చిత్తూరులో స్వైన్‌ఫ్లూ కలకలం : మహిళ మృతి
చిత్తూరు : చిత్తూరు జిల్లాలో స్వైన్‌ఫ్లూ కలకలం సృష‍్టించింది. స్వైన్‌ఫ్లూతో ఓ వివాహిత మృతి చెందడంతో వైద్యాధికారులు అప్రమత‍్తమయ్యారు. ఐరాల మండలం చుక్కావారిపల్లెకు చెందిన జయచంద్రారెడ్డి, జయమ్మ(28)దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు సంతానం. ఐదు రోజుల క్రితం జయచంద్రారెడ్డికి జ్వరం రాగా, చికిత్స తీసుకోవడంతో ఆరోగ్యం కుదటపడింది. మరుసటి రోజు భార్య జయమ్మకు కూడా జ్వరం రావడంతో స్థానికంగా వైద్యం చేయించారు. అయినా కోలుకోకపోవడంతో చిత్తూరులో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ కూడా తగ‍్గకపోవడంతో వేలూరు సీఎంసీకి తీసుకువెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ జయమ్మ సోమవారం మృతి చెందింది. జయమ్మకు స్వైన్‌ప్లూ (హెచ్ 1, హెచ్ 2) సోకినట్లు వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో వారిద్దరి పిల్లలను వైద్య పరీక్షలకు తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. గ్రామస్తులందరికీ వైద్య పరీక్షలు చేస్తున్నట్లు మండల వైద్యాధికారిణి లీలావతి తెలిపారు.
రుయాలో ప్రత్యేక ఏర్పాట్లు...
స్వైన్‌ఫ్లూ వ్యాధి ప్రభావం తిరుపతిలోని వైద్యాధికారులను పరుగులు పెట్టిస్తోంది. తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రం కావడంతో నిత్యం వేలాదిమంది యాత్రికులు, శ్రీవారి భక్తులు తిరుపతికి వస్తుంటారు. పైగా చలి గాలులు, మంచు, గాలిలో తేమ అధికంగా ఉంది. ఈనేపథ్యంలో ఎవరైనా స్వైన్‌ఫ్లూ లక్షణాలతో వస్తే ఆ వైరస్ ఇతరులకు సోకే ప్రమాదం లేకపోలేదని వైద్యాధికారులు భావిస్తున్నారు. దీనిని దృష్టిలో వుంచుకుని రుయా ఆసుపత్రిలో ప్రత్యేకంగా స్వైన్‌ఫ్లూ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఎవరైనా స్వైన్ ఫ్లూ లక్షణాలతో వస్తే వారికి తక్షణమే వైద్య సేవలు అందించేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. రుయా సూపరింటెండెంట్ డాక్టర్ సిద్దానాయక్ ఆదేశాల మేరకు ప్రత్యేక గది, అందులో ఆధునిక వైద్య సదుపాయాలను కల్పించారు. ఇప్పటి వరకు స్వైన్ ఫ్లూ వంటి లక్షణాలతో ఎలాంటి కేసులు నమోదు కానప్పటికీ, ఇద్దరు చిన్నారులకు లక్షణాలు ఉండటంతో వారు కోలుకునేలా పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించేందుకు వైద్యులు సిద్దంగా ఉన్నారు. గదిలో నాలుగు బెడ్లు, వెంటి లేటర్లు, అవసరమైన మందులు ఏర్పాటు చేశారు. వీటిని రుయా సిఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ గీతాంజలి, సిఏఎస్ ఆర్‌ఎంవో డాక్టర్ యు.శ్రీహరి, క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హరిక్రిష్ణ పరిశీలించారు. వైద్యులకు తగు సూచనలు, సలహాలను అందించారు.