరు, నేలబొంతు, పాలవలస, లబ్బ, కరజాడ, చిన్నబగ్గ, శంబాం, పెద్ద పొల్ల గ్రామాల్లో బైక్ అంబులెన్స్‌లు నడుస్తున్నాయి. వీటితోపాటుగా మరో 15 కొత్తవి కావాలని వైద్యాధికారులు ప్రతిపాదించారు. అలాగే మరో రెండు 108 వాహనాలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇవి వస్తే మారుమూల గ్రామాలన్నింటికీ పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఇదీ పరిస్థితి...
ప్రస్తుతం ఉన్న బైక్ అంబులెన్స్‌లు గతేడాది డిసెంబర్ నుంచి ఈ సంవత్సరం జూన్ వరకు 6,072 మందికి వైద్యసేవలు అందించాయి. ఎపిడమిక్ సీజన్‌లో డయేరియా, మలేరియా కేసులు నమోదవుతుంటాయి. ఇంకా అనుకోని ప్రమాద సంఘటనలు చోటుచేసుకుంటాయి. గర్భిణులకు అత్యవసర వైద్య సేవలు అవసరం. ఈ తరుణంలో అపర సంజీవినిగా పేరుగాంచిన 108లు మారుమూల కొండలపై ఇరుకు రహదారులకు వెళ్లలేని పరిస్థితి ఉంది. అత్యవసర సమయాల్లో రోగులను పీహెచ్‌సీలకు తరలించడానికి ఫీడర్ అంబులెన్స్‌లు అందుబాటులోకి వచ్చాయి. కొండ ప్రాంతాల మారుమూల ప్రాంతాల్లో అంబులెన్స్‌లు వెళ్లలేని గ్రామాలకు వెళ్లి రోగులను నేరుగా ఆసుపత్రులకు గాని 108 అందుబాటులో ఉండే ప్రదేశానికి తీసుకువస్తాయి. గర్భిణులకు ఫీడర్ అంబులెన్స్‌లో సుఖ ప్రసవం అయిన సంఘటనలు కూడా ఉన్నాయి.
అత్యవసర వైద్యానికి బైక్ అంబులెన్స్‌లు
అత్యవసర వైద్యానికి బైక్ అంబులెన్స్‌లు ఎంతో ఉపయోగపడతాయి. ఇప్పటికే 15 నిర్వహిస్తున్నాం. మరో 15 కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదించడం జరిగింది. కొత్తవి వచ్చిన వెంటనే సేవలు ప్రారంభిస్తాం. బైక్ అంబులెన్స్‌లు సకాలం లో సంబంధిత పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో రోగులను చేర్చడానికి ఉపయోగకరంగా ఉంటాయి.
–ఈఎన్‌వీ నరేష్‌కుమార్, డిప్యూటీ డీఎఅండ్‌హెచ్‌వో
మాలాంటి మారుమూల గిరిజనులకు ఉపయోగం
మాలాంటి మారుమూల గిరిజన గ్రామాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. గర్భిణులకు పురిటి నొప్పులు వంటివి వచ్చినపుడు ఏదో ఒక అంబులెన్స్ రావాలని ఫోన్‌లు చేస్తుంటాం. వాటి రాక కోసం ఎదురు చూస్తుంటాం. వాటికి ముందే బైక్ అంబులెన్స్‌లు వస్తే సకాలంలో వైద్యం అందుతుంది.
–ఎస్.రజిని, కోసిమానుగూడ
Comments
Please login to add a commentAdd a comment